Mumbaiలో 100 ఏళ్ళ కిందటే ఈ అలవాట్లున్నాయ్....

ABN , First Publish Date - 2021-10-09T22:02:08+05:30 IST

కలల నగరం ముంబైలో మాదక ద్రవ్యాల జాఢ్యం ఈనాటిది కాదు

Mumbaiలో 100 ఏళ్ళ కిందటే ఈ అలవాట్లున్నాయ్....

ముంబై : కలల నగరం ముంబైలో మాదక ద్రవ్యాల జాఢ్యం ఈనాటిది కాదు. కోకా ఆకుల నుంచి తయారు చేసిన మాదక ద్రవ్యం ఈ నగరాన్ని ఓ శతాబ్దం క్రితం మహమ్మారిలా పీడించింది. అంతకుముందు సైతం ఓపియంను రిక్రియేషనల్ డ్రగ్‌గా ఓపియం డెన్స్ (మదక్ హౌసెస్)లో వాడేవారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో కొకయిన్ వాడకం తగ్గినప్పటికీ, 1930వ దశకంలో మళ్లీ పెరిగింది.


క్రూయిజ్ షిప్‌ పార్టీలో బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)కి పట్టుబడటంతో తాజాగా ముంబై నగరంలో మాదక ద్రవ్యాల గురించి చర్చ జరుగుతోంది. అయితే దాదాపు ఓ శతాబ్దం క్రితం నుంచి ఈ నగరవాసుల్లో కొందరికి మాదక ద్రవ్యాలతో పరిచయం ఉంది. ఓపియంను మదక్ అనే తక్కువ తీవ్రతగల రూపంలోనూ, చండు అనే ఎక్కువ తీవ్రతగల రూపంలోనూ వాడేవారు. 


పార్లమెంటరీ కమిషన్‌ సిఫారసులు

భారత దేశంలో ఓపియం వినియోగాన్ని అంచనా వేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1893లో ఓ పార్లమెంటరీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఓపియంను ఔషధాల కోసం మినహా ఇతర విధాలుగా అమ్మడంపై నిషేధం విధించాలని ఈ కమిషన్ సిఫారసు చేసింది. దీంతో అదే ఏడాది ముంబైలోని స్థానిక యంత్రాంగం ఓపియం డెన్స్‌ను మూసేయించింది. 


మహిళలు, బాలలు సైతం...

ఓపియం స్మోకింగ్‌ను నిషేధించినంత మాత్రానికి పరిస్థితులు చక్కబడబోవని, దీనికి అలవాటుపడినవారు ఇతర హానికర పదార్థాలను సేవిస్తున్నారని బోంబే పోలీస్ కమిషనర్ ఎస్ఎం ఎడ్వర్డ్స్ (1909-1916) రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. 1909 నాటికి దిగువ తరగతి వర్గాలు కొకెయిన్‌ సేవనానికి అధికంగా అలవాటుపడినట్లు తెలిపారు. మహిళలు, బాలలు సైతం దీనికి అలవాటు పడినట్లు రాశారు. అంతకు ముందు సంవత్సరాల్లో మెడికల్ అథారిటీస్ కూడా కొకెయిన్‌ను సమర్థించినట్లు తెలిపారు. జలుబు నుంచి ఓపియం బానిసలకు చికిత్స వరకు హానికరం కానటువంటి ఔషధంగా కొకయిన్‌ను సూచించేవారని తెలిపారు. బోంబే ప్రెసిడెన్సీ సర్జన్ మేజర్ ఏడబ్ల్యూ ట్యూక్ 1914లో ఇండియన్ మెడికల్ గెజిట్‌లో రాసిన వివరాల ప్రకారం, బోంబే జైలుకు కొకయిన్ సేవించే కొత్త ఖైదీలు రోజుకు కనీసం ఒకరైనా వచ్చేవారని తెలిపారు. 


జర్మనీ నుంచి ‘మెర్క్’ పేరుతో కొకయిన్ ప్యాకెట్లు బోంబేకి వచ్చేవి. ప్రస్తుత భూలేశ్వర్‌లోని నల్ బజారు మాదక ద్రవ్యాలకు కేంద్రంగా ఉండేది. బోంబే పోలీసులు, ఎక్సయిజ్ సిబ్బంది గట్టిగా కృషి చేసి, కొకయిన్ వ్యాపారాన్ని కట్టడి చేయగలిగారు. 1911లో భూలేశ్వర్, నల్ బజార్, ధోబీ టలావ్‌ వంటి ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక కార్యాచరణను అమలు చేశారు. రెండు నెలలపాటు జరిగిన ఈ కృషి సత్ఫలితాలిచ్చింది. దాదాపు 600 మందికి కోర్టు శిక్షలు విధించింది. 


కొకయిన్‌కు బదులుగా...

1912-13లో బోంబే పోలీసులు పెద్ద ఎత్తున కొకయిన్‌ను పట్టుకున్నారు. దీంతో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు తమ యూజర్లకు మెగ్నీసియా పౌడర్, ఎప్సమ్ సాల్ట్‌లను అందజేసేవారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలం 1914లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తగ్గింది. అయితే 1930వ దశకంలో మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం మళ్ళీ పెరిగింది.


Updated Date - 2021-10-09T22:02:08+05:30 IST