మాపై నిందలు వేస్తున్నారు..

ABN , First Publish Date - 2021-01-13T06:25:16+05:30 IST

సిమెంట్‌ ధరలపై బిల్డర్లు, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌).. ప్రజలను, ప్రభుత్వాన్ని తప్పుదోవ

మాపై నిందలు వేస్తున్నారు..

బిల్డర్లు తప్పుదోవ పట్టిస్తున్నారు  జూ సిమెంట్‌ ధరలపై ఎస్‌ఐసీఎంఏ


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సిమెంట్‌ ధరలపై బిల్డర్లు, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌).. ప్రజలను, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని దక్షిణ భారత సిమెట్‌ తయారీదారుల సంఘం (ఎస్‌ఐసీఎంఏ) ఆరోపించింది. నిర్మాణ వ్యయం పై, అందులో సిమెంట్‌కు అయ్యే ఖర్చుపై సమాచారం ఇవ్వ డం లేదని ఎస్‌ఐసీఎంఏ ప్రెసిడెంట్‌, ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌ వైస్‌ చైర్మన్‌, ఎండీ ఎన్‌ శ్రీనివాసన్‌ అన్నారు. మార్జిన్లు తగ్గించుకుని గృహాలను విక్రయించడానికి ఇష్టపడని బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు తక్కువ మార్జిన్లతో ఉత్పత్తి చేస్తున్న సిమెంట్‌ పరిశ్రమపై అభాండాలు వేస్తున్నాయని పేర్కొన్నారు. సిమెంట్‌ పరిశ్రమ పనితీరు, వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ప్రధాన మంత్రికి లేఖ రాసినట్లు చెప్పారు.


నిర్మాణ వ్యయంలో సిమెంట్‌ వాటా 2 శాతమే:

గృహ నిర్మాణ వ్యయంలో సిమెంట్‌ వాటా 2 శాతమే. ప్రతి చదరపు అడుగు నిర్మాణానికి అర బస్తా సిమెంట్‌ పడుతుంది. సిమెం ట్‌ వ్యయం రూ.200 అవుతుంది. నిర్మాణం వ్యయంలో సిమెం ట్‌ వ్యయమే అతితక్కువ. బస్తాకు రూ.100 పెరిగినా చదరపు అడుగుకు పెరిగేది రూ.50 మాత్రమే. సిమెంట్‌ ధరలు పెరుగుతున్నాయని చెప్పి బిల్డర్లు ఎక్కువ రేట్లకు గృహాలను విక్రయిస్తున్నారని శ్రీనివాసన్‌ అన్నారు.


చెన్నైలోని కీలకమైన ప్రదేశంలో భూమి వ్యయం, నిర్మాణ ఖర్చులు కలిపి అపార్ట్‌మెంట్‌లో చదరపు అడుగు స్థలానికి రూ.6,700 ఖర్చవుతుంటే.. బిల్డర్లు చదరపు అడుగు రూ.15,000- 20,000లకు విక్రయిస్తున్నారని శ్రీనివాసన్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లోని కీలక మా ర్కెట్లలో  చదరపు అడుగుకు రూ.5,500 ఖర్చయితే.. రూ.8,000-10,000 విక్రయిస్తున్నారని అన్నారు. చెన్నైలో సిమెంట్‌ రకాన్ని బట్టి బస్తా ధర రూ.270 నుంచి రూ.420 వరకూ ఉందన్నారు. 


ధరల పెరుగుదల ఒక శాతం కన్నా తక్కువే:

సిమెంట్‌ పరిశ్రమలో ధరల పెరుగుదల రేటు ఒక శాతం కన్నా తక్కువగానే ఉంది. హైదరాబాద్‌లో సిమెంట్‌ బస్తా ధర రూ.360-370 ఉంది. బిల్డర్లకు రూ.245కే సరఫరా అవుతోందని అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రవీంద్ర రెడ్డి తెలిపారు. సిమెంట్‌ పరిశ్రమలో ఎబిటా మార్జిన్లు 8-15 శాతం ఉంటే.. బిల్డర్ల ఎబిటా మార్జిన్‌ దేశవ్యాప్తంగా 35-50 శాతం వరకూ ఉందని పేర్కొన్నారు. సిమెంట్‌పై 28 శాతం జీఎ్‌సటీ వసూలు చేస్తున్నారు.


ముడి పదార్థాల ధరలు పెరుగుతున్నా.. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుని పెరిగిన వ్యయ భారాన్ని కంపెనీలు భరిస్తున్నాయన్నారు. ఉత్పత్తిపై కంపెనీలు కుమ్మక్కు కావడానికి అవకాశం లేదన్నారు. దేశవ్యాప్తంగా 70 లక్షల ఫ్లాట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయి. మార్జిన్లు ఎక్కువగా ఉన్నా తక్కువ ధరలకు విక్రయించడానికి బిల్డర్లు ముందుకు రావడం లేదు. తక్కువ ధరకు ఎవరూ విక్రయించకుండా బిల్డర్లు ఏకమయ్యారని శ్రీనివాసన్‌ ఆరోపించారు.  


గిరాకీ కన్నా సామర్థ్యం చాలా ఎక్కువ:

దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 19 కోట్ల టన్నులు ఉంటే.. గిరాకీ 7 కోట్ల టన్నులు మాత్రమే ఉంది. ఉత్పత్తిని నియంత్రించే పరిస్థితిలో పరిశ్రమ లేదు. సిమెంట్‌ను నిల్వ ఉంచలేం. నిల్వ ఉంచి ధరలు పెంచడానికి వీలులేదని శ్రీనివాసన్‌ అన్నారు. రకాన్ని బట్టి  రూ.250కి కూడా సిమెంట్‌ లభిస్తున్నట్లు చెప్పారు. 


నియంత్రణ  అథారిటీని ఏర్పాటు చేస్తే:

నియంత్రణ అథారిటీని తీసుకువచ్చి ఽనియంత్రణ చేస్తే.. పరిశ్రమ మళ్లీ పాత రోజుల్లోకి వెళుతుందని శ్రీనివాసన్‌ అన్నారు. సిమెంట్‌, స్టీల్‌ పరిశ్రమకు నియంత్రణ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన వ్యాఖ్యలపై పై విధంగా స్పందించారు.


సిమెంట్‌ ధరలు, పంపిణీపై నియంత్రణలు తొలగించడానికి ముందు దేశీయంగా 2 కోట్ల టన్నుల ఉత్పత్తి సామ ర్థ్యం ఉంటే ప్రస్తుతం 50 కోట్ల టన్నులకు చేరింది. ఇందులో దక్షిణాదిలోనే 19 కోట్ల టన్నుల సామర్థ్యం ఉంది. దేశంలో లభ్యమయ్యే సున్నపు రాయిలో 30 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకల్లోనే ఉన్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే భారత్‌ సిమెంట్‌ పరిశ్రమ రెండో అతిపెద్దదని అన్నారు. దక్షిణాదిలో సిమెంట్‌ గిరాకీ కొవిడ్‌ ముందు పరిస్థితులకు రాలేదని జనవరి-మార్చి నెలల్లో పుంజుకోవచ్చని అన్నారు.  


Updated Date - 2021-01-13T06:25:16+05:30 IST