Abn logo
Feb 24 2020 @ 01:17AM

తేట తెలుగు మాటల కృష్ణశాస్త్రి

సోకు మాటలు, సొగసు మాటలు, మేలమాడేవి, కేలుపట్టి ఓదార్చేవి, ఎదలోతులు చిలికేవి, ఎదురు వచ్చేవి ఎన్నెన్నో రకాలు అన్నిటినీ మించి ఆ తేట తెలుగు మాటలతో అంతులేని అనుభూతులు తెలిపే పొదుపరి. అవి తీపైనా చేదైనా బరువే. ఈ రోజుల్లో జనం తెలుగు మాటలు పలకడం లేదని బాధపడేవారికి కృష్ణశాస్త్రి రచనలు చదివితే ఓదార్పు దొరుకుతుంది.


మెత్తని తేట తెలుగు మాటల పూలగుత్తుల పరిమళంతో గుబాళింపచేసే సత్తా కృష్ణశాస్త్రి సొంతం. తీయ తేనియ బరువు మోయలేదీ బ్రతుకు అనగలిగిన సుకుమారి. అలతి అలతి పదాలు గుచ్చి గుండెల్లో చొచ్చుకుని వెచ్చటి వెన్నెల కురిపించగల కూర్పరి. కవితల్లోనే కాదు కథల్లోనూ కవుల, మహావ్యక్తుల పరిచయాల్లోనూ, గడచిన కాలాన్ని కళ్ళముందుంచే కబుర్లలోనూ ఈ కనికట్టు తెలిసిన గడసరి. సోకు మాటలు, సొగసు మాటలు, మేలమాడేవి, కేలుపట్టి ఓదార్చేవి, ఎదలోతులు చిలికేవి, ఎదురు వచ్చేవి ఎన్నెన్నో రకాలు అన్నిటినీ మించి ఆ తేట తెలుగు మాటలతో అంతులేని అనుభూతులు తెలిపే పొదుపరి. అవి తీపైనా చేదైనా బరువే. ఈ రోజుల్లో జనం తెలుగు మాటలు పలకడం లేదని బాధపడేవారికి కృష్ణశాస్త్రి రచనలు చదివితే ఓదార్పు దొరుకుతుంది.


పెద్దాడ రామస్వామిగారు కవిపేరు చెప్పకుండా అచ్చేసిన ‘కన్నీరు’తో మొదలై, సభాపతి శివశంకరస్వామి అప్పటికి దొరికిన రచనలన్నీ తనకు తోచిన వరసలో అచ్చేసిన ‘కృష్ణ పక్షము’తో కాలూనుకుని ‘ప్రవాసము’, ‘ఊర్వశి’ రచనలతో అచ్చమైన భావకవిగా ఆమోదము పొంది, ‘మహతి’లో రాగాలు పలికించి, ‘పల్లకీ’ ఎక్కి ఊరేగి, ‘బదరిక’లో లోకంతో కలిగే బాదరాయణ సంబంధాన్ని బలపరచి, ‘కవి పరంపర’నీ ‘మహావ్యక్తులు’నీ కళ్ళకి కట్టించి ‘ధనుర్దాసు’, ‘బహుకాలదర్శనం’, ‘కొత్తకోవెల’ వంటి నాటక సంపుటులలో మానవప్రవృత్తు లను ఆవిష్కరించి, యక్షగానాలు వినిపించి, అమృతవీణ స్వరపరచి, మంగళకాహళి మ్రోగించి, ‘అప్పుడు పుట్టి ఉంటే’ అల్లసాని పెద్దననయి ఉందునని ఆశ తెలియచేసి, సినిమా పాట ‘మేఘమాల’లో తేలియాడించి, తెలుగువారికి కొమ్మ లేకుండా ‘గోరింట’ పూయించారు, కృష్ణశాస్త్రిగారు.


ఎట్టుండునో నా యెద

     యెగిరి నాట్యమాడునో...

