పార్లమెంటు సమావేశాలు కుదించి సమస్యలు దాటేశారు: కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-08-12T01:52:42+05:30 IST

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ టైమ్ కంటే ముందుగానే కేంద్రం నిరవధికంగా..

పార్లమెంటు సమావేశాలు కుదించి సమస్యలు దాటేశారు: కాంగ్రెస్

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ టైమ్ కంటే ముందుగానే కేంద్రం నిరవధికంగా వాయిదా వేయడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఓబీసీ బిల్లుకు రాజ్యసభలో బుధవారంనాడు ఆమోదం పడగానే సభ నిరవధికంగా వాయిదా పడింది. దీనికి ఒక రోజు ముందే లోకసభలో బిల్లు ఆమోదం పొందింది. దీంతో బుధవారం ఉదయం లోక్‌సభ సమావేశమైనప్పటికీ పలు వాయిదాల అనంతరం నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్ సమయం కంటే ఉభయసభలనూ ముందుగానే నిరవధికంగా వాయిదా వేయడాన్ని కాంగ్రెస్ నేత కె.సురేష్ తప్పుపట్టారు. విపక్షాలన్నీ గురువారంనాడు పార్లమెంటులో సమావేశం కానున్నట్టు చెప్పారు.


''విపక్షాలన్నీ రేపు (గురువారం) పార్లమెంటులో కలుస్తాం. అంతా విజయ్ చౌక్ వెళ్లి కేంద్రం వైఖరిని ప్రజల ముందుకు తీసుకు వెళ్తాం. దేశాన్ని కుదిపేస్తున్న ప్రధాన సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడాన్ని ప్రజలకు వివరిస్తాం. రాహుల్ గాంధీ కూడా ఇందులో పాల్గొంటారు. దేశానికి కీలకమైన అంశాలను కేంద్రం చర్చకు రానీయకుండా ముఖం చాటేసింది. అందుకోసమే సమావేశాలను కూడా కుదించింది. ఈ విషయం ప్రజలకు చెబుతాం'' అని సురేష్ అన్నారు.

Updated Date - 2021-08-12T01:52:42+05:30 IST