Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎల్‌హెచ్‌ఎంఎస్‌ ద్వారా చిక్కిన దొంగ

చోరీ ప్రయత్నంలో ఉండగానే పట్టేసిన పోలీసులు


తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 7: కొన్ని రోజులుగా తాళం వేసున్న ఓ ఇంటిపై కన్నేశాడో దొంగ. అర్ధరాత్రి తాళాలు పగులగొట్టి ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. సొత్తు కోసం వెతులకులాటలో పడ్డాడు. ఇంతలో గుట్టుచప్పుడు కాకుండా అక్కడికి వచ్చిన పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఎల్‌హెచ్‌ఎంఎస్‌ ద్వారా దొంగ చిక్కిన ఘటన తిరుపతిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఎం.ఆర్‌.పల్లె పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వైకుంఠపురానికి చెందిన చంద్రశేఖర్‌ కుటుంబం గతనెల 29వ తేదీన ఊరెళ్లారు. పోలీసులద్వారా లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) ఏర్పాటు చేసుకున్నారు. ఈనెల 15వ తేదీన వారు తిరిగి రానున్నారు. ఎల్‌హెచ్‌ఎంఎస్‌ ద్వారా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది 24 గంటలూ చంద్రశేఖర్‌ ఇంటిపై నిఘాపెట్టారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా తాళం వేసున్న చంద్రశేఖర్‌ ఇంటిపై ఓ దొంగ కన్ను పడింది. దీంతో సోమవారం అర్ధరాత్రి 12.13 గంటలకు ఆ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలకు దొంగ ప్రవేశించాడు. మోషన్‌ డిటెక్షన్‌ టెక్నాలజీతో పనిచేసే ఎల్‌హెచ్‌ఎంఎస్‌ కెమెరా అతను ఇంట్లో ప్రవేశించిన క్షణం నుంచే పనిచేయడం ప్రారంభించింది. తక్షణం పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో అలారం మోగింది. కెమెరా ద్వారా ఎప్పటికప్పుడు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచే దొంగ కదలికలను గమనిస్తున్న సెంటర్‌ సిబ్బంది ఆ ఇంటికి చుట్టుపక్కలనున్న స్పైడర్‌ బ్లూకోల్ట్స్‌ను, రక్షక్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. క్షణాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు.. దొంగ ఇంకా వెతుకులాటలో ఉండగానే పట్టేసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా చోరీ చేసే ప్రయత్నంలో ఉన్న తన ఎదుట ఏకంగా పోలీసులే నిలబడటంతో ఆ దొంగ బిక్కచచ్చిపోయాడు. పోలీసుల విచారణలో అతడు బిహార్‌కు చెందిన వ్యక్తిగా తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 


ఎల్‌హెచ్‌ఎంఎ్‌సను ఉపయోగించుకోండి

ఇంటికి తాళాలువేసి ఊరికి వెళ్తున్నవారందరూ ఎల్‌హెచ్‌ఎంఎస్‌ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఎస్పీ వెంకటఅప్పలనాయుడు మంగళవారం విజ్ఞప్తి చేశారు. మీరు ఊరెళ్లినా విలువైన ఆస్తికి ఎల్‌హెచ్‌ఎంఎస్‌ రక్షణ కల్పిస్తుందని వివరించారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోదలచినవారు దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌లోగాని, 80999 99977, 63099 13960, 100 నంబర్లకు కాల్‌ చేయాలని సూచించారు. 

Advertisement
Advertisement