‘రామప్ప బృందం’లో ఈ ఇద్దరమ్మాయిలు

ABN , First Publish Date - 2021-07-29T05:30:00+05:30 IST

తెలుగు నేలపై తొలి ప్రపంచ వారసత్వ కట్టడంగా ఘనత పొందిన నిర్మాణం రామప్ప

‘రామప్ప  బృందం’లో  ఈ ఇద్దరమ్మాయిలు

తెలుగు నేలపై తొలి ప్రపంచ వారసత్వ కట్టడంగా ఘనత పొందిన నిర్మాణం రామప్ప దేవాలయం. ‘అవుట్‌ స్టాండింగ్‌ యూనివర్సల్‌ వాల్యూ’ కలిగినదిగా ఈ ఆలయాన్ని ప్రతిపాదించే క్రమంలో...యునెస్కోకు సమర్పించిన ‘డోసియర్‌’ రూపకల్పనలో యువ ఆర్కిటెక్ట్‌లు శ్రావణి, ఆశ్రిత అగర్వాల్‌ పాలుపంచుకున్నారు.కాకతీయుల నాటి కళా వైభవం, నిర్మాణ కౌశలం, అసమాన కళాఖండాల విశిష్టత లాంటి అంశాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించడంలో, క్రోడీకరించడంలో వారిద్దరూ కీలకపాత్ర పోషించారు.




నెలలో నాలుగు రోజులు అక్కడే... 


- ఆశ్రిత అగర్వాల్‌,  కన్సర్వేషన్‌ ఆర్కిటెక్టు


‘‘వారసత్వ హోదా కోసం రామప్ప దేవాలయంపై యునెస్కోకు పంపిన 230 పేజీల డోసియర్‌  రూపకల్పన కోసం ఏడేళ్లు మా టీమ్‌ శ్రమించింది. అందులో బృంద సమన్వయంతో పాటు కట్టడానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని క్రోడీకరించడం నా పని. దాంతో పాటు రామప్ప దేవాలయం పరిసరాల్లోని మిగతా కట్టడాలకు సంబంధించిన విషయాలనూ డాక్యుమెంటేషన్‌ చేశాం. ముఖ్యంగా ఆ ప్రదేశాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడానికి అవసరమైన సూచనలు, సలహాలనూ అందులో పొందుపరిచాం.


నేను విజయవాడలో స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, భోపాల్‌లో కన్సర్వేషన్‌ ఆర్కిటెక్చర్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాను. ఆ అనుభవంతో ఈ వారసత్వ కట్టడం పరిరక్షణ, పర్యాటకులకు అనుగుణంగా రామప్ప ఆలయ పరిసరాలను తీర్చిదిద్దడం, రవాణా సౌకర్యం, వసతి గృహాలు తదితర పర్యాటకాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను  ‘క్షేత్ర’ కన్సల్టెన్సీ తరపున రూపొందించాను. అందుకోసం ములుగు పరిధిలోని చాలా గ్రామాలను చుట్టివచ్చాను. 


తెలుగు రాకపోయినా...

స్థానికులనూ, వారి సంస్కృతినీ భాగస్వామ్యం చేయకుండా ఏ ప్రదేశంలోనూ పర్యాటకాన్ని అభివృద్ధి చేయలేం. కనుక తెలుగు రాకపోయినా, అక్కడి గ్రామీణ, ఆదివాసీల సామాజిక, సాంస్కృతిక జీవన విధానాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రతి నెలలో నాలుగు రోజులు అక్కడే ఉండేదాన్ని. ఆ ఆహ్లాదకరమైన వాతావరణం నాకెంతగానో నచ్చింది. గ్రామీణులు మా పట్ల చాలా ప్రేమతో మెలిగేవాళ్లు. చాలాసార్లు వాళ్లు మా కోసం ప్రత్యేకంగా ఆహారం వండి తెచ్చేవారు. పాలంపేటకు ఏడు కిలోమీటర్ల దూరంలోని ఇంచెర్ల గ్రామంలో క్రాఫ్ట్‌ విలేజ్‌ నిర్మాణానికి డిజైన్‌ రూపొందించాను. తద్వారా స్థానిక హస్తకళలకు, ఉత్పత్తులకు ఆదరణ లభించేలా ఆ ప్లాన్‌ గీశాను.  రామప్ప కట్టడం స్థితిగతులపై ఒక డాక్యుమెంట్‌ కూడా తయారుచేశాను.


డోసియర్‌ తయారీకి కాకతీయ ట్రస్ట్‌కు చెందిన పాపారావు, ఎన్‌ఐటీ ప్రొఫెసర్‌ పాండురంగారావు, చూడామణి నందగోపాల్‌ తదితరులతో పాటు పురావస్తు, సాంస్కృతిక శాఖల అధికారులు... ఇలా పలువురు పెద్దలు సలహాలు, సూచనలు ఇచ్చారు. రామప్ప కట్టడంపై విభిన్న వ్యక్తుల అభిప్రాయాలను ఒకటిగా చేర్చి, పుస్తకంలో పొందుపరచడం నా కర్తవ్యంలో భాగం. ఆ పనిని సక్రమంగా నిర్వర్తిస్తూ, సమన్వయం చేయగలిగాను కనుకే ఆ నివేదిక అందరికీ నచ్చింది. 




