ఈ దేశాల్లో ఒక్క కరోనా కేసు కూడా లేదు.. మహమ్మారిపై గెలిచిన దేశాల లిస్ట్ ఇదీ..!

ABN , First Publish Date - 2021-05-28T18:02:23+05:30 IST

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఎదుర్కొంటున్న భారత్‌ను చూసి ప్రపంచం మొత్తం జాలి పడుతోంది. ఇలా భూగోళం మొత్తం కన్నీటి గాధలే మిగిల్చిన ఈ కరోనా మహమ్మారి.. కొన్ని దేశాల గడప కూడా తొక్కలేకపోయింది.

ఈ దేశాల్లో ఒక్క కరోనా కేసు కూడా లేదు.. మహమ్మారిపై గెలిచిన దేశాల లిస్ట్ ఇదీ..!

భూగోళం మొత్తాన్ని భయభ్రాంతుల్లో ముంచేస్తున్న వైరస్ కరోనా. చైనాలో తొలిసారి వెలుగు చూసిన ఈ వైరస్ ఆ తర్వాత యూరప్‌కు పాకింది. అక్కడ ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ వంటి దేశాల్లో ఈ మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత అమెరికా వరకూ వెళ్లిన ఈ వైరస్ అక్కడ ప్రళయమే సృష్టించింది. దాన్నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అగ్రరాజ్యం వ్యాక్సినేషన్‌పై పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఇలా చాలా దేశాలు కరోనాను నిలువరించడం కోసం వ్యాక్సినేషన్‌ను నమ్ముకున్నాయి. అయినా సరే భారత్‌ వంటి దేశాల్లో పరిస్థితులు విషమంగా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఎదుర్కొంటున్న భారత్‌ను చూసి ప్రపంచం మొత్తం జాలి పడుతోంది. ఇలా భూగోళం మొత్తం కన్నీటి గాధలే మిగిల్చిన ఈ కరోనా మహమ్మారి.. కొన్ని దేశాల గడప కూడా తొక్కలేకపోయింది. 


మొత్తం 14 దేశాల్లో ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కానీ వీటిలో ఉత్తర కొరియా, తుర్కమెనిస్తాన్ దేశాలు అందించిన డేటాపై డబ్ల్యూహెచ్‌వో అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇక మిగిలిన 12 దేశాల విషయంలో అలాంటి డౌట్లే లేవు. ఆయా దేశాల భౌగోళిక పరిస్థితులు, ఆ ప్రభుత్వాల ముందు చూపుతో ఈ దేశాలు కరోనా మహమ్మారిని తమ గడప తొక్కకుండా ఆపేశాయి. మరెందుకాలస్యం ఆ దేశాల వివరాలు చూసేద్దామా?


1. తువలు (Tuvalu)


హవాయి, ఆస్ట్రేలియా దేశాల మధ్య ఉన్న ద్వీపదేశం తువలు. 10 చదరపు మైళ్ల వైశాల్యం ఉన్న ఈ ద్వీపంలో జనాభా కూడా పదివేలే. ఆస్ట్రేలియాలో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదైనా.. తువలులో మాత్రం ఒక్క కరోనా కేసు కూడా రాలేదు. కామన్‌వెల్త్ దేశాల్లో ఒకటైన ఈ ద్వీపదేశం.. కరోనా వ్యాపిస్తోందని తెలియగానే తమ దేశ సరిహద్దులు మూసేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో దేశంలోకి రానిచ్చినా క్వారంటైన్ తప్పనిసరి చేసింది. ఇలాంటి చర్యలే ఈ దీవిని రక్షించాయి.


2. టర్క్మెనిస్తాన్ (Turkmenistan)


ఆసియాలోని ఈ దేశంలో కూడా అధికారికంగా ఒక్క కరోనా కేసూ లేదు. దీనిపై కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ.. ఈ దేశం కూడా కమర్షియల్ ట్రావెల్, మత సంబంధ కార్యక్రమాల కోసం ప్రజలు గుంపులుగా చేరడం వంటి వాటిపై నిషేధం విధించింది. అలాగే సామాజిక దూరం పాటించాలంటూ బాగా ప్రచారం చేసింది. నిజమో కాదో తేల్చే ఆధారాలు లేకపోయినా.. ఇక్కడ అధికారికంగా ఒక్క కరోనా కేసూ నమోదుకాలేదనడం మాత్రం నిజం.


