చక్రతీర్థ స్నానాలకు వంశధారలో నీరేది?

ABN , First Publish Date - 2020-02-23T07:27:50+05:30 IST

శ్రీముఖలింగం సమీపంలో వంశధార నదిలో పూర్తిస్థాయిలో నీరు లేదు. దీంతో

చక్రతీర్థ స్నానాలకు వంశధారలో నీరేది?

శ్రీముఖలింగం (జలుమూరు) ఫిబ్రవరి 22: శ్రీముఖలింగం   సమీపంలో వంశధార నదిలో పూర్తిస్థాయిలో నీరు లేదు. దీంతో ఉత్సవాల ఆఖరి రోజు సోమవారం  చక్రతీర్థ స్నానాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  లక్షలాదిగా తరలివచ్చే భక్తజనం ఇసుక తిన్నెలపై స్నానాలు సాధ్యమైనా అనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. వాస్తవంగా మహాశివరాత్రి ఉత్సవాలు చివరి రోజున పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలకు సంప్రదాయబద్ధంగా పూజలుచేసి వంశధార నది మిరియాపల్లి రేవులో చక్రతీర్థ స్నానాలు చేయిస్తారు. 


ఇదే సమయంలో భారీగా భక్తులు నదిలో స్నానాలు ఆచరించనున్నారు.  అయితే అంతమంది స్నానాలు చేయడానికి సరిపడా నీరు ప్రస్తుతం వంశధారలో లేదు. మరి ఇసుక తిన్నెల్లో ఎలా స్నానాలు చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో గొట్టా బ్యారేజీ నుంచి నీటిని విడిచిపెట్టాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై వంశధార డీఈ ప్రభాకరరావు మాట్లాడుతూ.. గొట్టాబ్యారేజీలో కావాల్సిన నీరు నిల్వ ఉందన్నారు. చక్రతీర్థస్నానాలకు సరిపడా నీరు విడచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఐదు రోజుల కిందట వంశధారకు 230 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినట్లు చెప్పారు. మిరియాపల్లి రేవులో బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నందున నీటిప్రవాహం తగ్గించామన్నారు. సోమవారం చక్రతీర్థస్నానాల సమయానికి అధికారుల సూచనల మేరకు  నీటిని విడిచిపెడతామన్నారు. 


ఇదిలా ఉండగా  వంశధారనది మిరియాపల్లి రేవుకు వెళ్లే రహదారి ఈ ఏడాది కూడా విస్తరణకు నోచుకోలేదు. దీంతో ఆలయం నుంచి నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరులను ఊరేగింపుగా తీసుకెళ్లడానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఉత్తర దిశగా  గ్రామం శివారు నుంచి 500 మీటర్ల వరకు సరైన రహదారి లేదు. దీంతో పొలాల నుంచి స్వామి వారిని తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఏటా ఉత్సవాల సమయంలోనే ఈ రహదారి విస్తరణపై చర్చించే జిల్లా అఽధికారులు ఆ తర్వాత దాని ఊస్తెత్తడం లేదు.  గత పదేళ్లుగా ఇదే తంతు జరుగుతుంది.   


దీంతో   చక్రతీర్థస్నానాలకు స్వామివారి వెనుక ఊరేగింపుగా వెళ్లే భక్తులకు కష్టాలు తప్పడం లేదు. గ్రామం శివారు నుంచి 500 మీటర్లు మేర పొలాల్లో మొక్కజొన్న పంట ఉన్నప్పటికీ  అధికారులు రైతులను ఒప్పించి  స్వామివారు వెళ్లడానికి అన్ని చర్యలు చేపడుతున్నారు. 


Updated Date - 2020-02-23T07:27:50+05:30 IST