ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు: పురందేశ్వరి

ABN , First Publish Date - 2020-05-28T15:59:38+05:30 IST

నందమూరి తారకరామారావు 97వ జన్మదినమని, ఆయనకు నిజమైన నివాళి..

ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు: పురందేశ్వరి

హైదరాబాద్: నందమూరి తారకరామారావు 97వ జన్మదినమని, ఆయనకు నిజమైన నివాళి.. ఎన్టీఆర్ ఆశయాలను, సిద్దాంతాలను కొనసాగించమేనని దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. గురువారం ట్యాంక్‌బండ్‌ దగ్గర ఎన్టీఆర్‌ ఘాట్‌లో ఆమె పుష్పగుచ్ఛములుంచి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి తాను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి తెలుగువాడికి ఎన్టీఆర్ జీవితం ఒక తెరిచిన పుస్తకమని, అందులో ప్రతి పదం, అక్షరం అందరికీ తెలిసిన విషయమేనన్నారు. 


ఈ సందర్భంగా తారక రామారావు ఒక ప్రబంజనం అన్న విషయం అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని పురందేశ్వరి అన్నారు. ఆయన నినదించినప్పుడు ఆంధ్రరాష్ట్రం ప్రతిధ్వనించిందన్నారు. ఎన్టీఆర్ బాధతో కన్నీరు కార్చితే ప్రజలు రక్త కన్నీరు కార్చారన్నారు. ఆయనకు బిడ్డగా పుట్టడం జన్మ జన్మల సుకృతంగా భావిస్తున్నానని పురందేశ్వరి అన్నారు.


దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ట్యాంక్‌బండ్‌ దగ్గర ఎన్టీఆర్‌ ఘాట్‌లో ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులర్పించారు. బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా నివాళులర్పించారు. పలు చోట్ల అభిమానులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. 

Updated Date - 2020-05-28T15:59:38+05:30 IST