తెనాలి, చిలకలూరిపేట, యడ్లపాడుల్లోనూ..

ABN , First Publish Date - 2020-05-28T11:43:27+05:30 IST

కోయంబేడు లింక్‌ తెనాలిని వీడనంటోంది. నాజరుపేటకు చెందిన ఓ డ్రైవర్‌ను పది రోజుల క్రితం టెస్టుల నిమిత్తం తీసు

తెనాలి, చిలకలూరిపేట, యడ్లపాడుల్లోనూ..

తెనాలి అర్బన్‌, చిలకలూరిపేట: కోయంబేడు లింక్‌ తెనాలిని వీడనంటోంది. నాజరుపేటకు చెందిన ఓ డ్రైవర్‌ను పది రోజుల క్రితం టెస్టుల నిమిత్తం తీసుకు వెళ్లగా నెగిటివ్‌గా రావడంతో క్వారంటైన్‌లో ఉంచారు. ఈ క్రమంలో బుధవారం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. అంతకముందు అతడ్ని ఇంటికి కూడా పంపారు. పాజిటివ్‌తో డ్రైవర్‌ను వెనక్కి రప్పించిన అధికారులు ఎన్నారై ఆసుపత్రిలో చేర్పించారు. ఇప్పటికే ఐతానగర్‌, సుల్తానాబాద్‌, పాండురంగపేట కంటోన్మెంట్‌ జోన్లుగా ఉండగా ఆ జాబితాలోకి నాజరుపేట కూడా చేరినట్లు  తహసీల్దార్‌ రవిబాబు తెలిపారు.  

- చిలకలూరిపేటలో మూడు కేసులు నమోదు కాగా యడ్లపాడులో మరో మూడు మొత్తం ఆరు కొత్త కేసులు నమోదైనట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. కరోనాతో మృతి చెందిన నాదెండ్ల మండలం చందవరానికి చెందిన వృద్ధుడు చికిత్స పొందిన చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రిలోని సిబ్బంది 50మందితో పాటు పట్టణంలోని చినపీరుసాహెబ్‌వీధిలో పాజిటివ్‌ వచ్చిన మహిళ ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లో ఉన్న మొత్తం 121మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే  రెడ్లబజారుకు చెందిన ఓ మహిళా దోబీకి, చినపీరుసాహెబ్‌ వీధికి చెందిన మహిళ నివాసానికి సమీపంలో ఉండే ఓ మహిళకు, ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో పట్టణంలో మూడు కేసులు రావడంతో ఆయా ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.  

- యడ్లపాడు మండలానికి విస్తరణ

గుంటూరులో ఆసుపత్రిలో చిలకలూరిపేట చినపీరుసాహెబ్‌ వీధికి చెందిన మహిళ చికిత్స పొందుతున్న సమయంలో యడ్లపాడు రమణయ్యపేటకు చెందిన ఆమె కుటుంబీకులు సపర్యలు చేశారు. ఈ క్రమంలో వారిని   క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు నిర్వహించగా బుధవారం వచ్చిన నివేదికలో ముగ్గురికి పాజిటివ్‌ అని తేలినట్లు స్థానిక మండల వైద్యాధికారి లక్ష్మానాయక్‌ తెలిపారు. ఆమె కుమార్తె, అల్లుడితోపాటు వారి ఆరేళ్ల కుమారుడిని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించామన్నారు. వారు నివాసం ఉండే ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి, చిలకలూరిపేట రూరల్‌ సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ నాగేశ్వరరావు, వైద్యాధికారి లక్ష్మానాయక్‌లు ఆ ప్రాంతాన్ని సందర్శించి కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన 49మందికి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. చందవరం, గొరిజవోలు గ్రామానికి చెందిన 99మందికి బుధవారం కోవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి డాక్టర్‌ సోమ్లానాయక్‌ తెలిపారు. వారి రిపోర్టులు రావలసి ఉంది.


వీటికి మాత్రం ఓకే

నాన్‌కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో మరిన్నింటికి అనుమతి

తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌

గుంటూరు, మే 27 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ పరిపాలన శాఖ ఆదేశాల మేరకు నాన్‌ కంటైన్మెంట్‌ ఏరియాలలో కొన్ని కార్యకలాపాలకు అనుమతిస్తూ కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బార్బర్‌ షాపులు, సెలూన్లను తెరుచుకోవచ్చు. స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ని పక్కాగా పాటించాలి. అన్ని రకాల షాపులు సరి, బే సంఖ్యల విదానం పాటించాలి. అన్ని లిక్కర్‌, పాన్‌ షాపులకు అనుమతి ఉంటుంది. ఈ-కామర్స్‌ కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చు.   బస్సు, రైల్వే స్టేషన్లలో రెస్టారెంట్లకు, క్యాంటిన్లకు అనుమతి ఉంటుంది. కంటైన్‌మెంట్‌ జోన్స్‌(కోర్‌, బఫర్‌ ఏరియా)లలో ఎలాంటి షాపులు తెరవరాదు. ఇతర ప్రదేశాల్లో ఉదయం 7 నుంచి రాత్రి ఏడు గంటల వరకు షాపులు తెరుచుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌, బఫర్‌ ఏరియాలు కాని చోట్ల కాలనీలు, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ల్లోని దుకాణాలు తెరుచుకోవచ్చు.  

Updated Date - 2020-05-28T11:43:27+05:30 IST