వాళ్ళు స్వయంసిద్ధలు

ABN , First Publish Date - 2021-04-19T05:53:27+05:30 IST

ఎస్‌.ఎల్‌.భైరప్ప ‘గృహభంగం’లోని నంజమ్మ, గజేంద్రకుమార్‌ మిత్ర ‘కలకత్తాకి దగ్గరలో’ లోని శ్యామ, శివరాం కారంత్‌ ‘మరల సేద్యానికి’ లోని నాగవేణి,...

వాళ్ళు స్వయంసిద్ధలు

ఎస్‌.ఎల్‌.భైరప్ప ‘గృహభంగం’లోని నంజమ్మ, గజేంద్రకుమార్‌ మిత్ర ‘కలకత్తాకి దగ్గరలో’ లోని శ్యామ, శివరాం కారంత్‌ ‘మరల సేద్యానికి’ లోని నాగవేణి, శరత్‌ ‘శేషప్రశ్న’ లోని కమల, డాక్టర్‌ పి. శ్రీదేవి ‘కాలాతీత వ్యక్తులు’ లోని ఇందిర, నామిని ‘మునికన్నడి సేద్యం’ లోని యెంగటమ్మ, ‘పాలపొదుగు’ లోని కర్రెక్కల మధ్య ఒక సామ్యం ఉంది. వాళ్ళు ‘స్వయంసిద్ధలు’.


మెట్టినింటి ఆస్తి అంతా భర్త తెలివితక్కువతనంతో హరించిపోగా అతని స్థానంలో కరణీకం బాధ్యతలు చేపట్టి ఇంటిని చక్కదిద్దుకున్న నంజమ్మ; అల్పుడైన భర్తను అతని హీనత్వాన్ని అప్రయోజకత్వాన్ని భరిస్తూ ఒంటరిపోరాటం చేసి ఎలాగోలా ఒడ్డుచేరిన శ్యామ; స్వేచ్ఛా స్వాతంత్ర్యాలే ఊపిరిగా బతికిన కమల; ధూర్తుడు, వ్యభిచారి అయిన భర్త కారణంగా అడుగడుగునా మోసపోయినా తనకంటూ జీవితాన్ని మిగుల్చుకున్న నాగవేణి; ఆసరాగా నిలవాల్సిన తండ్రే పరాన్న జీవిగా మారిపోయినా, జీవితం అడుగడుగునా పరిహసించినా, ఎదురొడ్డి నిలబడిన ఇందిర; అమాయకులైన భర్తలను వెనక ఉండి నడిపించి ఇంటిని నిలబెట్టిన యెంగటమ్మ, కర్రెక్క... వీరంతా అచ్చంగా స్వయంసిద్ధలే.


భర్తగా బాధ్యతలు చేపట్టాల్సిన మనిషి బాధ్యతల్ని విస్మరించినపుడు మనిషి ఉండీ మనిషిలేనితనం అనుభవంలోకి వచ్చినపుడు మనసంతా ఒకలాంటి శూన్యం ఆవరిస్తుంది. మనకు చెందినప్పుడే ఎవరి నుంచైనా ఏదైనా ఆశిస్తాం. చెంది ఉండడం అనేదే లేనప్పుడు ఏదైనా ఆశించడం కూడా ఆ మేరకు అర్థం లేనిదే. ఎవరి నుంచీ ఏదీ ఆశించనపుడు మనసు నిర్వికారంగా నిశ్చలంగా దేనికీ చలించనంత తటస్థంగా మారిపోతుంది. ఎవరి నుంచీ, దేనినుంచీ ఏదీ ఆశించని స్థాయికి, ఒంటరిగానే దేనినైనా ఎదుర్కొనే స్థాయికి మనసు, శరీరం తనను తాను సిద్ధం చేసుకుంటుంది. అలా తయారయిన స్వయంసిద్ధలు వాళ్ళందరూ.