వెరపు చేత వెరగు చేత

     వెడగు పనులు చేయునో 

తీయని చిరునవ్వు వెన్నెల

     తేటలు నా వరుడు చిలుక 


తీయని చిరునవ్వు చిలికేది వెన్నెల తేటలు- చిరునవ్వుకి తీపి రుచిని, వెన్నెల తేటలలో తెల్లని చల్లని హాయిని అద్దడం కృష్ణ శాస్త్రి ప్రత్యేకత. వెరపు చక్కటి తెలుగు పదం. కాని భయం అనే మాటే అందరూ వాడుతున్నారు. అలాగే వెరగూ, వెడగూ. 

లోకం పట్టదు కృష్ణశాస్త్రికి అన్నారు. కాని లోకంలో ఇవ్వడమే కాని తిరిగి ఇస్తుందో లేదో ఆలోచించని ప్రేమ గురించి చెపుతూ లోకం అలా లేదని చురకేస్తున్న కృష్ణశాస్త్రిని చూడండి. 

పొడపుమల పయి బంగరు మ్రుగ్గులుంచి 

సంజమబ్బుల కుంగరాల్‌ సంతరించి 

పోవుచున్నావు, నీవేమి పొందితోయి

వెఱ్ఱి మిత్రుడ లోకంపు విధము గనుమ! 


పొడుపుమల, బంగరు మ్రుగ్గులు, సంజమబ్బు వంటి తేటతెలుగు మాటలు తేటగీతి గణాలకి అడ్డం రాలేదు సరికదా నడక నేర్పాయి. పొద్దుపొడిచినపుడు, పొద్దువాలినపుడు కంటికి కనిపించే తీరు రూపుకట్టించారు. 


తేలి తేలీ, అలల

తూలి తూలీ, చదల 

సోలి సోలీ పొరలనా

నాలుగూ దిక్కులా

నడిమి స్వర్గమ్మంత

పాలకడలిగ జేయనా 

దేవ

పండు పున్నమి జేయనా 


ప్రకృతంటే కృష్ణశాస్త్రికి పిచ్చి ప్రేమ. మహతి గేయ సంకలనంలోని ఈ పాటకి రాగం సురటి అనుకోవడం కాకతాళీయం కాదు. ఆ మాటలు వీస్తున్న మంద మలయ మారుతమే. భావ కవిత్వం గానయోగ్యంగా ఆత్మపరంగా ఉండాలని కృష్ణశాస్త్రి అనడంలో ఉద్దేశం ఇది. అందుకే ‘తృణ కంకణం’ (రాయప్రోలు) లాంటివి భావకవిత్వం కావనాల్సి ఉంది. 


‘‘నెమలి కన్ను నీలి గప్పీ/ వెన్నెలలతో వెల్ల వేసీ/ గట్టి మాటల పొదిగి ఇట్టే/ ఇల్లు కడతాడు’’ -అని చింతా దీక్షితులు గారి కవిత్వాన్ని తేటతెలుగు మాటలతో కృష్ణశాస్త్రి మెచ్చుకు న్నారు. కాని నెమలికన్నులు పిల్లల ఊహలనీ, వెన్నెల వెల్ల వారి నిర్మలమైన మనస్సనీ, గట్టి మాటల పొదగడం అంటే గుండెకు హత్తుకునే పద ప్రయోగం అనీ, ఇట్టే ఇల్లు కట్టడం అంటే అప్పటికప్పుడు కథలు కవితలు అల్లడం అనీ ఎంతో సోదాహరణంగా చెప్పాలి. ఇప్పటికీ కృతక గ్రాంథికంలోనే పద్యాలు రాయాలనుకునే వారికి 3,4,3,4 మాత్రలతో మూడు పాదాలు; 3,5 మాత్రలతో నాలుగో పాదం గురజాడ చెప్పినట్లు తేటైన మాటలు కూర్చుకున్న కృష్ణశాస్త్రిని చూసి బుద్ధి రావాలి. 


నా నోట నీ మాట గానమయ్యే వేళ

నా గుండె నీవుండి మ్రోగింపవా వీణ?

