ఈ రెండు వారాలు కీలకం

ABN , First Publish Date - 2020-03-30T18:09:37+05:30 IST

కరోనా పెద్ద సమస్యేమీ కాదు.. కొందరు దగ్గు, జలుబుతో పాటు.. రుచి, వాసన గుర్తించలేకపోతున్నారు ఫిట్‌గా ఉంటే వృద్ధులకూ ప్రమాదం లేదు..

ఈ రెండు వారాలు కీలకం

పాజిటివ్‌ కేసులు డబుల్‌ కావొచ్చు.. 

అయినా ఆందోళన అవసరం లేదు.. 

వైరస్‌ డబులింగ్‌ సమయం 

కరోనా పెద్ద సమస్యేమీ కాదు..

కొందరు దగ్గు, జలుబుతో పాటు..  రుచి, వాసన గుర్తించలేకపోతున్నారు

ఫిట్‌గా ఉంటే వృద్ధులకూ ప్రమాదం లేదు..

స్మోకర్లు ఎక్కువగా ఉండటం వల్లే  ఇటలీ, చైనా దేశాల్లో తీవ్రత

ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ అధినేత డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి


హైదరాబాద్‌ సిటీ: ‘‘కరోనా వైరస్‌ పెద్ద సమస్య కాదు. దానికి మందుల అవసరం ఉండదు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే వ్యాధి దానికదే తగ్గిపోతోంది. రెండు శాతం మందిలో వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటున్నాయి. వారిని ఐసీయూలో పెట్టాల్సి రావచ్చు. రెండు వారాల పాటు సామాజిక దూరం పాటిస్తే ఆ వైరస్‌ ఫ్లాట్‌ అయి దాని తీవ్రత తగ్గిపోతుంది. లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది’’ అని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజి అధినేత నాగేశ్వర్‌ రెడ్డి అన్నారు. లాక్‌డౌన్‌ అమలవ్వడంలో, ప్రజలకు అవగాహన కల్పించడంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘వైర్‌సలో డబులింగ్‌ సమయం ఉంటుంది. ఈ సంఖ్య అయిదు రోజుల్లో పెరుగుతుంది, వారంలో అది మరి డబుల్‌ అవుతుంది’’ అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రెండు వారాలు చాలా కీలకమని వైరస్‌ సోకిన వారి సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముందని, ఆందోళన అవసరం లేదని చెప్పారు. ఈ వైర్‌సకు ప్రస్తుతం మందు లేదని, అయితే కరోనా వైరస్‌ బాధితులకు దగ్గర ఉండే వైద్యులు ఆ జబ్బు బారిన పడకుండా వారికి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ రెండు టాబ్లెట్లు వారానికి రెండు సార్లు జింక్‌తో పాటు కలిపి ఇస్తున్నారని చెప్పారు. దీని వల్ల వైరస్‌ సోకే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు అధ్యయనాల్లో తేలిందన్నారు. రోగుల్లో వైరస్‌ తీవ్రత కాస్తా ఎక్కువగా ఉంటే యాంటీ బయోటిక్‌ అజ్రితో 5 ఎంఎల్‌ను అయిదు రోజుల పాటు వాడితే సరిపోతుందన్నారు. ఈ వైరస్‌  ఉన్న కొందరిలో గొంతు ఇన్ఫెక్షన్‌, ఆయాసం, విరోచనాలు, వాంతులు వంటి లక్షణాలు ఉంటున్నాయని చెప్పారు. కొందరు రుచి, వాసన గ్రహించలేకపోతున్నారని నాగేశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే 60-65 ఏళ్లు పైబడిన వారిలో కూడా ఈ వైరస్‌ తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని చెప్పారు. చైనా, ఇటలీ, వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో ఎక్కువ మంది పొగతాగుతారని, దీంతో పాటు డయాబెటిక్‌ రోగులు ఎక్కువని చెప్పారు. అందువల్లే అక్కడ వైరస్‌ వేగంగా వ్యాపించిందని, తీవ్రత ఎక్కువగా ఉందని నాగేశ్వర్‌ రెడ్డి వివరించారు. న్యూస్‌పేపర్ల వల్ల వైరస్‌ సోకే ముప్పు లేదన్నారు. ఈ వైర్‌సకు టీకా తయారు కావడానికి 12-16 నెలల సమయం పట్టొచ్చని చెప్పారు.


ఎలా ప్రభావితం చేస్తుందంటే

కరోనా వైరస్‌ పాజిటివ్‌ వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ తుంపర్లు పడితే, లేదా వాటిని చేతితో తాకి మళ్లీ అదే చేతులతో కళ్లు, ముక్కు, చెవులు తాకినప్పుడు వైరస్‌ శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉందని నాగేశ్వర్‌ రెడ్డి చెప్పారు. ఇది ఊపిరితిత్తుల్లోకి వెళ్లినప్పుడు సైటోకాన్‌ విడుదలవుతుందని, ఫలితంగా నేరుగా గుండెపై ప్రభావం చూపుతుందని చెప్పారు. అయితే 2ు మందిలోనే ఇంత తీవ్రత ఉంటుందన్నారు. ఎక్కువగా దగ్గితే వైరస్‌ బయటకు వస్తుందన్నారు. వైరస్‌ చిన్న పేగుల్లోకి వెళ్లి డయేరియా వల్ల కూడా బయటకు వస్తుందని చెప్పారు. 


ఈ మూడు విటమిన్లతో ముందే రక్షణ

ముఖ్యమైన మూడు విటమిన్స్‌ తీసుకుంటే కరోనా వైరస్‌ రాకుండా జాగ్రత్త పడొచ్చని నాగేశ్వర్‌ రెడ్డి సూచించారు. విటమిన్‌-డి లోపం ఉంటే వైరస్‌ ముప్పు ఎక్కువగా ఉంటోందని చెప్పారు. ఈ విటమిన్‌ లోపం ఉన్న వారు వారానికొకసారి విటమిన్‌-డి టాబ్లెట్‌ వేసుకోవాలని ఆయన సూచించారు. దీంతో పాటు విటమిన్‌-సి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలని, బీ కాంప్లెక్స్‌, జింక్‌ టాబ్లెట్లు వేసుకోవాలని చెప్పారు. వీటి వల్ల వైరస్‌ బారిన పడకుండా కాపాడుకొనే అవకాశముందన్నారు. మానసికంగా చాలా మంది హై టెన్షన్‌లో ఉంటున్నారని దీని వల్ల ఇమ్యూనిటీ తగ్గే ప్రమాదం ఉందని చెప్పారు. క్రియేటివిటీ, సానుకూల ఆలోచనలతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు.

Updated Date - 2020-03-30T18:09:37+05:30 IST