జీవన పథాన్ని పంచుకోవలసిన సహచరులు మార్గమధ్యంలో దారితప్పిపోతే అల్పత్వం, అమాయకత్వం బాధ్యతారాహిత్యం వెరసి అప్రయోజకులైన భర్తల నుంచీ బాధ్యతల పగ్గాలు చేపట్టి జీవితాన్ని దుఃఖాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించగలగడం అనుకున్నంత తేలికేమీ కాదు. మనసులో నిరంతరం జరిగే క్షీరసాగరమధనంలో ఉద్భవించిన హాలాహలాన్ని లోలోపలే అదిమిపెట్టి అమృతాన్ని పెదవులపై పైపూతగా పూయగలగడం అంత సాధ్యమేమీ కాదు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు వీళ్ళందరూ.


బాధ్యతలు విస్మరించిన మనిషిపై అసహ్యం కలగడం సహజం. అయితే ఆ అసహ్యానికి కూడా పరిమితి ఉంది. పరిమితిదాటిన అసహ్యంలో వాదవివాదా లుండవు. ఆ అసహ్యం మౌనాన్ని ఆశ్రయిస్తుంది. ఆ మౌనం దీర్ఘమౌనంలోకి ప్రయాణించి చివరికి ఆ మౌనానికి కారణమయేవారి అస్తిత్వాన్ని కూడా విస్మరిం చేలా చేస్తుంది. మనిషి ఉండీ మనిషిలేనితనాన్ని అనుభవంలోకి తెస్తుంది. అచ్చంగా అలాంటి స్థితే ‘కలకత్తాకి దగ్గరలో’ శ్యామది.


‘‘అల్పశోకం అధైర్యాన్ని కలిగిస్తుంది. అధిక శోకం అచలంగా మారుస్తుంది.’’ అనడానికి శ్యామని మించిన ఉదాహరణ ఉండదు. దుర్వ్యసనాలకు తోడు ఉన్నట్టుండి నెలల తరబడి మాయమైపోయే భర్తనీ, అతని అప్రయోజకత్వాన్ని చూసి ఈ మనిషిని అసహ్యించుకోవడం, అతని ముందు కన్నీళ్ళు పెట్టుకోవడం కూడా అనవసరమనే నిర్ణయానికి వచ్చేస్తుంది శ్యామ. మైదాపిండి అయిపోయిందని చెప్పినందుకు ‘‘అదంతా పిల్లలకు మెక్కబెట్టావా? ముందు వాళ్ళను కత్తితో నరికి తర్వాత నిన్ను నరికి ఉరికంబం ఎక్కకపోతే బ్రాహ్మణ బిడ్డనే కాదు’’ అన్న భర్తని ఎలా అర్థం చేసుకోవాలో కూడా శ్యామకు తెలియలేదు. పిల్లల పుట్టుక, చావు, పెళ్ళిళ్ళు, ఉపనయనం లాంటి ప్రధాన ఘట్టాలలో భర్తగా బాధ్యతలు పంచుకోవలసింది పోయి ఇంట్లోని డబ్బులు దొంగిలించి పారిపోయే అధముడిని ఓ వైపు భరిస్తూనే మరోవైపు పిల్లల్ని పెంచి పెద్దచేసి ప్రయోజకుల్ని చేస్తుంది శ్యామ. మనిషి ఉండీ లేనితనాన్ని జీవితాంతం తలపై మోస్తుంది.


సంపన్న కుటుంబంలో పుట్టి మరో సంపన్న కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టిన నంజమ్మ (‘గృహభంగం’) భర్త చేతకానితనం కారణంగా ఉన్న ఆస్తినంతా పోగొట్టుకుని వీధిలో నిరాధారంగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కరణం అయి ఉండీ కరణీకం లెక్కలురాని భర్తను అలంకారప్రాయంగా ఉంచి ఆ బాధ్యతను తన చేతుల్లోకి తీసుకుని ఆ క్రమంలో స్వయంసిద్ధగా ఎదుగుతుంది నంజమ్మ. 


