జమాబంది చేస్తే ఈ జగడాలుండవు!

ABN , First Publish Date - 2021-05-05T05:44:59+05:30 IST

రెండుతెలుగు రాష్ట్రాలలో బ్రిటిష్‌ ప్రభుత్వం కాలం నుంచి నిజాం నవాబు పాలనలో సైతం జమాబంది ప్రతి సంవత్సరం కొనసాగుతూ వచ్చింది. ఈ ప్రక్రియ ఉమ్మడి రాష్ట్రంలో 1994 వరకు కొనసాగింది...

జమాబంది చేస్తే ఈ జగడాలుండవు!

రెండుతెలుగు రాష్ట్రాలలో బ్రిటిష్‌ ప్రభుత్వం కాలం నుంచి నిజాం నవాబు పాలనలో సైతం జమాబంది ప్రతి సంవత్సరం కొనసాగుతూ వచ్చింది. ఈ ప్రక్రియ ఉమ్మడి రాష్ట్రంలో 1994 వరకు కొనసాగింది. గత ఇరవై అయిదు సంవత్సరాల నుంచి జమాబంది అనే శబ్దాన్ని, దాని ఆవశ్యకతను, అవసరాన్ని, విశిష్టతను, ప్రాముఖ్యాన్ని పూర్తిగా మరచిపోయేలా చేసాయి ప్రభుత్వాలు. 


దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు హయాంలో రెవెన్యూ వ్యవస్థలో రెండు పెద్ద మార్పులు చేశారు. మొదట గ్రామ కరణాల వ్యవస్థను రద్దు చేశారు. దేవుడిచ్చిన భూమికి పన్ను ఏమిటంటూ భూమి శిస్తును రద్దు చేశారు. గ్రామ కరణాలకు సంప్రదాయంగా భూమి సమాచారం మొత్తం నోటికి ఉండేది. ఏ భూమి ఎవరిది, ఎంత ప్రభుత్వ భూమి ఉంది, గ్రామ కంఠాలకు సంబంధించిన సమాచారం ఏమిటి.. ఇవన్నీ వారికి తెలిసేవి. ప్రతి ఫసలీ సంవత్సరం గడిచేలోపు రైతు తన భూమికి పన్ను కట్టిన రసీదును జేబులో దాచుకుని, తన పట్టాభూమి తన జేబులోనే ఉన్నట్టుగా ఆనందించేవాడు. ఆ రసీదును తనకూ తన భూమికి గల అనుబంధానికి ప్రతీకగా భావించేవాడు. ఒకటి మాత్రం నిజం, తమ భూమికి పన్ను మాఫీ అయ్యింది అనే ఆనందం రైతులు ఎవ్వరిలోనూ లేదు. పైగా భూమికి దూరమౌతున్న దిగులుతో ప్రతి రైతూ పన్ను కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. 


కొన్ని వందల సంవత్సరాల పాటు రైతుల నుంచి వసూలయ్యే భూమి శిస్తు ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. అన్ని శాఖలు రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉండేవి. పారిశ్రామికీకరణ పెరిగాక రెవెన్యూ రాబడులు వివిధ శాఖల నుంచీ ప్రభుత్వ ఖజానాకు రావటం, ఈ ఆదాయం భూమి శిస్తుకంటే ఎన్నో రెట్లు అధికంగా ఉండటంతో భూమి శిస్తుకు విలువ లేకుండా పోయింది. అందుకే ఒక దశలో భూమిపై పన్నులు ఇక అవసరం లేదు అనే స్థాయికి ప్రభుత్వాలు చేరుకున్నాయి. 


ఒక రకంగా భూమి శిస్తు రద్దు హర్షించదగ్గ అంశమే, కానీ భూమిని శిస్తు కొరకే అన్నట్టుగా చూడకుండా గ్రామ ప్రజల ఆదాయ వనరుగా, భూమికి సంబంధించిన సమాచారంగా చూడాలి. భారత దేశంలో ఇప్పటికీ అరవై శాతం వ్యవసాయం మీదే ఆధారపడుతున్నారు. భూమి వారి జీవిత అవసరాల కోసం మాత్రమే కాదు. వ్యవసాయాన్ని వారికి ఆత్మగౌరవ చిహ్నం. ప్రభుత్వాలకు భూమి శిస్తు అవసరం తీరిపోవచ్చు కానీ రైతులకు అవసరం. ఏ గ్రామంలో ఎంత భూమి ఉందో లెక్క ఉండాలి కదా! ఉదాహరణకు ఒక గ్రామంలో వెయ్యి ఎకరాలుంటే అందులో ఉరుమ్మడి అవసరాల భూమి ఎంత, ప్రభుత్వ భూమి ఎంత, బంజరు భూమి ఎంత, గ్రామ కంఠం ఎంత, లేక ఆబాది ఎంత... గ్రామ రెవెన్యూ విస్తీర్ణం, గైరాన్‌ భూమి లెక్క, బంచరాయి (శాశ్వత పచ్చిక బయిళ్ళు), అటవీ భూములు, ఇనామ్‌లు, సీలంగ్‌ (తెలంగాణ టెనెన్సీ భూములు), దేవాలయ భూములు, వఖ్ఫ్‌ భూములు, బిలా దాఖ్లా (భూమి ఉంటుంది కాని రికార్డుకు ఉండదు), పోరంబోకు, భారీజు ఖాతా భూములు, శివాయ జమాదార్లు, తొరి పొలాలు, పంటకు పనికిరాని పొలాలు, వాగులు వంకలు, బండ్లబాట, పానాది... ఇలా ఇన్ని రకాల భూములుంటాయి గ్రామంలో. ఇన్ని రకాల భూముల లెక్క జమాబంది మూలంగా తెలుస్తుంది. ఊరులోని భూమి మొత్తం ప్రతి పహాణికి చివరి పేజీలో పొందుపరిచి గిర్దావరు సంతకం తీసుకోవటం ఆనవాయితీగా ఉండేది. ఊరి ఠైరావ్‌, జమీన్‌ ఝడ్తిలో ఏమాత్రం కన్ఫ్యూజన్‌ ఉండేది కాదు. జమాబంది లెక్క తీసుకున్నంత కాలం భూమి లెక్కలు సరిగ్గా ఉండేవి. ప్రస్తుతానికి భూమి లెక్కలు సరిగ్గా లేవు. అంతేకాదు, ఈ లెక్క సరిపోని పక్షంలో ఎవరిని బాధ్యులను చేయాలి, ఏమని బాధ్యులను చేయాలి, లెక్క సరిపోయిందీ లేందీ చెక్‌ పాయింట్‌ ఎక్కడ... అనే విషయాల్లో క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నారు. 


