టైలర్‌ హత్యకు అసలు కారణమిదే.. విచారణలో విస్తుగొలిపే విషయాలు

ABN , First Publish Date - 2021-04-04T15:51:53+05:30 IST

శ్రీరాంనగర్‌కు చెందిన సయ్యద్‌ అలీ అహ్మద్‌ అనే మెకానిక్‌ ఈ కేసులో..

టైలర్‌ హత్యకు అసలు కారణమిదే.. విచారణలో విస్తుగొలిపే విషయాలు

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : భార్యను పరాయి మగాడితో చూసిన టైలర్‌ మందలించి వదిలేశాడు. వాడు మాత్రం టైలర్‌పై పగ బట్టాడు. చంపేస్తానని ముందుగానే టైలర్‌ భార్యకు చెప్పాడు. వారం రోజుల్లోనే మట్టుబెట్టాడు. భర్త హత్య గురించి తెలిసిన భార్య ఏమీ తెలియదానిలానే నటించింది. నిందితుడు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కాక అసలు విషయం బయటకు వచ్చింది. శ్రీరాంనగర్‌కు చెందిన సయ్యద్‌ అలీ అహ్మద్‌ అనే మెకానిక్‌ ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..

కార్మికనగర్‌లో నివాసముండే సిద్దిఖీ టైలర్‌, భార్య రుబీనాబేగం, ఇద్దరు పిల్లలతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకుంటున్నాడు. ఇదే బస్తీకి చెందిన సయ్యద్‌ అలీ అహ్మద్‌తో రుబీనాకు పరిచయం ఏర్పడింది. ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. నెల రోజుల క్రితం ఇద్దరినీ రెడ్‌ హ్యాండెడ్‌గా సిద్దిఖీ పట్టుకున్నాడు. తీవ్రంగా హెచ్చరించి వదిలేశాడు. అలీ మాత్రం సిద్దిఖీ అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని రుబీనాకు పలు మార్లు ఫోన్‌ చేసి చెప్పాడు. హత్యను అడ్డుకునేందుకు రుబీనా ప్రయత్నం చేయలేదు.


మార్చి 31న సిద్దిఖీని హత్య చేసేందుకు సిద్ధమయ్యాడు. ఆ రోజు కూడా రుబీనా బేగంతో పలు మార్లు మాట్లాడాడు. భోజనం ముగించుకొని సిద్దిఖీ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నాడు. కొద్ది సేపటికే అలీ అక్కడకు వచ్చాడు. తలుపు తీయాలని సిద్దిఖీని కోరగా నిరాకరించాడు. దీంతో అలీ బయటకు వచ్చాడు. అరగంట తర్వాత లారీకి ఉపయోగించే కమాన్‌ పట్టీని పట్టుకొని మరోసారి సిద్దిఖీ ఫ్లాట్‌ వద్దకు వెళ్లాడు. లోపలికి వెళ్లి తలపై కొట్టి గాయపర్చాడు. రక్తం కారుతుండడంతో సిద్దిఖీ బనియన్‌ తీసి తల చుట్టూ చుట్టాడు. కొద్ది సేపటికి సిద్దిఖీ మరణించాడు. సిద్దిఖీ చనిపోయిన విషయం కూడా రుబీనా బేగానికి అలీ ఫోన్‌ చేసి చెప్పినట్టు కాల్‌ డేటా ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. 


ఆస్తి తగాదాలని..

సిద్దిఖీకి కర్నాటకలో భూములు ఉన్నాయి. వారు మొత్తం నలుగురు అన్నదమ్ములు,  భూముల విషయంలో కొంత విభేదాలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని అలీ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నాడు. హత్య అనంతరం ఆస్తి తగాదాలు వైపు దృష్టి మళ్లించాలనుకున్నాడు. కానీ అతను సిద్దిఖీ అపార్ట్‌మెంట్‌లోకి వచ్చినట్లు సీసీ ఫుటేజీలో రికార్డు కావడంతో దొరికిపోయాడు. 

Updated Date - 2021-04-04T15:51:53+05:30 IST