ఈ ఇళ్ళు... చాలా కాస్ట్‌లీ గురూ... అయినా భారీ విక్రయాలు...

ABN , First Publish Date - 2021-01-06T22:02:04+05:30 IST

నివాస గృహాలకు సంబంధించి కిందటి సంవత్సరం(2020) ద్వితీయార్ధంలో ఖరీదైన గృహాల విక్రయాలు భారీగా జరిగాయి. జులై-డిసెంబరు మధ్య కాలంలో దేశీయంగా రూ. 50 లక్షల విలువకు పైబడిన ఇళ్ల అమ్మకాల వాటా 57 శాతం.

ఈ ఇళ్ళు... చాలా కాస్ట్‌లీ గురూ... అయినా భారీ విక్రయాలు...

ముంబై : నివాస గృహాలకు సంబంధించి కిందటి సంవత్సరం(2020) ద్వితీయార్ధంలో ఖరీదైన గృహాల విక్రయాలు భారీగా జరిగాయి. జులై-డిసెంబరు మధ్య కాలంలో దేశీయంగా రూ.  50 లక్షల విలువకు పైబడిన ఇళ్ల అమ్మకాల వాటా 57 శాతం. ఇదే సమయంలో అందుబాటు ధరల గృహ విక్రయాలు 43 శాతానికి పరిమితమయ్యాయి. ఇందుకు ప్రధానంగా కోవిడ్‌-19 కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభం తాలూకు పరిస్థితులు ప్రభావం చూపినట్లు రియల్టీ రంగ విశ్లేషణ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది.


ఈ ఏడాది విలాసవంత విభాగంలో గృహాల కొనుగోళ్ళపై వినియోగదారులు అధిక ఆసక్తిని చూపినట్లు నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక పేర్కొంది. మార్కెట్‌లో ప్రవేశించేందుకు 2020 అనుకూలమని అత్యధికులు భావిస్తున్నట్లు వెల్లడించింది. దీనికితోడు ఆర్థికంగా పటిష్టస్థితిలో ఉన్న వర్గాలకు హౌసింగ్‌ రుణాల అందుబాటు తదితర అంశాలు తోడైనట్లు వివరించింది. దీర్ఘకాలిక రుణ చెల్లింపుల సామర్థ్యం కలిగిన వ్యక్తులు గృహ కొనుగోళ్లకు ముందుకు వచ్చినట్లు విశ్లేషించింది.


అగ్రస్థానంలో హైదరాబాద్‌... 

రెసిడెన్షియల్‌ విభాగంలో అధిక పరిమాణంలో విక్రయాలకు ఆస్కారమున్న ప్రాంతాల్లో రియల్టీ కంపెనీలు కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు నైట్‌ ఫ్రాంక్‌ వెల్లడించింది. ఈ విషయంలో త్రైమాసిక ప్రాతిపదికన ముంబై, పుణే నగరాలు 121 శాతం పురోగతిని చూపినట్లు పేర్కొంది. అయితే కొత్త ప్రాజెక్టులను ప్రవేశపెట్టడంలో హైదరాబాద్‌ 480 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచినట్లు పేర్కొంది. కాగా... 2020 ద్వితీయార్థంలో మొత్తం 1,46,228 యూనిట్ల ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు తెలిపింది. అయితే కిందటి సంవత్సరంతో పోలిస్తే 34 శాతం తక్కువేనని తెలియజేసింది.

Updated Date - 2021-01-06T22:02:04+05:30 IST