సినిమా ఆపేస్తామంటూ బెదిరిస్తున్నారు

‘నయీం డైరీస్‌’ దర్శకుడు దామూ బాలాజీ

గ్యాంగ్‌ స్టర్‌ నయీం జీవిత కథని ‘నయీం డైరీస్‌’ పేరుతో సినిమాగా మలిచారు దామూ బాలాజీ. ఈనెల 10న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే.. ‘ఈ సినిమా ఎలా రిలీజ్‌ చేస్తావో చూస్తాం’ అంటూ కొంతమంది తనని బెదిరిస్తున్నారని దామూ ఆరోపిస్తున్నారు. ‘‘నయీం డైరీస్‌లో చాలా నిజాలు చెప్పా. నిజాయతీగా ఓ కథని చూపించా. బహుశా.. ఈ సినిమా బయటకు వస్తే కొంతమంది జాతకాలు బయట పడతాయని భయపడుతున్నారేమో..? అందుకే నాకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. సినిమా చూడకుండా వాళ్లంతా ఓ అభిప్రాయానికి రావడం కరెక్ట్‌ కాదు. సినిమా చూడండి. ఆ తరవాత ఎలాంటి చర్చకైనా నేను సిద్ధమే. ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా తమ అభిప్రాయాల్ని వెల్లడించవచ్చు. ఓ దర్శకుడిగా ఓ కథ చెప్పాను. అది నచ్చకపోతే.. అందులో తప్పులుంటే ఎవరైనా సరే.. వ్యతిరేకించొచ్చు. కానీ ఇలా బెదిరించడంలో మాత్రం అర్థం లేదు’’ అన్నారు. ఈ నయీం స్టోరీస్‌లో అంతగా భయపెట్టే అంశాలేమున్నాయి? అని అడిగితే... ‘‘నయీంపై 758 కేసులున్నాయి. 130 ఛార్జ్‌షీట్లు నమోదు అయ్యాయి. కేవలం ఏడెనిమిది చోటా రాజకీయ నాయకులు పేర్లు నయీం కేసులో కనిపిస్తాయి. బడా రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని తెలివిగా తప్పించారు. నయీంని అడ్డుపెట్టుకుని చాలామంది కోట్లకు పడగలెత్తారు. వాళ్లంతా నిజాలు బయటపడతాయని భయపడుతున్నారంతే. ఎవరెన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, అనుకున్న సమయానికి సినిమాని విడుదల చేసి తీరతా’’ అన్నారు. 


Advertisement