కేన్సర్‌ వల్ల రొమ్ము కోల్పోవలసిన అవసరం లేదు

ABN , First Publish Date - 2021-04-13T06:37:38+05:30 IST

లేట్‌ మ్యారేజ్‌, పిల్లలకు పాలివ్వకపోవడం, రక్తసంబంధీకుల్లో రొమ్ము కేన్సర్‌, చిన్న వయసులో రజస్వల కావడం, 55 ఏళ్లు నిండినా నెలసరి ఆగకపోవడం లాంటి రిస్క్‌ ఫ్యాక్లర్ల గురించి తెలిసినా, రొమ్ముల్లో గడ్డ తగిలినప్పుడు కేన్సర్‌గా అనుమానించి

కేన్సర్‌ వల్ల రొమ్ము కోల్పోవలసిన అవసరం లేదు

లేట్‌ మ్యారేజ్‌, పిల్లలకు పాలివ్వకపోవడం, రక్తసంబంధీకుల్లో రొమ్ము కేన్సర్‌, చిన్న వయసులో రజస్వల కావడం, 55 ఏళ్లు నిండినా నెలసరి ఆగకపోవడం లాంటి రిస్క్‌ ఫ్యాక్లర్ల గురించి తెలిసినా, రొమ్ముల్లో గడ్డ తగిలినప్పుడు కేన్సర్‌గా అనుమానించి అప్రమత్తం కాకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు ఉంటారు. నిజానికి గడ్డ ఒక సెం.మీ సైజులో చేతికి తగలనంత చిన్నదిగా ఉన్నప్పుడే కనిపెట్టగలిగితే చికిత్స తేలిక అవడమే కాకుండా పూర్తిగా నయం చేయడానికి సాధ్యపడుతుంది. 


రొమ్ము సైజులో మార్పులు, చనుమొన నుంచి రక్తస్రావం, గడ్డ స్పష్టంగా తగలడం, పరిమాణంలో పెద్దదిగా ఉండి నొప్పి ఉంటే కేన్సర్‌ దశ ముదిరిపోయి, మిగతా అవయవాలకూ వ్యాపించిందని అర్థం. గడ్డ చిన్నదిగా ఉన్నప్పుడు నొప్పి, ఇబ్బంది ఉండదు కాబట్టి నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఎక్కువ. క్రమం తప్పకుండా 20 ఏళ్ల వయసు నుంచి రొమ్ములను పరీక్షించుకుంటూ అలా్ట్రసౌండ్‌, మామోగ్రామ్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలతో రొమ్ము కేన్సర్‌ మీద ఓ కన్నేసి ఉంచాలి. కేన్సర్‌ అని తేలితే రొమ్ము తొలగించుకోవలసి వస్తుందని పరీక్షలకు సంశయించేవారూ ఉంటారు. కానీ నిజానికి కేన్సర్‌ సోకిన రొమ్ము చికిత్సలో భాగంగా ప్లాస్టిక్‌ సర్జన్‌ బ్రెస్ట్‌ కన్జర్వేషన్‌ పద్ధతి ద్వారా ఆంకోప్లాస్టిక్‌ బ్రెస్ట్‌ సర్జరీ చేస్తారు. సర్జన్‌ కణితిని తొలగించే సమయంలో రొమ్ము ఆకారం దెబ్బతినకుండా ప్లాస్టిక్‌ సర్జన్‌ సహకారం తీసుకుంటారు. వక్షోజ పరిమాణం, గడ్డ సైజుల మీద సర్జరీ ఆధారపడి ఉంటుంది. గడ్డ 2 సెం.మీ కంటే చిన్నదిగా ఉన్నప్పుడు గడ్డ మేరకు తొలగించే లంపెక్టమీ, 5 సెం.మీ కంటే పెద్దదిగా ఉన్నప్పుడు మాస్టెక్టమీ చేస్తారు. రొమ్ము తొలగించిన ప్రదేశంలో రొమ్ము ఆకారాన్ని నిర్మించడమే బ్రెస్ట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సర్జరీ ఉద్దేశం. అయితే రొమ్ము కేన్సర్‌ను ముందుగానే గుర్తించగలిగితే బ్రెస్ట్‌ మొత్తం తొలగించకుండా బ్రెస్ట్‌ కన్జర్వేషన్‌ చేయవచ్చు. అలాకాకుండా రొమ్ముతో పాటు ఇతర అవయవాలకూ వ్యాధి వ్యాపించినప్పుడు రోగి నాణ్యమైన జీవితం గడిపేలా పాలియేటివ్‌ కేర్‌ అందించడం తప్ప ప్రాణాలు కాపాడడం కష్టం. 


కాబట్టి వైద్యుల సలహా మేరకు మామోగ్రామ్‌, అలా్ట్రసౌండ్‌ పరీక్షలు చేయించి, అనుమానం ఉంటే బయాప్సీ చేయించాలి. చెస్ట్‌ ఎక్స్‌రే, బోన్‌ స్కాన్‌, సిటి స్కాన్‌ పరీక్షలతో ఇతర భాగాలకు వ్యాపించిన కేన్సర్‌ను గుర్తించవచ్చు. రొమ్ము గట్టిగా ఉన్నవారికి మామోగ్రామ్‌ కంటే అలా్ట్రసౌండ్‌ పరీక్షలో సరైన ఫలితం కనిపించవచ్చు. రొమ్ములో మార్పులను ఎమ్మారైతో, బయోకెమికల్స్‌లో మార్పులను ఎమ్‌ఆర్‌ స్పెస్ట్రోస్కోపీతో కనిపెట్టవచ్చు. ఈ పరీక్షలతో కేన్సర్‌ దశ, గ్రేడింగ్‌ తెలుస్తాయి. సర్జరీ తర్వాత రేడియేషన్‌, కీమోథెరపీ, టొమాక్సఫిన్‌ వంటి హార్మోన్‌ థెరపీ కాలపరిమితిని వైద్యులు అంచనా వేస్తారు. ట్రీట్మెంట్‌ తర్వాత కూడా క్రమం తప్పకుండా వైద్యుల సూచనమేరకు వైద్యపరీక్షలు చేయించుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో మసలుకోవాలి. 

డాక్టర్‌ సి.హెచ్‌ మోహన వంశీ, చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, ఒమేగా హాస్పిటల్స్‌, హైదరాబాద్‌. ఫోన్‌: 9848011421

Updated Date - 2021-04-13T06:37:38+05:30 IST