Abn logo
Jul 21 2021 @ 03:19AM

‘ఇన్‌సైడర్‌’ లేదు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానంలోనూ వీగిపోయింది. రాజధాని ఎక్కడో యావత్‌ ప్రపంచానికి తెలిసిన తరువాత ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు అవకాశం ఎక్కడిదని ప్రశ్నిస్తూ, లేదని నిర్థారిస్తూ, సీఐడీ పలువురిపై నమోదు చేసిన కేసులను కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గతంలో తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. దానిని సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లను ద్విసభ్య ధర్మాసనం సోమవారం కొట్టివేసింది. ఈ తీర్పు తరువాతైనా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమరావతిమీద బురదజల్లే కార్యక్రమాన్ని మానుకుంటుందా, రాజధానిగా గౌరవిస్తుందా? అని విపక్షనేతలు, రైతులు ప్రశ్నిస్తున్నారు.


హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు పూర్తిగా, గట్టిగా సమర్థించింది. అనేకానేక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు తొందరపాటుగా తీర్పు ఇచ్చిందన్న రాష్ట్ర ప్రభుత్వం వాదనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టు విస్తృత విచారణతో చక్కని పరిశీలనలను చేసిందనీ, వాటిలో తప్పులూ వక్రతలేవీ లేవని సుప్రీంకోర్టు అన్నది. కొనుగోలుదారులు మోసం చేసిందీ లేదు, ఏ విక్రయదారుడికీ నష్టం వాటిల్లిందీ లేదు అంటూ అమరావతి భూముల క్రయవిక్రయాల్లో అంతా సవ్యంగానే ఉన్నదని సుప్రీంకోర్టు నిర్థారించింది.


రాజధాని భూములపై ఆరేళ్ళపాటు ఫిర్యాదులు, వివాదాలు లేకపోగా, కొత్త ప్రభుత్వం రావడంతో ఎవరో తెరమీదకు హఠాత్తున వచ్చి ఫిర్యాదు చేయడం, ప్రభుత్వం హడావుడి ప్రాసిక్యూషన్‌కు ఉపక్రమించడం సుప్రీంకోర్టు సైతం గమనించింది. 


సీఐడీకి ఫిర్యాదు చేసినవారు సేల్‌డీడ్‌ కుదర్చుకున్నవారు కాదనీ, నేరతీవ్రత, దురుద్దేశం వంటి భారీ మాటల మాటున, ప్రజాప్రయోజనాల పరిరక్షణ చాటున తెరమీదకు వచ్చినవారని న్యాయమూర్తులకు అర్థమైంది. అసలు విక్రయదారులకు ఏ అభ్యంతరాలు లేనిదశలో, భూమిఅమ్మకందారు కాని ఓ వ్యక్తి ఇలా ఆరేళ్ళతరువాత వచ్చి ఫిర్యాదు చేయడమేమిటని హైకోర్టు గతంలోనే ప్రశ్నించింది. 


కొనుగోలుదారులు అమరావతిలో రాజధాని వస్తున్న నిజాన్ని రహస్యంగా దాచిపెట్టారని ఒకపక్కన అంటూనే, రాజధాని ఏర్పాటుకు సంబంధించిన అంశాలన్నీ 2014 జూన్‌నుంచే పబ్లిక్‌డొమైన్‌లో ఉన్న విషయాన్నీ, అదే ఏడాది అక్టోబర్‌లో తుళ్ళూరు మండలం 17 గ్రామాల పరిధిలో రాజధాని వస్తుందంటూ ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చిన విషయాన్నీ ఫిర్యాదిదారు అంగీకరిస్తున్నారు. ఈ కారణంగానే, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నీ అందరికీ తెలిసినవే అయినప్పుడు అందులో మోసం, విశ్వాసఘాతుకం ఎక్కడివి? అని హైకోర్టు ప్రశ్నించి, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు ఆస్కారమే లేదనీ, ప్రభుత్వ వాదనల్లో పసలేదనీ నిర్థారించింది. దర్యాప్తు పేరిట మరికొంతకాలం అమరావతిపై అమలుచేస్తున్న కుట్రను కొనసాగించాలన్న ప్రభుత్వ ఆలోచనకు హైకోర్టు తన తీర్పుతో ప్రాథమికస్థాయిలోనే అడ్డుకట్టవేసిందీ ఇందుకే. ఒక సివిల్‌ ఒప్పందం మీద క్రిమినల్‌చర్యలు తీసుకోవచ్చునా లేదా అన్న వాదనలను అటుంచితే, 2014లావాదేవీలపై ఆరేళ్ళ తరువాత ఫిర్యాదు నమోదుకావడానికి అంతకు ఏడాదిక్రితం ప్రభుత్వం మారడం తప్ప మరేకారణమూ లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సైతం చక్కగా అర్థమయ్యే పెద్దగా నవ్వారు. 


రాజధాని ఎక్కడన్నదానిలో ఏ రహస్యమూలేదు, కొనుగోలుదారులు మోసం చేసినట్టుగా, అమ్మకందారులకు నష్టం వాటిల్లినట్టుగా ఆధారాలూ లేవు, అమ్మకందారులకూ, కొనుగోలుదారులకూ మధ్య న్యాయపరమైన సంబంధమూ లేదు కనుకనే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సంపూర్ణంగా సమర్థించింది. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి ఈ తీర్పు పెద్ద చెంపపెట్టు. 2014జూన్‌ మొదలు అమరావతి నోటిఫికేషన్‌ వరకూ పత్రికల్లో వచ్చిన కథనాలను, ప్రభుత్వం చేస్తూవచ్చిన ప్రకటనలనూ ఉటంకిస్తూ రాజధాని భూముల్లో ఏ రహస్యమూ లేదంటూ హైకోర్టు విస్తృతమైన తీర్పు ఇచ్చిన తరువాత కూడా, ల్యాండ్‌పూలింగ్‌లో అసైన్డ్‌భూములున్నాయన్న కొత్త ఆరోపణను ప్రభుత్వం తెరమీదకు తెచ్చి, కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణల్లో నిజానిజాలు పాలకులకు తెలియనివేమీ కావు. కానీ, ఇతరత్రా దురుద్దేశాలతో అమరావతిని నాశనం చేయాలని సంకల్పించినందున ఏవో కుట్రలు తెరమీదకు తెస్తూనే ఉన్నారు.