కూతురి పెళ్ళికి అన్నీ సిద్ధం చేసుకుని కన్యాదానం చేయడానికి రమ్మని అడిగిన పాపానికి పట్టుపంచెలు ఉంటే తప్ప పీటలు ఎక్కనని భీష్మించుకుని కూర్చున్న భర్తను ఏం చేయాలో అర్థంకాదు నంజమ్మకు. చివరికి పెళ్ళికొడుకు కోసం కొన్న పట్టుపంచెలు అతనికి ఇవ్వాల్సి వస్తుంది. పెళ్ళికి చేసిన పిండివంటలు కొన్నిటిని దాచుకుని తినడానికి ఇస్తే తప్ప పీటలు ఎక్కనని మళ్ళీ పేచీపెట్టి కొన్ని మిఠాయిల్ని భోషాణంలో పెట్టుకుని తాళంవేసి అప్పుడు కన్యాదానానికి సిద్ధమైన ఆ భర్తని చూసి అసహ్యించుకోవడం కూడా తట్టనంతగా అయిపోతుంది నంజమ్మ. భర్త లేకపోవడం వేరు. ఉండీ లేకపోవడం వేరు. అలా ఉండీ లేనట్టు అయిపోయిన భర్తను, అతని అప్రయోజకత్వాన్ని రోజు రోజూ భరిస్తూనే స్వయంసిద్ధగా తనను తాను మలుచుకుంటుంది నంజమ్మ.


కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ ఇంటిని నిలబెట్టి ఉంచుతానని మామగారికి మాట ఇచ్చిన పాపానికి హీనుడూ, అల్పుడూ అయిన భర్తను జీవితాంతం భరించి సహనానికి మారుపేరుగా నిలుస్తుంది నాగవేణి (‘మరల సేద్యానికి’). భర్తహీనత్వాన్ని నలుగురూ వేలెత్తి చూపిస్తున్నా కూడా ఆ నలుగురిలో తను ఒకటి కాకుండా ఉండేంత మంచితనం ఆమెది. చెడు వ్యసనాలకు లోనై భర్త ఇల్లు వదిలిపెట్టిపోతే అతని తల్లినీ, మేనత్తనూ, వదిలిపెట్టి వెళ్ళలేక చివరికి పస్తులుండడానికి కూడా సిద్ధమవుతుంది.


మంచిగా ఉన్నట్టు నటించి భర్త ఆమె పేరున ఉన్న ఆస్తి నంతా తన పేర రాయించుకుని అమ్మేసి చివరకు నిలువనీడ లేకుండా చేసినా అదే ఇంటిలో అద్దెకు ఉంటూ అదే పొలాన్ని కౌలుకి తీసుకుని పండిస్తూ చివరికి వాటిని మళ్ళీ స్వంతం చేసుకుని మామగారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది నాగవేణి.


రోజులుగా సంవత్సరాలుగా నిరంతరమూ అనుభవించిన వేదన అంతర్లీన మైపోయి తనువూ మనసూ కొంచెం కొంచెంగా ఘనీభవించిన కఠిన శిలా సదృశంగా మారిపోతే ఆ నిస్తేజం మనసుని కూడా చూరులా పట్టుకుని వేళ్ళా డుతుంటుంది. స్వంతం అనుకున్న మనిషిని ఛీజీటౌఠీుఽ చేసుకునే ప్రక్రియలో అంచెలం చెలుగా ఆ దశలన్నిటినీ దాటుకుని చివరకు ఆ క్రమంలో మరో స్వయంసిద్ధ అవుతుంది నాగవేణి.


‘స్వయంసిద్ధ’ అనగానే కళ్ళ ముందు మెదిలే మరోపాత్ర శరత్‌ ‘శేషప్రశ్న’లోని కమల. మిగిలిన వాళ్ళందరూ కాలక్రమంలో ‘స్వయంసిద్ధ’లుగా ఎదిగితే అలాంటి పరిణామ క్రమం ఏదీ అవసరపడకుండానే కమల స్వతఃసిద్ధంగానే స్వయంసిద్ధగా కనిపిస్తుంది. వివేచన, విచక్షణ, స్థితప్రజ్ఞత, మానసిక పరిణతి కలిగిన విశిష్ట వ్యక్తిత్వం కమల స్వంతం. ఆమె విశిష్ట వ్యక్తిత్వం ముందు భర్త శివనాధుడు వెల వెలపోతాడు. ఒక రకంగా ఆమె మానసిక స్థాయిని అందుకోలేని ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ అతన్ని కమలకు దూరం చేస్తుంది.


