Advertisement
Advertisement
Abn logo
Advertisement

వారే యోగ్యులు

ఎంతటి జటిలమైన విషయాన్నయినా... ఎంతటి పామరుడికైనా అర్థం అయ్యేలా చెప్పగల నేర్పరి గౌతమ బుద్ధుడు. పండితులకు పండితుల స్థాయిలో, పామరులకు పామరుల స్థాయిలో చెప్పగల మహా ప్రబోధకుడు. విషయాన్ని పూర్తిగా అవగతం చేయడం కోసం నిత్యజీవితంలోని ఎన్నో సంఘటనలను ఆయన ఉపమానాలుగా చెప్పేవాడు. ఆ ఉపమానంతో వినగానే విషయం హృదయానికి చేరేది. మనసుపై ముద్ర వేసేది.


ఒక రోజు బుద్ధుడు జేతవన విహారంలో ఉన్నప్పుడు, జైన మతానికి చెందిన ఒక సాధువు వచ్చాడు. బుద్ధుడికి వినయంగా నమస్కరించి- ‘‘భగవాన్‌! నేను ఇంతకాలం అజ్ఞానంలో గడిపాను. నా గురువులు అజ్ఞానులు, స్వార్థపరులు’’ అంటూ తన గురువులను నిందించడం మొదలుపెట్టాడు. చివరకు వారిని ఏకవచనంతో సంబోధించాడు. ‘‘అందరిలో నేను మాత్రమే సుగుణశీలిని’’ అని గొప్పలు చెప్పుకొని... ‘‘భగవాన్‌! తమరు అనుమతిస్తే నేను మీ శిష్యుడిగా ఉండగలను’’ అని వేడుకున్నాడు.


‘‘ముందుగా నీవు నీ పూర్వ గురువులను గౌరవించడం నేర్చుకో. వారు చెప్పేది నీకు ఇప్పుడు నచ్చినా, నచ్చకపోయినా... ఒకప్పుడు వారు నీకు గురువులే! వారిపట్ల సంస్కారంతో జీవించు. ఆ తరువాత నా దగ్గరకు రా’’ అని చెప్పి పంపాడు.


అతను వెళ్ళిపోయాక అక్కడున్న భిక్షువులతో- ‘‘భిక్షువులారా! గురువు పట్ల ప్రతి వారికీ అణకువ చాలా అవసరం. గురువు పట్లే కాదు... మనతో ఉండే ప్రతివారి పట్లా ఆ అణకువ ఉండాలి. మన మాటతీరే మన ప్రవర్తనకు అద్దం. మన నిజ స్వరూపాన్ని చక్కగా చూపిస్తుంది. ఎదుటివారి దోషాలను అడగకపోయినా ఎవరు చెబుతారో వారు చెడ్డవారు. అలాగే ఎదుటివారి సుగుణాలను మనం అడిగినా చెప్పకుండా ఎవరు దాస్తారో వారూ అలాంటివారే! మనం అడగకపోయినా తమ గొప్పలు చెప్పుకొని, తప్పులు చెప్పరో వారూ చెడ్డబుద్ధి కలవారే! మనం అడగకపోయినా ఎదుటివారి సుగుణాలను చెప్పి, దోషాల గురించి చెప్పనివారు మంచివారు. తమ గొప్పలు తాను చెప్పుకోకుండా... తమ తప్పులను తాము గుర్తించి ఎవరు చెప్పగలరో వారే సజ్జనులు. అలాంటివారు నిరంతరం అణకువగా ఉంటారు. ఒక వ్యక్తి కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, కొత్త పదవి స్వీకరించినప్పుడు... మొదట్లో చాలా జాగ్రత్తగా ఉంటాడు. పెళ్ళయి అత్తవారింటికి కొత్తగా వచ్చిన అమ్మాయి... అత్తమామల పట్లా, భర్త విషయంలోనే కాదు... పనివారి పట్లా, ఇరుగుపొరుగుల పట్లా బిడియాన్ని ప్రదర్శిస్తుంది. అందరితో నెమ్మదిగా, మంచిగా నడచుకుంటుంది. ఆ తరువాత కొన్నాళ్ళకు... ‘‘అవతలకు వెళ్ళండి! మీకేం తెలుసు?’’ అంటుంది. అలాగే మీలో కూడా కొందరు మీ గురువుల పట్లా, మీ తోటివారి పట్లా, మీకన్నా చిన్నవారి పట్లా మొదట్లో నెమ్మదిగానే ఉంటారు. రానురానూ రాటుదేలిపోతారు. అదే మీ పతనానికి ప్రథమ సోపానం. ఎవరు నిరంతరం నవ వధువులా నైతిక బిడియాన్ని పాటిస్తారో, వారే యోగ్యులవుతారు. భిక్షువులారా! మరువకండి. మీరు నవవధువు మనసులాంటి మనసుతో ఉండాలి’’ అని చెప్పాడు. 


ఈ ప్రబోధం ఈనాటికీ అందరికీ పనికివచ్చేదే! ఒక విద్యార్థి, రాజకీయ నాయకుడు, ఒక ఉపాధ్యాయుడు, ఒక ఉద్యోగి... అందరూ ఈ మనసుతో ఉంటే -అందరి కర్తవ్య పాలన సక్రమంగా ఉంటుంది. అలక్షం, అరాచకం, అవినీతి మటుమాయమవుతాయి

బొర్రా గోవర్ధన్‌

Advertisement
Advertisement