రాగమెరుగని వీణ రక్తి నెరుగని వీణ

తీగపై నీ చేయి తీయకే గడియేని

అడుగడుగునకు స్వామి అడుగు సవ్వడి వినిన

ఎడద లోలోన ఎల్లెడల విశ్వములోన

ఈ యాత్ర ముగియునో ఏ వేల దిగుదునో

హాయిగా చల్లగా సాగిపోవుదునంతె!


మెత్తని మాటల గుత్తులనే కాదు మనం గమనించాల్సింది; అవసరమనుకుంటేనే యడాగమ నుగాగమాల్లాంటివి పాటిం చడం, ‘గడియ యేని’ అని ఒక చోట, ‘గడియేని’ అని ఇక్కడ, ‘ఎల్ల యెడల’ అని ఒక చోట ‘ఎల్లెడల’ అని ఇక్కడ ప్రయోగం చెయ్యడం మాట మెత్తదనం కోసమే. వేళకీ వేలకీ తేడా తెలుసుకుంటేనే ఆ పాట మన నోట మూర్ఛనలు పోతుంది. 


నవ్వంటే జాబిల్లి - పువ్వంటే మల్లి

నవ్వేటి పువ్వంటె నా చిట్టితల్లి

దొంగా కళ్ళల్లో తొగల రేకుల్లో

తుమ్మెదలు మొదలు మళ్ళీ మళ్ళీ


చిట్టితల్లి కళ్లు తొగల (కలువల) రేకు. మరి తుమ్మెదలు రాకుండా ఉంటాయా? కానీ అవి దొంగకళ్ళు కాబట్టి తుమ్మెదలు తెచ్చిపెట్టుకున్న కన్నీళ్ళు. జాబిల్లిని మల్లిని కలిపి నవ్వేటి పువ్వ న్నారు చిట్టితల్లిని. ఈ మాటలే కాదు కష్టజీవుల యాసని కూడా కవిత్వంలో వాడగలరు కృష్ణశాస్త్రి. 


సేపలు సెట్లెక్కేస్తాయ్‌ కోపం వొచ్చి

సేతికి మీసాలొస్తాయ్‌ మొగతనవొఁచ్చి

సింత బొర్రలో నావ సిక్కడిపోతుంది

           సిగ్గొచ్చి

తాసు నాగుంది దాని జడ

కాటేస్తే సస్తావ్‌ ఎయ్‌ర గడ

మొగిలిపొత్తునాగుంది దాని మెడ

పొడిగొడితే ఏడుస్తావ్‌ ఎయ్‌ర గడ

ఎనక నుంచి సూస్తేనే ఏడూపొస్తుంది -

దాని జడ - దాని మెడ ఎయ్‌ర గడ


ఆరితేరిన రచయిత మంది మాటని మరిచిపోడు. తన చుట్టూ ఉన్న వాళ్ల మాట వాళ్ళ పాట ఆ యాసలోనే తెములుస్తాడు. శ్రమైకజీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు. శ్రమైక గీతపు శ్రవణ సుఖానికి కృష్ణశాస్త్రి ఎత్తుగడ ఆ యాసలోనే ఊసు. ఎటొచ్చీ అచ్చేసేవాళ్ళకి ఆ పాట నడక తెలియాలి. 


కృష్ణశాస్త్రిని దుఃఖానికి ప్రతీకగా భావకవిత్వం విషయంలో భావించడానికి కృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి ఉదాహరణలుగా నిలుస్తాయి. ఆ దుఃఖం ఊహాజనితం. తనను వీడి చన్న తనయుడి తలపును తడియారని కళ్ళతో తండ్రి పడే బాధని తెలిపిన తీరు బతుకు బరువు మోస్తున్నపుడు కలిగే దుఃఖం:


నన్ను గన్న తండ్రి, నా కంటి వెల్గు, నా

యూత, జీవనంపుటూట, బాట

నా యెడందయోర్పు, నా యూర్పు, నను వీడి

చన్న - ఏమి మిగిలె నన్న యింక?