చల్వాయి నుంచి రాయి...

శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో ఇసుకపై ఆ ఆలయాన్ని కట్టిన తీరు అబ్బురపరుస్తుంది. ఆలయ శిఖర నిర్మాణంలో వినియోగించిన ‘నీళ్లలో తేలియాడే ఇటుకల’ను ఎలా రూపొందించారనేది ఇప్పటికీ అంతుపట్టని విషయం. కట్టడంలో వాడిన శాండ్‌స్టోన్‌ను లక్నవరం దగ్గర్లోని చల్వాయి పరిసరాల నుంచి తెచ్చి ఉంటారనేది నా పరిశీలన. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉంది. రామప్ప ఆలయం చుట్టుపక్క ప్రాంతాల్లో కాకతీయుల కాలంనాటి దేవాలయాలు అనేకం గుర్తించాం. రామప్ప చెరువు దగ్గరే మూడు గుళ్లు కనిపిస్తాయి. అందులో రెండు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని పునరుద్ధరించాలని మా నివేదికలో సూచించాం.


ఇండో-ఆర్యన్‌ శిల్పకళకు అద్దంపట్టే ఖజురహోలో కామసూత్ర కళాకృతులు ప్రధానం. రామప్ప దేవాలయంలోని శిల్పాలు అందుకు పూర్తి భిన్నం. పురాణ, ఇతిహాస గాథలు, నృత్యభంగిమలతో పాటు జీవన విధానాన్ని ప్రబోధించే అరుదైన శిల్పకళ మన దగ్గర సాక్షాత్కరిస్తుంది. అవన్నీ కాకతీయుల కాలం నాటి కళా వైభవానికి ప్రతీకలు. ఆ కట్టడాల నిర్మాణ పరిజ్ఞానం అసమానం. పురాతన కట్టడాల నిర్మాణశైలికి ఆధునిక ఆర్కిటెక్చర్‌ సాంకేతికతను మిళితం చేస్తూ ప్రస్తుతం నేనొక టౌన్‌షి్‌ప డిజైన్‌ రూపొందించే పనిలో ఉన్నాను. వారసత్వ కట్టడాల పరిరక్షణ  నా బాధ్యత. కనుక ఆ దిశగా నా అధ్యయనం కొనసాగిస్తాను.’’


ఇండో-ఆర్యన్‌ శిల్పకళకు అద్దంపట్టే ఖజురహోలో కామసూత్ర కళాకృతులు ప్రధానం. రామప్ప దేవాలయంలోని శిల్పాలు అందుకు పూర్తి భిన్నం. పురాణ, ఇతిహాస గాథలు, నృత్యభంగిమలతో పాటు జీవన విధానాన్ని ప్రబోధించే అరుదైన శిల్పకళ మన దగ్గర సాక్షాత్కరిస్తుంది. అవన్నీ కాకతీయుల కాలం నాటి కళా వైభవానికి ప్రతీకలు. ఆ కట్టడాల నిర్మాణ పరిజ్ఞానం అసమానం. 



అది నాకు దక్కిన అదృష్టం! 


-  శ్రావణి మల్లం,  యువ ఆర్కిటెక్టు


‘‘రామప్ప కట్టడానికి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కినందుకు వరంగల్‌ అమ్మాయిగా గర్విస్తున్నాను. ఆ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని యునెస్కోకి తెలిపే డోసియర్‌ రూపకల్పనలో నేనూ భాగస్వామినైనందుకు సంతోషంగా ఉంది. మా సొంతూరు వరంగల్‌. అయితే, నేను పుట్టిందీ, పెరిగిందీ హైదరాబాద్‌లోనే.! చిన్నప్పటి నుంచి నాకు చారిత్రక ప్రదేశాలు చూడటమంటే ఇష్టం. దాంతో స్కూలు సెలవులకు వరంగల్‌ వెళ్లినప్పుడల్లా, రామప్ప గుడికి వెళదామని ఇంట్లో గొడవ చేసేదాన్ని.


‘వద్దమ్మా! అది చాలా దూరం’ అని తాతయ్య వాళ్లు తీసుకెళ్లేవారు కాదు. కానీ ఒక ఆర్కిటెక్ట్‌ పరిశోధకురాలిగా ఏడేళ్ల కిందట మొదటిసారి ఆ ప్రాంగణంలో అడుగుపెట్టిన సందర్భం నా జీవితంలో మరిచిపోలేని ఒక మధురానుభూతి.. ఐదేళ్ల బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో భాగంగా చివరి ఏడాది ఇంటర్న్‌షి్‌పకు 2015లో ‘క్షేత్ర’ కన్సల్టెన్సీలో చేరాను. అదే నా వృత్తిజీవితానికి ఒక మేలిమలుపు అయింది. వారసత్వ హోదా రావాలంటే మిగతా కట్టడాలకన్నా రామప్ప ఎలా భిన్నమైనదో సమగ్రంగా వివరిస్తూ యునెస్కోకు సమర్పించడానికి ఒక పుస్తకాన్ని, అంటే డోసియర్‌ని రూపొందించే బాధ్యతను ‘క్షేత్ర’కు కేంద్ర పురావస్తుశాఖ అప్పగించింది. దాంతో కోర్సు కూడా ఇంకా పూర్తికాని నాకు ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో పనిచేసే అరుదైన అవకాశం దక్కింది. 


