దేవుడు చెప్పాడనే కారు దొంగిలించా.. ఘరానా దొంగ సమాధానం..!

ABN , First Publish Date - 2021-06-12T03:48:34+05:30 IST

ఓ అగ్నిమాపక కేంద్రం నుంచి కారును దొంగిలించిన ఘరానా దొంగ పోలీసుల విచారణలో ఊహించని సమాధానం చెప్పాడు

దేవుడు చెప్పాడనే కారు దొంగిలించా.. ఘరానా దొంగ సమాధానం..!

అలబామా: ఓ అగ్నిమాపక కేంద్రం నుంచి కారును దొంగిలించిన ఘరానా దొంగ పోలీసుల విచారణలో ఊహించని సమాధానం చెప్పాడు. దేవుని ఆజ్ఞ మేరకే తాను చోరీకి పాల్పడ్డానని.. తాను చేసింది దైవకార్యమని చెప్పడంతో అంతా బిత్తరబోయారు. అమెరికాలోని అలబామాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని జెఫ్రీ మక్కాంట్స్ జూనియర్‌గా గుర్తించారు. ప్రిచార్డ్ అగ్నిమాపక శాఖ స్టేషన్‌లో 2009 క్రౌన్ విక్టోరియా పేరుతో ఉన్న కారును అతడు దొంగిలించాడు. చోరీ దృశ్యాలు సీసీ కెమేరాలకు చిక్కడంతో... దీని ఆధారంగా అతడిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.


అయితే తాను చేసింది దొంగతనం కాదనీ.. దైవకార్యం అంటూ జెఫ్రీ చెప్పుకొచ్చాడు. కెమేరాల ముందు నిలబడి వింత వింత ప్రకటనలు చేశాడు. ‘‘అలబామా మేయర్ మొబైల్ కోసం పరుగెడుతున్నాను బేబీ..’’అంటూ ఏదో చెప్పబోయాడు. అనంతరం ఓ మహిళా జర్నలిస్టు వైపు తిరిగి పరిహాసాలు మొదలు పెట్టాడు. చోరీలు ఎందుకు చేస్తున్నావంటూ ఆమె ప్రశ్నించడంతో... ‘‘మేడం.. మీలాంటి అమ్మాయి చెప్పినా నాకు ఇలా చేయాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు చెప్పాడు కాబట్టే ఇలా చేశాను. అంతే కాదు.. నేను ఏమి చేసినా దేవుడు నాకు అండగా ఉంటాడు. మంచైనా చెడైనా. పోలీసుల నుంచి పారిపోయేందుకు కూడా దేవుడు సాయం చేశాడు. కానీ ఈ సారి సాయం చేయలేదు..’’ అని చెప్పుకొచ్చాడు. ఇంతలో ఓ అధికారి అతడిని పోలీస్ ఎస్కార్ట్ వాహనం వైపు తీసుకెళ్తుండడంతో.. ‘‘నేను అన్నీ దొంగిలిస్తాను మ్యాన్. నీ హృదయాన్ని కూడా దోచుకుంటాను బేబీ..’’ అని పేర్కొన్నాడు. కాగా జైలు నుంచి విడుదలైన తర్వాత పోలీసు కారు దొంగిలించడమే తన లక్ష్యమంటూ అతడు చెప్పడం విశేషం!

Updated Date - 2021-06-12T03:48:34+05:30 IST