Advertisement
Advertisement
Abn logo
Advertisement

పౌలుపై కురిసిన కరుణ

సు క్రీస్తు బోధలకూ, ఆయన ప్రవచించిన మార్గానికీ విస్తృతమైన ప్రాచుర్యం కల్పించినవాడు అపొస్తలుడైన పౌలు. మొదట్లో అతనికి దైవం పట్ల విశ్వాసం లేదు. అటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు పెనుమార్పులు తెచ్చాడు. తిమోతికి అతను రాసిన లేఖలోని అంశాలను గమనిస్తే ఈ సంగతులన్నీ తెలుస్తాయి. ‘‘నాకు ఇంతటి బలాన్ని ఇచ్చిన మన ప్రభువు ఏసుకు నేను కృతజ్ఞుణ్ణి. తన పరిచర్యకు నమ్మకమైన వ్యక్తిగా నన్ను ఎంచుకొని, నియమించడమే దీనికి కారణం. వాస్తవం చెప్పాలంటే... ఒకప్పుడు నేను దేవుణ్ణి దూషించేవాణ్ణి. ఇతరులను హింసించేవాణ్ణి, అయితే అవన్నీ నేను తెలియక చేశాను. విశ్వాసం లేకపోవడం వల్ల అలా ప్రవర్తించాను. ఇది తెలుసు కాబట్టే మన ప్రభువైన ఆయన నా మీద కరుణనూ, అనంతమైన దయనూ చూపించాడు. నేను ఏసు నుంచి విశ్వాసాన్నీ, ప్రేమను పొందాను. నేను చెబుతున్న ఈ మాటలు సత్యమైనవి. వీటిని పూర్తిగా అంగీకరించవచ్చు. పాపులను రక్షించడం కోసం ఈ లోకానికి ఏసు ప్రభువు వచ్చాడు. ఆ పాపులందరిలోనూ పెద్ద పాపిని నేను. అయినప్పటికీ... తన ఓర్పును నా ద్వారా పూర్తిస్థాయిలో ప్రదర్శించాలని ఆయన అనుకున్నాడు. అందుకే పెద్ద పాపినైన నా మీద ఆయన తన కరుణ కురిపించాడు. శాశ్వతమైన జీవితాన్ని ఆశిస్తూ.. తన మీద విశ్వాసాన్ని ఉంచబోయే వారికి ఒక ఉదాహరణగా నేను ఉండాలనే అలా చేశాడు అంటూ ఆ లేఖలో పౌలు వెల్లడించాడు. 

ఒక వ్యక్తి గత జీవితాన్నీ, అతను ఎప్పుడు విశ్వాసి అయ్యాడనే విషయాన్నీ దైవం పట్టించుకోడు. వారిని తన మార్గంలోకి తీసుకువస్తాడు. వారిలో విశ్వాసాన్ని కలిగిస్తాడు. అత్యున్నత స్థానం అందిస్తాడు. అటువంటి విశ్వాసులకు దేవుడి దయ అపారంగా లభిస్తుంది. దానికి పౌలు జీవితమే ఉదాహరణ. 

Advertisement
Advertisement