పిల్లలకు ‘మూడో’ ముప్పుపై ఆధారాల్లేవు

ABN , First Publish Date - 2021-06-13T09:00:58+05:30 IST

రాబోయే కరోనా మూడోవేవ్‌.. పిల్లలకు పెనుగండం’ అంటూ ప్రచారం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఊరటనిచ్చే ఓ అధ్యయన నివేదికను ‘ది లాన్సెట్‌’ జర్నల్‌ విడుదల చేసింది. మూడో వేవ్‌ వల్ల పిల్లలే

పిల్లలకు ‘మూడో’ ముప్పుపై ఆధారాల్లేవు

బాలల్లో తేలికపాటి ఇన్ఫెక్షన్లే ఎక్కువ

మరణాల రేటు చాలా తక్కువ 

మృతిచెందిన పిల్లల్లో 40 శాతం 

మందికి దీర్ఘకాలిక వ్యాధులు 

‘ది లాన్సెట్‌ - కొవిడ్‌19 కమిషన్‌ ఇండియా టాస్క్‌ఫోర్స్‌’ నివేదిక


న్యూఢిల్లీ, జూన్‌ 12 : ‘రాబోయే కరోనా మూడోవేవ్‌.. పిల్లలకు పెనుగండం’ అంటూ ప్రచారం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఊరటనిచ్చే ఓ అధ్యయన నివేదికను ‘ది లాన్సెట్‌’ జర్నల్‌ విడుదల చేసింది. మూడో వేవ్‌ వల్ల పిల్లలే ఎక్కువగా ప్రభావితమవుతారని, వారికే తీవ్ర ఇన్ఫెక్షన్లు సోకుతాయని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని స్పష్టంచేసింది. న్యూఢిల్లీ ఎయిమ్స్‌ సహా దేశంలోని పలు ప్రముఖ ఆస్పత్రులకు చెందిన పిల్లల వైద్య నిపుణులతో ‘ది లాన్సెట్‌’ ఏర్పాటుచేసిన ‘కొవిడ్‌-19 కమిషన్‌ ఇండియా టాస్క్‌ఫోర్స్‌’ అధ్యయనంలో ఈవివరాలు వెల్లడయ్యాయి. కొవిడ్‌ బారినపడే పిల్లల్లో సింహభాగం మందిలో ఇన్ఫెక్షన్‌ లక్షణాలు బయటికి కనిపించడం లేదని, ఒకవేళ లక్షణాలు బయటపడినా తేలికపాటి ఇన్ఫెక్షనే ఉంటోందని తెలిపింది.


తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ -ఎన్‌సీఆర్‌ల పరిధిలోని పది ఆస్పత్రుల్లో(ప్రభుత్వ, ప్రైవేటు) కొవిడ్‌ చికిత్సపొందిన పదేళ్లలోపు 2,600 మంది పిల్లల ఆరోగ్య నివేదికలను సేకరించి విశ్లేషించగా ఈ అంశాలు వెలుగుచూశాయని వివరించింది. సర్వే చేసిన కొవిడ్‌ బాధిత పిల్లల్లో మరణాల రేటు 2.4 శాతంలోపే ఉన్నట్లు గుర్తించారు. మృతిచెందిన పిల్లల్లో 40 శాతం మందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని తేలింది. మొత్తం 2,600 మంది కొవిడ్‌ బాధిత పిల్లల్లో 9 శాతం మందికే తీవ్ర ఇన్ఫెక్షన్‌ సోకిందని గుర్తించడం గమనార్హం.  


ఉస్మానాబాద్‌లో 65 మంది పిల్లలకు కరోనా

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లాలో గడిచిన నాలుగు రోజుల్లో 65 మంది చిన్నారులకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. గత నాలుగు రోజుల్లో నమోదైన కొవిడ్‌ కేసుల్లో సగటున 18 శాతం చిన్నారులవే ఉండటం గమనార్హం. 

Updated Date - 2021-06-13T09:00:58+05:30 IST