కొలతలు తీసుకోవడం కష్టమైంది...

డోసియర్‌ రూపకల్పనలో రామప్ప కట్టడం తాలూకూ చిత్రపటాలు, ప్రణాళికలకు సంబంధించిన డ్రాయింగ్స్‌ గీసే బాధ్యత నాకు అప్పగించారు. సీనియర్‌ కన్సర్వేషన్‌ ఆర్కిటెక్ట్‌ సూర్యనారాయణ మూర్తి పర్యవేక్షణలో నాతో పాటు ఆశ్రిత, గురుప్రసాద్‌, సత్యకృష్ణ యాభై రోజుల పాటు పాలంపేటలోనే ఉండి, ఆ కట్టడంపై అధ్యయనం చేశాం. రామప్ప ఆలయంతో పాటు నంది మండపం, శిఖర, ఏనుగు బొమ్మలు, నాట్యమండపం, గుడి నలుదిక్కులా ఎలివేషన్‌తో పాటు ప్రాంగణంలోని ఇతర కట్టడాలు, శిల్పాల కొలతలు సేకరించాం. మ్యాపింగ్‌తో పాటు వాటిని ఆటోక్యాడ్‌లో డ్రాయింగ్‌ గీయడం, స్కెచెస్‌ వేయడం నా పని.


అయితే, అదేమంత సులువు కాదు. నాట్యమండపం పైభాగంలోని నగిషీలను కొలవడం చాలా కష్టమైంది. అందుకోసం ఒక్కోసారి పెద్ద నిచ్చెనతో పైకి ఎక్కాల్సి వచ్చేది. స్తంభాలమీద దారం పట్టేంత సన్నని రంధ్రాలున్న కళాకృతులను ఎలా చెక్కగలిగారనేది పెద్ద వింత. వాటి కొలతలు తీసుకోడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఇలా ఒకటా, రెండా... ప్రతిదీ మాకొక సవాల్‌గా ఉండేది. అయినా, ఆనందంగా పనిచేయగలిగాం. పన్నెండు మదనికలు, నాగిని, కోయ స్త్రీలు, మహిళల వీరత్వాన్ని కళ్లకు కట్టే కళాకృతులు, రామాయణ, భారత ఇతిహాసాలు, పురాణ గాథలను తెలిపే శిల్పాలు, ఏనుగు బొమ్మలు... వీటన్నిటి కొలతలు సేకరించడంతో పాటు వాటికి అనుగుణంగా ఇలస్ట్రేషన్స్‌ గీశాను. ఒకసారైతే, హైదరాబాద్‌ వెళ్లాక ఫొటోలు పరిశీలిస్తే గానీ తెలియలేదు... కట్టడం ఉత్తర భాగం కొలతల విషయంలో కొంత తడబడ్డామని! మళ్లీ తీసుకొని పొరపాటును సరిదిద్దుకున్నాం. 



అదొక పెద్దవింత...

నల్ల శిలల (బ్లాక్‌ డోలరైట్‌)ను అందమైన కళాకృతులుగా మలచడం అసాధారణం. అసలు ఆ రోజుల్లో అంతటి అరుదైన శిలలను, అంత పెద్ద రాళ్ళను ఎక్కడి నుంచి... ఇక్కడికి ఎలా తెచ్చారనేది ఇప్పటికీ అంతుపట్టని విషయం. అదొక పెద్ద వింత కూడా. ఆ ప్రాంగణంలోని ప్రతిదీ నాకు అద్భుతంగా అనిపించేది.  రామప్ప డోసియర్‌ కోసం నేను గీసిన 43 డ్రాయింగులు... అదీ నా పేరుతో యునెస్కో వెబ్‌సైట్‌లో పెట్టారు. ఇది నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. ఒక పెద్ద ప్రాజెక్టుతో కెరీర్‌ మొదలుపెట్టే అవకాశం నాకు లభించింది. తర్వాత ఆస్ట్రేలియాలో ఆర్కిటెక్చర్‌లో మాస్టర్స్‌ పూర్తిచేశాను. మన చారిత్రక వారసత్వ కట్టడాల ఘనతను భావితరాలకు తెలిపేలా నా వంతు ప్రయత్నిస్తాను.’’

‘‘రామప్ప డోసియర్‌ కోసం నేను గీసిన 43 డ్రాయింగులు... అదీ నా పేరుతో యునెస్కో వెబ్‌సైట్‌లో పెట్టారు. ఇది నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను.’’


Updated Date - 2021-07-29T05:30:00+05:30 IST