కరోనా కేసుల్లో న్యూయార్క్‌ను అధిగమిస్తున్న ఈ నాలుగు రాష్ట్రాలు

ABN , First Publish Date - 2020-06-09T02:32:00+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే.

కరోనా కేసుల్లో న్యూయార్క్‌ను అధిగమిస్తున్న ఈ నాలుగు రాష్ట్రాలు

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అమెరికాలో కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి ముఖ్యంగా న్యూయార్క్ కరోనాకు కేంద్రంగా ఉంది. అయితే ప్రస్తుతం న్యూయార్క్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత వారం లెక్కలు చూస్తే కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, ఇల్లినోయి రాష్ట్రాలు కరోనా కేసుల విషయంలో న్యూయార్క్‌ను అధిగమించినట్టు సీఎన్ఎన్ అనాలసిస్‌లో తేలింది. సీఎన్ఎన్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలిఫోర్నియాలో గత వారంలో నిత్యం యావరేజ్‌గా 2,666 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక టెక్సాస్‌లో 1,537 కేసులు, ఫ్లోరిడాలో 1,111 కేసులు, ఇల్లినోయిలో నిత్యం 1,071 కేసులు నమోదయ్యాయి. మరోపక్క న్యూయార్క్ విషయానికి వస్తే గత వారంలో నిత్యం యావరేజ్‌గా 1,041 కేసులే నమోదయ్యాయి. దీనిబట్టి న్యూయార్క్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్టు అర్థమవుతోంది. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడాలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. న్యూయార్క్‌తో పాటు ఇల్లినోయిలో కేసులు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. ఈ ఐదు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య చూస్తే.. న్యూయార్క్‌లో అత్యధికంగా 3,98,828 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కాలిఫోర్నియాలో 1,31,710 మంది, ఇల్లినోయిలో 1,27,757 కరోనా బారిన పడ్డారు. టెక్సాస్‌లో ఇప్పటివరకు 75,763 కేసులు, ఫ్లోరిడాలో 64,904 కేసులు నమోదయ్యాయి. ఇక అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 20,10,442 మంది కరోనా బారిన పడగా.. కరోనా కారణంగా మొత్తం 1,12,549 మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-06-09T02:32:00+05:30 IST