‘‘వివాహంలో స్థిరత్వం ఉంది కానీ ఆనందం లేదు. స్థిరత్వపు తాడు మెడకు కట్టి ఆ ఆనందం గొంతుకు ఉరిపోసుకుని చస్తుంది’’ అనే కమల శివనాధుడికి తన మీద ప్రేమ తగ్గిపోయినప్పుడు అతన్ని కట్టి పడేసి ఉంచడం ఏం సబబు అని ప్రశ్నిస్తుంది. మొహం చాటేసిన శివనాధుడి గురించి ‘‘నన్ను ఏలుకొమ్మని నేను వారిని ప్రాధేయపడతానా? నేను అలా చేస్తానా?’’ అంటుంది కళ్ళల్లో మెరిసే ఆత్మవిశ్వాసంతో.


ఉన్నత బెంగాలీ సంపన్న సమాజంలో ఒకటిగా ఉన్నప్పుడూ, ఏ ఆధారం లేకుండా నిరాధారంగా నిలబడినప్పుడు కూడా ఆ కలిమిలేములు ఆమె హృదయానికి అంటకుండా ఉండిపోతాయి. మిషను కుట్టి దాని నుంచి వచ్చే డబ్బులతో జీవిక కొనసాగిస్తూనే కమల స్వయంసిద్ధగా నిలబడుతుంది. బెంగాలీ సమాజాన్ని, అప్పటి సమాజంలో ‘‘ఉన్నత విలువలు’’గా పరిగణించబడుతున్న వాటినన్నిటినీ ప్రశ్నించిన కమలని సమాజం బద్ధ శత్రువుగానే చూస్తుంది. ఆమెను మర్చిపోనూ లేదు. క్షమించనూ లేదు.


‘‘అమాయకంగా సుమతీశతకం నీతులన్నీ నిజమని నమ్మి ఆచరణలో పెడితే అందరూ తలో చెయ్యి వేసి మనల్ని వెనక్కు నెట్టేస్తారు. అంచేత ఎలాగో ఒకలాగ తీర్థంలో జనాన్ని మోచేతులతో నెట్టుకుంటూ ముందుకెళ్ళడమే’’ అనే తత్వాన్ని ఒంటబట్టించుకున్న ఇందిర (కాలాతీత వ్యక్తులు) పరిస్థితి మిగిలిన వారితో పోలిస్తే కొంచెం విభిన్నం. మిగిలినవారు భర్తల పనికిమాలినతనం, బాధ్యతా రాహిత్యం కారణంగా జీవితపు బరువు బాధ్యతలు స్వీకరిస్తే ఇందిర తండ్రి పనికిమాలినతనం, బాధ్యతారాహిత్యం కారణంగా ఇంటి బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. ప్రకాశాన్ని వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడదామ నుకున్న ఇందిర అతని పిరికితనం చూసి అసహ్యించుకుంటుంది. ప్రకాశాన్ని ‘‘నువ్వసలు పుట్టుకతోనే సగం మనిషివి. మొదటినుంచీ బీటలువేసిన వ్యక్తిత్వమే నీది’’ అంటూ తీసిపడేస్తుంది. ‘‘జీవితాంతం నిన్ను కాపాడుకుంటూ బతికున్నన్ని నాళ్ళు నీకు గార్డియన్‌గా నేనెక్కడ చచ్చేది? నేనే నాన్నకి గార్డియన్‌ కావలసి వచ్చింది. ఆ బరువుతోనే చస్తున్నాను, ఉన్న బరువు చాలు. తిని కూర్చుని ఇంకో బరువు నెత్తికెత్తుకోవడం దేనికి’’ అంటుంది. ఆ విషయంలో మిగిలిన వాళ్ళకు లేని స్పష్టత కూడా ఇందిరకు ఉంది. ‘‘ఈ ప్రపంచంలో ఒకరికోసం ఒకరు ఏదీ చెయ్యరు. ఎవళ్ళకోసం వాళ్ళే చేసుకుంటారు. కొందరికది చేతనవుతుంది. కొందరికి అదీ రాదు. అంతే తేడా’’ అనే ఇందిర ముమ్మూర్తులా ఒక స్వయంసిద్ధ.


