రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన

ABN , First Publish Date - 2021-01-27T06:51:32+05:30 IST

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన
ఒంగోలులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

ప్రభుత్వ తీరుపై టీడీపీ నేతల ధ్వజం

రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటింపు

పలు ప్రాంతాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు క్షీరాభిషేకాలు

ఒంగోలు, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. సీఎం అసంబద్ధ చర్యలు నుంచి రాజ్యాంగాన్ని, వ్యవస్థలను కాపాడుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని కోరారు. భారత 72వ గణతంత్ర దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ దినంగా టీడీపీ పాటించింది. మంగళవారం జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పలు ప్రాంతాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు క్షీరాభిషేకాలు, ప్రదర్శనలు నిర్వహించి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరారు. ఒంగోలులోని హెచ్‌సీఎం కాలేజీ సెంటర్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి టీడీపీ ఎస్సీసెల్‌ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ నాయకులు వై.శశికాంత్‌భూషణ్‌, గుర్రాల రాజ్‌విమల్‌, దాసరి వెంకటేశ్వర్లు, నాళం నరసమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు. టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జీ యడం బాలాజీ నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. దర్శిలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారీ ఎత్తున నిరసన తెలిపారు. అలాగే కనిగిరి, పామూరు, సీఎస్‌పురం, ఎస్‌ఎన్‌పాడు, కందుకూరు, కొండపి తదితర ప్రాంతాల్లో టీడీపీశ్రేణులు అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద ప్రదర్శనలు నిర్వహించారు. 


Updated Date - 2021-01-27T06:51:32+05:30 IST