3. టోంగా (Tonga)


మొత్తం 170 దీవుల సమూహం ఈ దేశం. వీటిలో 36 దీవుల్లో ప్రజలు ఉంటారు. ఫిజీ, సమోవా వంటి దీవుల దగ్గరలోని ఈ దేశంలో కూడా ఒక్క కరోనా కేసూ లేదు. దీనికి కచ్చితంగా ఆ దేశ ముందుచూపే కారణం. కరోనా బయటపడిన తొలిరోజుల్లోనే తమ దేశానికి క్రూయిజ్ షిప్పులు రాకుండా నిషేధం విధించింది. ఆ తర్వాత విమానాశ్రయాలు కూడా మూసేసింది. ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాకుండానే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది.


4. టోకెలౌ (Tokelau)


దక్షిణ పసిఫిక్ సముద్రంలోని ఈ దేశం.. న్యూజిల్యాండ్‌పై ఆధారపడి ఉండే భూభాగం. అయితే న్యూజిల్యాండ్ మాత్రం దీన్ని మరో దేశంగానే పరిగణిస్తుంది. టోకెలౌ కూడా తమను మరో దేశంగానే చెప్పుకుంటుంది. మూడు కోరల్ అటాల్స్‌ కలగలిసిన ఈ దేశం మొత్తం వైశాల్యం నాలుగు చదరపు మైళ్లే. ఇక్కడ రాజధానిగా కూడా ఏడాదికో అటాల్‌ ఉంటుంది. ఇక్కడ విమానాశ్రయాలు లేవు. పడవ ప్రయాణం ఒక్కటే మార్గం. 1500మంది జనాభా ఉన్న ఈ చిన్న దేశంలో ఇప్పటి వరకూ కరోనా మచ్చుకు కూడా కనిపించలేదు.


5. సెయింట్ హెలెనా (Saint Helena)


బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగమైన సెయింట్ హెలెనా కూడా కరోనాను నిలువరించిందనే చెప్పాలి. నైరుతి ఆఫ్రికాకు 1200 మైళ్ల దూరంలోని ఈ భూభాగం మిగతా ప్రపంచానికి అత్యంత దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి. 1502లో పోర్చుగీసు వారు దీన్ని కనుకొనేంత వరకూ ఇక్కడ ఎవరూ లేరు. ఇప్పుడు 4,500 మంది జనాభా ఉన్న సెయింట్ హెలెనాలో కూడా ఒక్క కరోనా కేసూ లేదు.


6. పిట్‌కెయిర్న్ ఐలాండ్స్ (Pitcairn Islands)


పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఏకైక బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగం ఇది. అగ్నిపర్వతాలు ఉన్న ఈ దీవుల్లో కనీసం 50 మంది కూడా నివాసం ఉండరు. ఇక్కడకు వచ్చే ఎక్కువ మంది కొంతకాలం ఉండి పోవడానికి వచ్చేవారు. ప్రపంచంలో అత్యంత తక్కువ జనాభా కలిగిన ప్రాంతం కూడా ఇదే. ఇక్కడ ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు కానీ, అమెరికా ప్రభుత్వం మాత్రం ఇక్కడకు వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.


7. పలౌ (Palau)


300 దీవుల సమాహారమైన ఈ దేశం.. గామ్, ఫిలిప్పైన్స్‌కు సమీపంలో ఉంది. ఈ స్వతంత్ర దేశం అమెరికా ఉచిత సహకారంలో ఉంది. కరోనా రాగానే విమాన ప్రయాణాలను రద్దు చేసిన ఈ దేశం.. ఆ తర్వాత ప్రయాణాలు అనుమతించినా కూడా కచ్చితమైన క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తోంది. ఇక్కడ కూడా ఇప్పటి వరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు.


8. ఉత్తర కొరియా (North Korea)


ఈ జాబితాలో ఉన్న ద్వీపదేశం కాని కంట్రీల్లో నార్త్‌కొరియా రెండోది. ఇక్కడ ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్న సమాచారాన్ని చాలా దేశాలు ప్రశ్నించాయి. కరోనా తొలిగా కనిపించిన చైనాతో సరిహద్దులు పంచుకునే ఈ దేశంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది. 25 మిలియన్ల జనాభా ఉన్న ఉత్తర కొరియా.. కరోనా కేసులు లేని అతిపెద్ద దేశం. ఇక్కడ కూడా ప్రయాణాలపై నిషేధం విధించారు. కఠినమైన లాక్‌డౌన్ విధించడంతోపాటు సరిహద్దులు మూసేశారు. అందుకే కరోనా తమ దేశంలోకి రాలేదని ఉత్తర కొరియా ప్రభుత్వం చెప్తుంది. కానీ, దీనిపై అంతర్జాతీయ మీడియా సందేహాలు వ్యక్తం చేస్తోంది.


