ఆదిలాబాద్‌ జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం లేదు

ABN , First Publish Date - 2021-06-24T07:07:29+05:30 IST

జిల్లాలో 15 ఏళ్లుగా ఎలాంటి మావోయిస్టుల దుశ్చర్యలు చోటు చేసుకోలేదని ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్ర పేర్కొన్నారు. బుధవారం డీజీపీ మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి జిల్లా ఎస్పీలకు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో ఎస్పీ పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం లేదు
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎస్పీ రాజేశ్‌చంద్ర, పోలీసులు

ఆదిలాబాద్‌టౌన్‌, జూన్‌ 23 :జిల్లాలో  15 ఏళ్లుగా ఎలాంటి మావోయిస్టుల దుశ్చర్యలు చోటు చేసుకోలేదని ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్ర పేర్కొన్నారు. బుధవారం డీజీపీ మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి జిల్లా ఎస్పీలకు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఇద్దరు మావోయిస్టుల్లో బోథ్‌ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన మైలారపు అడెల్లు ఆలియాస్‌ భాస్కర్‌ 30 ఏళ్ల నుంచి మావోయిస్టుల దళంలో రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ సభ్యుడి హోదాలో దండ కారణ్య సౌత్‌జోన్‌ కమిటీలో పని చేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. బజార్‌ హత్నూర్‌ మండలం డెడ్రా గ్రామానికి చెందిన మహిళా మావోయిస్టు దాసర వాడ్‌ సుమన అలియాస్‌ సంగీతక్క ఏరియా కమిటీ మెంబర్‌గా దండకారణ్య  సౌత్‌జోన్‌ కమిటీ దళంలో పని చేస్తున్నట్లు తెలిపారు. వారి స్వస్థలంలో కుటుంబ సభ్యులు, వయస్సు పైబడి నిస్సాహాయులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడు తున్నట్లు తెలిపారు. చివరి దశలోనైనా లొంగిపోయి కుటుంబ సభ్యులతో కలిసి జనజీవన స్రవంతి మధ్య ప్రశాంతంగా శేష జీవితాన్ని కొనసాగించవచ్చని తెలిపారు. పదేళ్ల నుంచి మావోయిస్టులు జిల్లాలో ప్రవేశించి ఉనికి చాటే ప్రయత్నం చేస్తున్న సాధ్యం కావడం లేదని తెలిపారు. జిల్లాలో అక్షరాస్యత, అభివృద్ధి చెందడంతో జిల్లాలో మరోసారి మావోయిస్టులకు చోటు దక్కదన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసులతో నిరరంతర కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుందని, మావోయిస్టులు లొంగిపోవడం తప్ప ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గం లేదన్నారు. లొంగి పోయిన మావోయిస్టులకు వారిపై ఉన్న రివార్డులను సత్వరమే అందజేసి పునరావాస చర్యకు పూర్తి సహాకారం అందిస్తామన్నారు. ఈసమావేశంలో ఓఎస్టీ హర్షవర్ధన్‌ శ్రీవాస్తవ్‌, ఉట్నూర్‌ డీఎస్పీ ఎన్‌.ఉదయ్‌రెడ్డి, ఎన్‌ఎస్వీ వెంకటేశ్వరరావు, ఎన్‌ఐబీ హెడ్‌కానిస్టేబుల్‌ గిన్నెల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T07:07:29+05:30 IST