ముందస్తు ఉండదు

ABN , First Publish Date - 2021-10-18T08:45:01+05:30 IST

రాష్ట్రంలో ఈసారి ముందస్తు ఎన్నికలు ఉండవని సీఎం కేసీఆర్‌ అన్నారు. తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లబోవడం లేదని స్పష్టం చేశారు.

ముందస్తు ఉండదు

  • చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి..
  • ఈ రెండున్నరేళ్లలో అవన్నీ చేసుకుందాం
  • ఇంకా ఎక్కువ స్థానాల్లో గెలిచేలా పనిచేద్దాం
  • గతంలో పరిస్థితుల మేరకు ‘ముందస్తు’కు వెళ్లాం
  • హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలుపు టీఆర్‌ఎస్‌దే
  • బీజేపీపై 13 శాతం ఓట్లతో ఆధిక్యం సాధిస్తాం
  • మనపై మొరిగే కుక్కలకు గట్టిగా బుద్ధి చెప్పాలి
  • విమర్శలను నేతలు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి
  • ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా విజయ గర్జన సభ
  • సభ ఇన్‌చార్జిగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
  • కేంద్ర రాజకీయాల్లో మనం కీలకం కాబోతున్నం
  • వచ్చే ఎన్నికల్లో పార్టీకి లోక్‌సభ సీట్లు పెరగాలి
  • టీఆర్‌ఎస్‌ ఉమ్మడి ఎల్పీ భేటీలో సీఎం కేసీఆర్‌ 
  • 26 లేదా 27న హుజూరాబాద్‌లో కేసీఆర్‌ సభ


హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈసారి ముందస్తు ఎన్నికలు ఉండవని  సీఎం కేసీఆర్‌ అన్నారు. తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లబోవడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉందని, చేయాల్సిన పనులూ ఇంకా చాలా ఉన్నాయని తెలిపారు. ఈ సమయంలో అన్ని పనులూ పూర్తి చేసుకుందామని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మరిన్ని స్థానాలు గెలుచుకునేలా కష్టపడి పనిచేయాలని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ పార్లమెంటరీ, శాసనసభాపక్షాల సంయుక్త సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగితే తమకు కలిగే నష్టాన్ని తాను ముందే అంచనా వేశానని, అందుకే ముందస్తుకు వెళ్లామని తెలిపారు. రాజకీయంగా అప్పటి పరిస్థితుల గురించి తెలిసినందునే ఆ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఈసారి ఆ అవసరం లేదన్నారు. 


ఇక హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థే గెలుస్తున్నారని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కంటే టీఆర్‌ఎ్‌సకు 13 శాతం ఓట్లు ఎక్కువ రానున్నాయని తెలిపారు. ప్రచార సభలో తాను కూడా పాల్గొంటానని, ఈ నెల 26 లేదా 27న ఈ సభ ఉంటుందని అన్నారు. ఆ తరువాత నవంబరు 15న వరంగల్‌లో తలపెట్టిన తెలంగాణ విజయగర్జన సభను ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఆ సభతో అందరి నోళ్లు మూయించాలన్నారు. విజయగర్జన సభకు ప్రతి ఊరి నుంచి ఒక బస్సు రావాలని, హాజరయ్యే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సభ కోసం రోజుకు 20 నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయగర్జన సభకు ఇన్‌చార్జిగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ను నియమించారు. ఇక ఈ నెల 25న హెచ్‌ఐసీసీలో పార్టీ ప్లీనరీని బ్రహ్మాండంగా నిర్వహించుకుందామన్నారు. ప్లీనరీకి సభ్యుల సంఖ్యను 14 వేల నుంచి 6 వేలకు కుదిస్తున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది చొప్పున రావాలని సూచించారు. 


విమర్శలకు గట్టిగా సమాధానం ఇవ్వండి..

తమపై కుక్కలు, నక్కలు చాలా మొరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. అయినా ఇప్పటిదాకా చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నామని, వారి మాటలకు పెద్దగా స్పందించడమూ లేదని తెలిపారు. కానీ, ఇకపై విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు. ‘‘మన సైన్యం చాలా పెద్దది. ఇక నుంచి మనమీద మొరుగుతున్న కుక్కలు, నక్కలకు గట్టిగా బుద్ది చెప్పాలి. మన సైన్యం తిరగబడితే ఆ కుక్కలు పారిపోవాలి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నేతలు స్పందించాలని, అన్ని వేదికలపైనా ప్రతిపక్షాల వాదనల్ని తిప్పికొట్టాలని అన్నారు. ప్రతిపక్షాలు పూర్తిగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని, వాటిని ఎప్పటికప్పుడు ఖండించాలని సూచించారు. లేదంటే వారు చెప్పే అవాస్తవాలనే ప్రజలు నిజం అని నమ్మే ప్రమాదం ఉందన్నారు. దేశంలో ఇప్పటివరకు ఎన్నో పార్టీలు వచ్చాయి, పోయాయి అని, కొన్ని పార్టీలు మాత్రమే మనుగడ సాధించాయని గుర్తు చేశారు. సభ్యత్వపరంగా, క్యాడర్‌ పరంగా టీఆర్‌ఎస్‌ ఎంతో పటిష్టంగా ఉందని, అయినా.. ఇంకా బలోపేతం కావాలని అన్నారు. పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని, పునాదులు గట్టిగా వేసుకోవాలని పేర్కొన్నారు. పార్టీ కోసం జాగ్రత్తగా పనిచేయాలని సూచించారు. 


లోక్‌సభ స్థానాలపై మరింత దృష్టి పెట్టాలి

మున్ముందు కేంద్ర రాజకీయాల్లో టీఆర్‌ఎ్‌సకు మంచి ప్రాధాన్యం లభించబోతోందని కేసీఆర్‌ అన్నారు. లోక్‌సభలో కీలకం కాబోతున్నామని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాలపై మరింత దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, కర్ణాటకలోని రాయచూర్‌ను తెలంగాణలో కలపాలంటూ అక్కడి ఎమ్మెల్యే కోరడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోందన్నారు. గతంలో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి ఎంత ఉందో, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సాగునీటి పథకాలతో ఇప్పుడు ధాన్యం ఉత్పత్తి ఎంత జరుగుతోందో గమనించాలన్నారు.


కర్నెకు చేదు అనుభవం

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కర్నె ప్రభాకర్‌కు ఆదివారం తెలంగాణ భవన్‌ వద్ద చేదు అనుభవం ఎదురైంది. ఉమ్మడి ఎల్పీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో జాబితాలో పేర్లున్న వారినే పోలీసులు లోపలికి వదిలారు. ప్రతిరోజు లాగే కార్యాలయానికి వచ్చిన కర్నె ప్రభాకర్‌.. లోపలికి వెళ్లబోగా అనుమతించబోమని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ మీడియా కో ఆర్డినేటర్‌ కూడా అయిన ప్రభాకర్‌ ఈ సందర్భంగా కొంత ఇబ్బందికి గురయ్యారు. ఆపై కార్యాలయ ఇన్‌చార్జికి ఫోన్‌ చేసి చెప్పడంతో పార్టీ ప్రతినిధి ఒకరు వచ్చి ఆయనను లోపలికి తీసుకెళ్లారు. 

Updated Date - 2021-10-18T08:45:01+05:30 IST