ఈ సందర్భంలో ‘పిరదౌసి’లో జాషువా అన్నది గుర్తొస్తుంది. ‘‘వత్సర త్రయంబు వయసు వచ్చిన ముద్దు, కాలు సేతులుండి కదలు ముద్దు, పుత్రనామకమున మొదట పుట్టిన ముద్దు, మాననీయ ఇంక మనకు లేడు’’. ముద్దుకి కాళ్ళూ చేతులు ఉండి కదలడాన్ని చూసిన పిరదౌసికి అది లేని శూన్యం నుంచి తేరుకోవడానికి రెండేళ్ళు పట్టిందన్నాడు జాషువ. 


సినిమా కోసం కృష్ణశాస్త్రి పాటలు రాసారనేకంటే ఆయన రాసిన పాటలు సినిమావాళ్ళు ఉపయోగించుకున్నారనటం సబబు. అదీకాక సినిమా కోసం రాసిన పాటలు ఆయా సన్నివేశాలకి తగ్గట్టు ఉంటాయి. అందువల్ల కృష్ణశాస్త్రి సినిమా పాటల్లో తేట తెలుగు మాటలు వాడిన తీరు పరిమితంగా చూస్తే చాలు. కవిత్వంలో కంటె పాటల్లో పదప్రయోగానికి వెసులుబాటు ఎక్కువున్నట్టు కనిపిస్తుంది కాని ఆ పాట తూగు లయ చెడ కుండా ఉండాలని కవి పడే కష్టం కళ్ళు అరమూతలు పడేలా చెవులు చేటలయ్యేలా చేస్తుంది. చప్పుడు ఎక్కువుండే మామూలు సినిమా పాటలకీ మాటలు మనసులకి వినిపించే కృష్ణశాస్త్రి సినిమా పాటకీ తేడా సాహితీ పిపాసులందరికీ తెలిసిపోతుంది.


విమర్శకుడిగానూ కృష్ణశాస్త్రి సుతిమెత్తని తీరు గమనించండి: ‘‘ఒక శబ్దాన్నీ మరొక శబ్దాన్నీ ఒక ధోరణిలో కలిపి, ఒక విలక్షణమైన గానం పుట్టించి, దాని రెక్కల మీద కూర్చోబెట్టి, ఎట్టి దూరానుభవాలనైనా అందజేసి, ఎట్టి దూరలోకాలనైనా కనపరచి విహరింపచేస్తూ ఇంకా వెనకాలనున్నవేవో స్ఫురింప చేసే శక్తి ఒకటి ఉంది. అది నన్నయ్యది. శబ్దం పలకడమే కాదు పాడుతుంది.’’ కవే విమర్శకుడైనప్పుడు కవిత్వం గురించి కవిత్వం చెప్పడమంటే ఇదే. 


ఇంత చేసిన కృష్ణశాస్త్రి పాతిక సంత్సరాల తెలుగు కవిత్వాన్ని సమీక్షిస్తూ వినయంగా చెప్పింది చూడండి: ‘‘నవ్యకవిత్వం ఒక తీవ్రోద్యమమయి నిలవడానికి ఈ నా కృషి కొంతవరకయినా కారణమని ఇప్పుడింత దూరాన్నించయినా అనుకుంటే మన్నిం చండి.’’ కానీ గడుసుగా కృష్ణశాస్త్రి తనకు కలలో వేమన కనబడి కృష్ణశాస్త్రిని గురించి అన్న మాటలతో ముగిస్తాను:


అందరంద్రు నేలకందక నీ కనుల్‌

నింగి కేరుపరచు నిచ్చెనలని!

నేనెరుంగుదోయి నెచ్చెలీ! లోకమ్ము

దొలిచి చూచు బాకు తుదల వాని!

కాండూరి

95156 07366

(నేడు దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్ధంతి)

Advertisement
Advertisement
Advertisement