ఉరేసుకుని దొంగ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-25T12:31:21+05:30 IST

ఓ దొంగ అనుమానస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉరేసుకుని దొంగ ఆత్మహత్య

హైదరాబాద్/బోయిన్‌పల్లి : ఓ దొంగ అనుమానస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. బోయిన్‌పల్లి సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... బాలంరాయికి చెందిన బంటు డినేష్‌(35) నిత్యం మద్యం సేవిస్తూ చిన్నపాటి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. కొంతకాలంగా దినేష్‌ భార్య సంతోషి, కుమార్తె తేజస్వినిలతో కలిసి ఓల్డ్‌ బోయిన్‌పల్లిలో అద్దెకు ఉంటున్నాడు. ఈ నెల 11వ తేదీన దినేష్‌ మద్యం మత్తులో భార్య కుమార్తెలను కొట్టాడు. దీంతో సంతోషి, తేజస్వినిని తీసుకొని బోయిగూడలోని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి దినేష్‌ ఒంటరిగానే ఉంటున్నాడు. గురువారం ఇంటి యజమాని గురునాథ్‌ అద్దె కోసం ఇంటికి వచ్చాడు. ఇంటికి తాళం ఉండగా లోపలి నుంచి దుర్వాసన వచ్చింది. కిటికీలో నుంచి చూడగా దినేష్‌ ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరించింది. ఇది ఆత్మహత్యా లేదా హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి...

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పీఎస్‌ పరిధిలో జరిగింది. హుందానగర్‌ - తిమ్మాపూర్‌ రైల్వే స్టేషన్ల మధ్య గురువారం మధ్యాహ్నం 30 ఏళ్ల వయసు గల గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి శరీరంపై నీలిరంగు జీన్‌ప్యాంటు, గీతల ఫుల్‌షర్ట్‌ ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ వి.లక్ష్మణచారి తెలిపారు. 


మహిళ అదృశ్యం

ఓ మహిళ అదృశ్యమైంది. నింబోలిఅడ్డాలో నివాసం ఉంటున్న ప్రదీప్‌ భార్య రేఖ(29) ఈ నెల 12న అత్తతో గొడవ పడింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా రేఖ ఆచూకీ లభించలేదు. భర్త ప్రదీప్‌ గురువారం కాచిగూడ పీఎ్‌సలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


మతిస్థిమితం లేని వ్యక్తి..

మతిస్థిమితం సరిగ్గా లేని ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. రత్నానగర్‌లో నివాసం ఉంటున్న వీరకుమార్‌ కుమారుడు ప్రవీణ్‌ (26) కూరగాయలు విక్రయించేవాడు. మతిస్థిమితం సరిగ్గా ఉండేది కాదు. ఈనెల 23న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వెతికినా ప్రవీణ్‌ ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి వీరకుమార్‌ గురువారం కాచిగూడ పీఎ్‌సలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-12-25T12:31:21+05:30 IST