9. నియూ (Niue)


న్యూజిల్యాండ్‌కు ఈశాన్యంగా 1500మైళ్ల దూరంలో ఉందీ దేశం. ప్రపంచంలోని అతిపెద్ద కోరల్ దీవుల్లో నియూ దేశం ఒకటి. ఇది స్వతంత్ర దేశమైనా కరోనా పోరాటంలో మాత్రం న్యూజిల్యాండ్ సహకారం అందుకుంది. ఇక్కడ కూడా ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసులు జీరో.


10. నౌరు (Nauru)


కిరిబాటి సమీపంలోని నౌరు దేశం.. భూభాగం పరంగా ప్రపంచంలో మూడో అతిచిన్న దేశం. ఈ ఏకైక దీవి కేవలం 8 చదరపు మైళ్ల వైశాల్యం కలిగి ఉంది. ఇక్కడ జనాభా కూడా 10వేలే. జనాభా పరంగా రెండో అతిచిన్న దేశం ఇది. మిగతా ద్వీపదేశాల్లానే ప్రయాణాలపై ఆంక్షలు విధించడం ద్వారా కరోనా నుంచి ఈ దేశం తప్పించుకుంది.


11. కిరిబాటి (Kiribati)


పైన చెప్పిన నావురుకు ఇది పొరుగు దేశం. ఇది మొత్తం 32 కోరల్ అటాల్స్(చిన్న చిన్న భూభాగాలు) సమాహారం. హవాయికి నైరుతి దిశలో 2వేల మైళ్ల దూరంలో ఉంటుంది. భూమిపై ఉన్న నాలుగు హెమిస్ఫేర్‌లలో ఉన్న దేశాల్లో ఇది ఒకటి. కరోనాపై పోరాటంలో భాగంగా మహమ్మారి మొదలైనప్పుడే ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. ఇక్కడకు సాధారణంగానే చాలా తక్కువ విమానాలు వస్తాయి. దీంతో ఆంక్షలు విధించడం ఈ దేశానికి సులభం అయింది.


12. ఫెడరేషన్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా (Federated States of Micronesia)


ఈ దేశం 600పైగా దీవుల సమూహం. మొత్తం కలిపితే 300 చదరపు మైళ్లకు కొంచెం ఎక్కువ భూభాగం. సముద్రంలోనే 10లక్షల చదరపు మైళ్లు కలిగి ఉంది. ఇక్కడ కరోనా కేసులు జీరోనే కానీ.. ఈ మహమ్మారితో పోరాటంలో అమెరికా, చైనా, జపాన్ దేశాలు దీనికి సహకారం అందించాయని తెలుస్తోంది.


13. కుక్ ఐలాండ్స్ (Cook Islands) 


న్యూజిల్యాండ్‌కు 2 వేల మైళ్ల దూరంలో దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉందీ ద్వీపదేశం. తమ దేశ తీరానికి క్రూయిజ్ షిప్స్ సహా ఎటువంటి పడవలూ రాకుండా నిలువరించిన ఈ దేశం.. ఎవరైనా దేశంలోకి ప్రవేశిస్తే కచ్చితంగా క్వారంటైన్‌లో ఉండాలని నిబంధనలు విధించింది. ఇలా కరోనాతో పోరాడింది. ఇప్పటి వరకూ ఇక్కడ కూడా ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు.


14. అమెరికన్ సమోవా (American Samoa)


అమెరికాకు చెందిన ఈ భూభాగంలో 5 దీవులు, రెండు అటాల్స్ ఉన్నాయి. దక్షిణ పసిఫిక్‌లో అంతర్జాతీయ డేట్‌ లైన్‌కు తూర్పు వైపు కేవలం 100మైళ్ల దూరంలో ఈ దేశం ఉంటుంది. 55వేల జనాభా ఉన్న ఈ దేశానికి విమానం ద్వారా వెళ్లవచ్చు. ఇక్కడ కూడా ఇప్పటి వరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు రికార్డు కాలేదు.

Updated Date - 2021-05-28T18:02:23+05:30 IST