ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ లేనే లేదు!

ABN , First Publish Date - 2021-07-20T07:35:33+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న జగన్‌ ప్రభుత్వ వాదన వీగిపోయింది.

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ లేనే లేదు!

  • అమరావతి భూములపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు సక్రమమే
  • అమ్మినవారికి నష్టం జరగలేదు
  • కొనుగోళ్లలో మోసం ప్రశ్నే లేదు
  • ఎందుకు కొంటున్నామో చెప్పాలని లేదు
  • సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ
  • ఏపీ ప్రభుత్వ పిటిషన్లు కొట్టివేత


న్యూఢిల్లీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న జగన్‌ ప్రభుత్వ వాదన వీగిపోయింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ లేదని తేల్చి.. పలువురిపై సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేసిన సుప్రీం కోర్టు.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సక్రమంగానే ఉందని తేల్చింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన ఆరు పిటిషన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం కొట్టివేసింది. ‘భూ కొనుగోళ్లలో ఏ విక్రయదారుడికీ నష్టం జరగలేదు. కొనుగోలుదారులు మోసం చేసిన ప్రశ్నే లేదు. భూములు ఎందుకు కొంటున్నదీ చట్ట ప్రకారం కచ్చితంగా చెప్పాలని లేదు. ఈ కోణంలో రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో వాదించలేదు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లోనూ దానిని కారణంగా చూపలేదు’ అని పేర్కొంది. హైకోర్టు విస్తృతంగా విచారణ జరిపిందని, తన తీర్పులో పేర్కొన్న పరిశీలనల్లో వక్రత లేదని తేల్చిచెప్పింది. విచారణ సందర్భంగా ఏపీ సర్కారు తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. ‘ఈ కేసులో చాలా ముఖ్యమైన ఐపీసీ సెక్షన్‌ 418ను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ సెక్షన్‌ ప్రకారం.. తెలిసి మరీ మోసం చేయడం నేరం. హైకోర్టు తీవ్రమైన పొరపాటు చేసింది. 


ఆస్తుల బదిలీ చట్టంలోని సెక్షన్‌ 55ను తన తీర్పులో ప్రస్తావించింది. కానీ అదే సెక్షన్‌లోని సబ్‌ క్లాజ్‌ 5(ఏ) ప్రకారం.. భూముల విలువ పెరుగుదలకు సంబంధించి విక్రయదారులకు కొనుగోలుదారులు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ సెక్షన్‌లో ఇదే ముఖ్యమైన కోణం. కానీ ఈ అంశాన్ని హైకోర్టు తన తీర్పులో ప్రస్తావించలేదు. ఈ కేసులో దీని ఆధారంగానే ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి దగ్గరగా ఉండడం వల్ల.. రాజధాని కచ్చితంగా ఎక్కడ వస్తుందోనన్న సంగతి కొనుగోలుదారులకు ముందే తెలుసు. విక్రేతలకు ఆ విషయం తెలియదు.  కొనుగోలుదారులు విక్రేతలకు ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పాల్సిందే. లేదంటే మోసం చేసినట్లే. అప్పుడు ఐపీసీ సెక్షన్‌ 418 వర్తిస్తుంది. ట్రయల్‌ జరుగుతున్నప్పుడు డిశ్చార్జ్‌ పిటిషన్లు దాఖలు చేయడం నిందితుల హక్కు. కానీ ప్రాథమిక స్థాయిలోనే హైకోర్టు జోక్యం చేసుకుని దర్యాప్తును నిలిపివేయడం సరికాదు.  మేం (రాష్ట్రప్రభుత్వం) ఇప్పుడు ఎవరినీ దోషిగా తేల్చట్లేదు. దర్యాప్తును కొనసాగనివ్వాలి. నేరం జరిగిందా లేదా అన్నది ట్రయల్‌, దర్యాప్తు తేల్చుతాయి. నిందితులు నిర్దోషులు కావచ్చు. కానీ ఆ విషయాన్ని దర్యాప్తు, ట్రయల్‌ కోర్టు తేల్చాలి. ఈ భూలావాదేవీలు చట్టపరంగా మోసపూరితం’ అని దవే పేర్కొన్నారు. 


నిష్పక్షపాతం: శ్యామ్‌ దివాన్‌

పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉన్న కిలారు రాజేశ్‌, శ్రీహాస తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ వాదనలు వినిపించారు. హైకోర్టు తీర్పు నిష్పక్షపాతంగా, సమతుల్యంగా ఉందన్నారు. తీర్పును సవాల్‌ చేయడానికి అసలు కారణమే లేదని స్పష్టం చేశారు. ‘రాజధాని విజయవాడ-గుంటూరు ప్రాంతాల్లో వస్తుందని పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ పరిణామాల రీత్యా భూకొనుగోళ్లకు సంబంధించి సివిల్‌ ఒప్పందం జరిగి ఆరేళ్లు గడచిన తర్వాత మూడో వ్యక్తి ఎవరో ఫిర్యాదు చేస్తే క్రిమినల్‌ చర్యలను ప్రారంభించడం సరికాదు.’ అని తెలిపారు. ‘2014 భూలావాదేవీలపై 2020లో ఎందుకు ఫిర్యాదు చేశార’’ని దివాన్‌ అడిగిన ప్రశ్నకు.. ‘‘2019లో ప్రభుత్వం మారింది. అందుకే అప్పుడు ఫిర్యాదు వచ్చింది. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు వచ్చింది కాబట్టి దీనిని ఆలస్యమని అనలేం’’ అని దవే అన్నారు. దాంతో న్యాయమూర్తులు పెద్దగా నవ్వారు. కాగా.. భూముల కొనుగోలు సమయంలో కొనుగోలుదారులు ఉద్దేశపూర్వకంగానే రాజధాని విషయాన్ని చెప్పలేదని.. సీఐడీకి ఫిర్యాదు చేసిన సలివేంద్ర సురేశ్‌ తరఫు  న్యాయవాది పారస్‌ కుహాడ్‌ తెలిపారు. రాజధాని ఏర్పాటుపై 2014 అక్టోబరులో ‘ఆంధ్రజ్యోతి’తోపాటు, మరో ఆంగ్లపత్రికలో వచ్చిన కథనాలను ప్రస్తావించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్‌లో అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-07-20T07:35:33+05:30 IST