బయటికి రావాలంటే భయపడాలి: బీజేపీకి ఎస్పీ నేత బెదిరింపులు

ABN , First Publish Date - 2022-01-27T21:16:39+05:30 IST

మీరు మళ్లీ ఏ చీకు చింతా లేకుండా ఉంటారు. ఉత్తరప్రదేశ్‌లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. వాళ్లను వదిలే ప్రసక్తే లేదు. వాళ్లు మన మీద అనేక నేరాలకు పాల్పడుతున్నారు. వీటన్నిటిపై ప్రతీకారం తీర్చుకుందాం. వాళ్ల తప్పులు ఏంటో వాళ్లు తెలుసుకోవాలి..

బయటికి రావాలంటే భయపడాలి: బీజేపీకి ఎస్పీ నేత బెదిరింపులు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లు ఇవ్వడంపై భారతీయ జనతా పార్టీ నేతలు ఇతర పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, బీజేపీ నేతల వ్యాఖ్యలను పరోక్షంగా ఉదహరిస్తూ సమాజ్‌వాదీ ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే వాళ్లు (బీజేపీ నేతలు) బయట అడుగు పెట్టాలంటే భయపడతారని ఎస్పీ నేత ఆదిల్ చౌదరి అన్నారు. బుధవారం యూపీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదంటూ ఆదిల్ చౌదరి పదే పదే ప్రస్తావించారు.


ముస్లింలు సహా కొద్ది మందితోనే నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆదిల్ చౌదరి మాట్లాడుతూ ‘‘మీరు మళ్లీ ఏ చీకు చింతా లేకుండా ఉంటారు. ఉత్తరప్రదేశ్‌లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. వాళ్లను వదిలే ప్రసక్తే లేదు. వాళ్లు మన మీద అనేక నేరాలకు పాల్పడుతున్నారు. వీటన్నిటిపై ప్రతీకారం తీర్చుకుందాం. వాళ్ల తప్పులు ఏంటో వాళ్లు తెలుసుకోవాలి. మళ్లీ మనల్ని ఏదైనా చేయాలంటే వాళ్లు 100 సార్లు ఆలోచించాలి. అంతే కాకుండా ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలన్నా ఆలోచించాలి. నా సోదరులారా.. మన వాళ్లకు వ్యతిరేకంగా మన పోరాటం ఇంకా మిగిలే ఉంది’’ అని అన్నారు.


కాగా, ఆదిల్ చౌదరి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ జాతీయ సోషల్ మీడియా చీఫ్ అమిత్ మాల్వియా సదరు వీడియోను షేర్ చేస్తూ ‘‘ఆదిల్ చౌదరి, దక్షిణ మీరట్ నుంచి ఎస్పీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి. హిందువులను బెదిరిస్తున్నారు. తమ ప్రభుత్వం వస్తే దాడులు చేస్తామని, ప్రతీకారం తీర్చుకుంటామని, వదిలిపెట్టమని అంటున్నారు. హిందూ వ్యతిరేకులైన ఆదిల్ చౌదరి, నహిద్ హసన్ లాంటి వారికే అఖిలేష్ టికెట్లు ఇస్తున్నారు’’ అని ట్వీట్ చేశారు.

Updated Date - 2022-01-27T21:16:39+05:30 IST