నామిని ‘మునికన్నడి ేసద్యం’ లోని ఇలామంతునాయుడు ‘పాలపొదుగు’లోని రామచంద్రనాయుడు ఇద్దరూ మంచివాళ్ళు అమాయకులు. యెంగటమ్మ, కర్రెక్క తెలివిగా ఇంటిని దిద్దుకోవడం తెలిసిన వాళ్ళు. ఇలామంతునాయుడు, రామచంద్ర నాయుడు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇద్దరూ ఇచ్చిన హోమ్‌వర్క్‌ బుద్ధిగా చేసే బడిపిల్లల్లాంటి వాళ్ళు. వాళ్ళకు హోమ్‌వర్క్‌ ఇచ్చే పని యెంగటమ్మ, కర్రెక్కలది.


అమాయకపు భర్త కారణంగా ఇంటిబాధ్యత తనమీద వేసుకోవలసి వస్తుంది యెంగటమ్మకు. ఇంటిపని, పొలంపని రెండిటినీ రెండు చేతులతో చేస్తూ తన తెలివితేటలతో సమర్థతతో ఇంటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది యెంగటమ్మ. చెప్పింది చేయడం తప్ప ఇంటి బాధ్యతలు ఏ మాత్రం పట్టించుకోని భర్త గురించి ‘‘ఈ మొగోడి చేత బొట్టు కట్టించుకు న్నప్పటి నుంచీ ఈ వాటంతోనే గదరా ఈ దరిద్రుడితో యాగతా ఉండేది’’ అని కొడుకుదగ్గర నిష్టూరం పోతుంది యెంగటమ్మ.


ఇల్లు నిలబెట్టడానికి యెంగటమ్మ పడే తాపత్రయం చూసి మునికన్నడు ‘‘నీ అట్టా కష్టించేసే ఆడామె పెండ్లాంగా దొరికితే నాకు దిగుల్లేదమా’’ అంటాడు. దానికి యెంగటమ్మ ‘‘నేనెటుమంటి ఆడదాన్ని. కాపరం మింద సేద్యం మింద నాకుండే అక్కర ఎవురికొస్తింది? నా అట్టా ఆడది ఏ కాలానికి పుడితిం దిరా యింక? నాయంత కష్టజీవి...’’ అంటుంది గొంతునిండా నిండిన ఆత్మ విశ్వాసంతో.


‘పాలపొదుగు’ లోని కర్రెక్క కూడా అచ్చంగా యెంగటమ్మలాంటిదే. అనుకోని అతిథిగా ఇంటికి వచ్చిన గేదెను ఆధారంగా చేసుకుని ఇంటిని నిలబెట్టే బాధ్యతను భుజాలపైకి ఎత్తుకుంటుంది కర్రెక్క. బాధ్యతలు పట్టని అమాయకు డైన భర్తని ‘‘నా గుక్కెడూపిరి బోతే ఎట్ట బతకబోతావో గదా’ అంటూ ఆట పట్టిస్తుంది.


గేదె రాత్రిపూట ఈనుతుంటే తనే తెల్లవార్లూ మేల్కొని అవస్థలు పడుతుంది. ‘‘అమా. రాత్రి నువ్వు పడుకొనేసరికి యాళ ఎంతయిందమా’’ అని అడిగిన కూతురితో ‘‘నీకు నీ అమ్మ వుండాది. నీ నాయనకు పెళ్ళాం వుండాది. పడుకుంటారు. పోవాలసినంత నిద్దరపోతారు. నాకెవురు వుండారు కూతరా? నేను పడుకుంటే నాకు జరుగునా?’’ అంటూ చెప్పీచెప్పకనే తను మోస్తున్న బరువుని చెబుతుంది కర్రెక్క.  


నంజమ్మ, శ్యామ, నాగవేణి, కమల, ఇందిర, యెంగటమ్మ, కర్రెక్క - భర్తల అప్రయోజకత్వమో, అమాయకత్వమో, బాధ్యతారాహిత్యమో... కారణం ఏదైనా ఆయా స్థలకాల పరిస్థితుల్లో, తమకున్న పరిమితుల్లో స్వయంసిద్ధలుగా పరిణామం చెందుతారు.

జి. లక్ష్మి

94907 35322


Updated Date - 2021-04-19T05:53:27+05:30 IST