ప్రతి సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్‌ మధ్యలో తాలూకా హెడ్‌ క్వార్టర్‌, డాగ్‌ బంగ్లా, ఆర్‌అండ్‌బి బంగ్లా, గెస్ట్‌హౌస్‌, కొన్నిసార్లు పెద్ద రైతు లేదా పెద్దమనిషి ఇంట్లో ఈ జమాబంది కార్యక్రమం జరిగేది. ఒక తాలూకా లేదా కొన్ని ఫిర్కౌకు సంబంధించి ఆయా గ్రామాల రికార్డులుండేవి. ఇందులో పహాణీ, చౌఫస్లా, కార్తీ వార్‌ తఖ్తాలు, ఫైసల్‌ పట్టీలు, అమెండ్‌మెంట్‌, మ్యుటేషన్‌లు, ఫౌతీ (succession) రిజిష్టర్‌ ఇవన్నీ ఒక తెల్లటి గుడ్డలో మూట కట్టి ఊరి కావలివారు, శేరికింది, ఇప్పుడు విఆర్‌ఏ తలపై మోసుకుంటూ క్యాంపులకు చేరేవారు. 


జమాబంది క్యాంప్‌ క్లర్క్‌ పూర్తిగా తనిఖీ చేశాక, ఆయన సంతృప్తి అయ్యాక సంతకం చేసేవారు. అప్పుడు గానీ టేబులుపైకి వెళ్ళేవి కావు. ఆయా గ్రామ రెవిన్యూ అధికారులు నాజిమ్‌–ఎ–జమాబంది (ఆర్డీవో) ముందు భయంతో చేతులు ముడుచుకొని కూర్చునేవారు. కేవలం వారు వసూలు చేసిన శిస్తు బకాయిలు, కలెక్షన్‌, బాలెన్స్‌ లెక్కల టెన్షన్‌ తప్ప భూమి లెక్కల విషయంలో ఎలాంటి రాజీ ఉండేది కాదు. ఏ పొలంలో ఏ పంట వేసింది పహాణిలో రికార్డు అయి ఉండేది. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1050 గ్రామాల్లో ఉన్న ఏ ఒక్క భూమి లెక్క కూడా సరిగ్గా లేదు. అందుబాటులో ఉన్న లెక్కల్లో అరవై శాతం తప్పులే. ముఖ్యంగా ప్రభుత్వ భూమి లెక్క అసలే దొరకదంటే అతిశయోక్తి కాదు. ఇలా ఇంకెంత కాలం. 


భూమి విషయంలో సంస్కరణ అవసరమే! ఈ మార్పులు వర్తమాన వేగానికి తగినట్లుగా, ప్రజల అవసరాలకు అనుగుణంగానే ఉండాలి, అది అవసరం కూడా. ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ రైతులకు గుదిబండలాగా తయారైంది. 


విఆర్‌వో వ్యవస్థను రద్దు చేసి అన్నింటికీ కలెక్టర్‌నే బాధ్యుడిని చేసిన ప్రభుత్వం విఆర్‌వోల స్థానంలో ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. జమాబందికి సరియైన యంత్రాంగమే లేదు. 


ఏదో చేశాం అంటే చేశాం అని భూమి లెక్కలు తీయకూడదు. దీనికోసం ప్రభుత్వం సంకల్పించుకోవాలి. ముందుగా ఒక జిల్లా, ఒక రెవెన్యూ డివిజన్‌ పైలట్‌ ప్రాజెక్టు కింద పూర్తిగా శ్రద్ధతో జమాబంది అనే పదానికి న్యాయం చేయగలిగే సిబ్బందిని నియమించి కచ్చితమైన బాధ్యత వారికి అప్పగించి సమయం, బడ్జెట్‌ కేటాయించి, కొన్ని మార్గదర్శకాలను తయారు చేయాలి. ఒక సంవత్సరంలో జమాబంది పూర్తిచేసే విధంగా సిబ్బందికి పురమాయించి రంగంలోకి దింపితే ఖచ్చితమైన భూమి లెక్కలు తెలుస్తాయి. ఇది కేవలం ప్రభుత్వ భూములను కాపాడడానికి మాత్రమే కాదు, తెలంగాణలో ప్రతి కుంట భూమికి పక్కా లెక్క తెలుస్తుంది. రైతుల భూమి సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అందుకే జమాబంది ప్రక్రియ ఖచ్చితంగా అవసరం. 

వి. బాలరాజ్‌

రిటైర్డు తహసీల్దార్‌

Updated Date - 2021-05-05T05:44:59+05:30 IST