పాజిటివ్‌ లేని పెదపాలెం

ABN , First Publish Date - 2021-05-14T08:31:50+05:30 IST

ప్రపంచంలోని దాదాపు ఏ ప్రాంతాన్నీ కొవిడ్‌ వదల్లేదు. మరోవైపు వ్యాక్సిన్లు ఎప్పుడు అందుతాయో తెలియదు. ఈ పరిస్థితుల్లో మనం చేయగలిగిందల్లా భౌతిక దూరం పాటిం

పాజిటివ్‌ లేని పెదపాలెం

ప్రపంచంలోని దాదాపు ఏ ప్రాంతాన్నీ కొవిడ్‌ వదల్లేదు. మరోవైపు వ్యాక్సిన్లు ఎప్పుడు అందుతాయో తెలియదు. ఈ పరిస్థితుల్లో మనం చేయగలిగిందల్లా భౌతిక దూరం పాటించడం, మాస్కులు తప్పనిసరి చేయడం, శానిటైజర్లను రోజువారీ వినియోగవస్తువుగా చేసుకోవడం, చీటికీమాటికీ బయటకు రాకపోవడం. నిజంగానే ఈ స్వీయ నియంత్రణలు పాటిస్తే కొవిడ్‌కు చిక్కే చాన్సే ఉండదు. సందేహాలేమైనా ఉంటే ఈ ఊరి కఽథను చదివేయండి


కొవిడ్‌కు చిక్కని కృష్ణాజిల్లా గ్రామం

గుడ్లవల్లేరు, మే 13: ప్రపంచంలోని దాదాపు ఏ ప్రాంతాన్నీ కొవిడ్‌ వదల్లేదు. మరోవైపు వ్యాక్సిన్లు ఎప్పుడు అందుతాయో తెలియదు. ఈ పరిస్థితుల్లో మనం చేయగలిగిందల్లా భౌతిక దూరం పాటించడం, మాస్కులు తప్పనిసరి చేయడం, శానిటైజర్లను రోజువారీ వినియోగవస్తువుగా చేసుకోవడం, చీటికీమాటికీ బయటకు రాకపోవడం. నిజంగానే ఈ స్వీయ నియంత్రణలు పాటిస్తే కొవిడ్‌కు చిక్కే చాన్సే ఉండదు. సందేహాలేమైనా ఉంటే ఈ ఊరి కఽథను చదివేయండి.. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు శివారు గ్రామం పెదపాలెం. ఈ గ్రామంలో 120 కుటుంబాలు, 315 మందికి పైగా ప్రజలు ఉన్నారు. అన్నీ వ్యవసాయాధారిత కుటుంబాలే. కట్టుగా ఉండటం, కలిసి నిర్ణయాలు తీసుకొనే అలవాటు పెదపాలేనికి చుట్టుపక్కల ఊళ్ల దృష్టిలో పెద్దరికం తెచ్చిపెట్టింది. గతేడాది మార్చిలో దేశమంతటా కొవిడ్‌ కేసులు పెరుగుతూ, తొలిసారి లాక్‌డౌన్‌ ప్రకటించిన  సమయంలో గ్రామస్థులంతా సమావేశమయ్యారు. కరోనా తమ గ్రామంలోకి రాకుండా ఏమేమి చేయవచ్చనేది ఆలోచించారు.


కొన్ని కఠిన ఆంక్షలు తమకు తామే విధించుకొన్నారు. అప్పట్లో పాటించాలని వారు నిర్ణయించుకొన్న స్వీయ నియంత్రణలే గత 14 నెలలుగా పెదపాలేనికి శ్రీరామరక్షగా నిలిచాయి. పెదపాలెంలో ఇంతవరకు ఒక్క పాజిటివ్‌ కేసూ నమెదుకాలేదు. ఇందుకు గ్రామమంతా పాటించిన నిబంధనలు ఆసక్తికరం. అనుసరణీయం. కరోనా తగ్గే వరకూ తమ గ్రామానికి బంధువులు రావడాన్ని, తాము బయట ఊళ్లకు వెళ్లడాన్ని రెండింటినీ నిషేధించారు. బంధుమిత్రులకు ఈ నియమాలు ముందుగానే తెలియపరిచి, విపత్తును అధిగమించే వరకు రాకపోకలు  వద్దని నిర్ద్వంద్వంగా చెప్పేశారు. వేరేగ్రామం నుంచి కూలీపనులకు పిలుపువచ్చినా మొత్తం గ్రామమే తిరస్కరిస్తోంది. సరుకులు, కూరగాయలు కావాలంటే అందరూ ఒక్కసారే రహదారులపైకి రారు. కొన్ని కుటుంబాలకు కలిపి ఒకరు చొప్పున ప్రధాన గ్రామంలో సంత జరిగే రోజున అక్కడికి వెళ్లి కావలసినవి తెచ్చుకోవడం చేస్తున్నారట! మాస్కు ధరించే పొలం పనుల్లో పాల్గొంటున్నారు పెదపాలెం గ్రామస్థులు. 


కొవిడ్‌పై పోరాడుతున్నారిలా..

బంధువులను గ్రామానికి రానీయడం లేదు

ప్రయాణాలు పూర్తిగా బంద్‌

కూలి పనులకు బయటఊళ్లకు వెళ్లరు.

కొన్ని కుటుంబాలకు కలిపి ఒకరు చొప్పున వెళ్లి సరుకులు తెచ్చుకొంటారు

మాస్కులు ధరించే పొలం పనుల్లో పాల్గొంటారు.


అందుకే మేం సురక్షితం..

కొంతకాలంగా ఎక్కడికీ వెళ్లడం లేదు. అలాగే ఎవ్వరినీ ఇంటికి పిలవడం లేదు. అవసరం ఉన్నప్పుడే బయటికి వస్తున్నాం. ఇలా స్వీయ లాక్‌డౌన్‌ పాటిస్తూ, ప్రభుత్వ నిబంధనలను తు.చ. తప్పక పాటించడంవల్లే మా గ్రామం కొవిడ్‌ బారిన పడలేదు.        

  - ఈశ్వర్‌, పెదపాలెం


శుభకార్యాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు 

‘‘ఊళ్లో పేరంటాలు, శుభకార్యాలు తగ్గించుకున్నాం. తప్పనిసరి కార్యక్రమాలను గ్రామంలో అతి తక్కువ మందితో గ్రామపెద్దల ఆదేశాల ప్రకారం చేసుకొంటున్నాం. బాగుంటే పండగలు ఎప్పుడైనా చేసుకోవచ్చు’’         


- నాగమణి, పెదపాలెం


ఒక్క పాజిటివ్‌ కేసూ లేదు.. 

‘‘ప్రజల కఠినమైన క్రమశిక్షణే గ్రామానికి రక్షణగా నిలిచింది. గ్రామమంతా ఒకే మాట మీద నిలిచి నిబంధనలు కచ్చితంగా పాటించారు. అందుకే ఇక్కడ ఒక్క పాజిటివ్‌ కేసు రాలేదు.’’                                                  

- వెంకటరత్నం, పెదపాలెం పంచాయతీ కార్యదర్శి

Updated Date - 2021-05-14T08:31:50+05:30 IST