దొంగ దొంగ !

ABN , First Publish Date - 2020-12-23T07:43:20+05:30 IST

కాకినాడ సముద్రంలో డీజిల్‌ దొంగలు పడ్డారు. విదేశీనౌకలు, రిగ్గులను లక్ష్యంగా చేసుకుని లక్షల లీటర్ల ఆయిల్‌ను కొట్టేస్తున్నారు.

దొంగ దొంగ !

సముద్రంలో డీజిల్‌ దొంగలు!

బయట లీటరు డీజిల్‌ రూ. 80.21.. కాకినాడ సముద్రంలో రూ.65కే

ఎగబడుతున్న బోట్ల నిర్వాహకులు

మాఫియా గుప్పెట డీజిల్‌ దందా

లోడింగ్‌కు వచ్చే  విదేశీ నౌకల్లోని

‘రిజర్వు డీజిల్‌’పై ముఠాల కన్ను

దొంగతనంగా రూ.35కు కొనుగోలు

డబుల్‌ లాభానికి చేపల బోట్లకు..

6 ముఠాలు.. వారంలో 3 రోజుల పని

8.5 లక్షల లీటర్లు.. రూ.9 లక్షలు చేతికి

రిగ్గుల నుంచీ లక్షల లీటర్లు కొట్టేస్తున్నారు

కాకినాడ కీలక నేత, ఓ మంత్రి ఆశీస్సులు

పేరుకు చేపల వేట! చేసేది డీజిల్‌ మథనం! బయట కొనాలంటే లీటరు డీజిల్‌ రూ.80.21. చేపలబోట్లకు సర్కారు ఇచ్చే సబ్సిడీ రూ.తొమ్మిది కలుపుకొంటే బోట్లకు పోసే డీజిల్‌ లీటరుకు పెట్టాల్సింది రూ.71. అదే కాకినాడ సముద్రంలో రూ. 65కే కావాల్సినంత డీజిల్‌. దీంతో బోట్ల నిర్వాహకులు ఎగబడిపోతున్నారు. ఒక బోటు వేటకు వెళ్లి తిరిగి రావడానికి వేల లీటర్ల డీజిల్‌ అవసరం. ఈ లెక్కలు వేసుకొనే ఆయిల్‌ మాఫియా ముఠాలు కాకినాడ సముద్రంలో చెలరేగిపోతున్నాయి. అదెలాగో, ఈ ముఠాలు అంతంత ఇంధనం ఎలా సంపాదిస్తున్నాయో మీరే చదవండి..


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): కాకినాడ సముద్రంలో డీజిల్‌ దొంగలు పడ్డారు. విదేశీనౌకలు, రిగ్గులను లక్ష్యంగా చేసుకుని లక్షల లీటర్ల ఆయిల్‌ను కొట్టేస్తున్నారు. నడిరేత్రిలో, బయటకు చేపలవేటలా కనిపిస్తూ, గుట్టుచప్పుడు కాకుండా కోట్లాది రూపాయల దందాకు వల వేస్తున్నారు. ఆయిల్‌ మాఫియా వెనుక అధికారపార్టీ కీలక నేతల అండదండలు ఉండడంతో ముఠాలు రెచ్చిపోతున్నాయి. కొట్టేసిన డీజిల్‌ను ఒడ్డుకు తెచ్చే శ్రమలేకుండా తిరిగి అదే సముద్రంలో ఫిషింగ్‌ బోట్లకు విక్రయిస్తూ రెండుచేతులా సంపాదిస్తున్నాయి. రొయ్యల చెరువులు, పెట్రోల్‌ బంకులకు కూడా సరఫరా చేస్తూ యథేచ్ఛగా స్మగ్లింగ్‌ కొనసాగిస్తున్నాయి. ఇంతకీ ఈ ముఠాలు ఎక్కడి నుంచో వచ్చాయని అనుకుంటే పొరబడ్డట్టే. కాకినాడ, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కొందరు ఈ మాఫియాను దర్జాగా నడిస్తున్నారు.


కాకినాడలో రెండు ఓడరేవులున్నాయి. యాంకరేజ్‌ పోర్టు ప్రభుత్వానిదికాగా, డీప్‌వాటర్‌పోర్టు ప్రైవేటుది. ఈరెండింటికి 15 దేశాల నుంచి బియ్యం, సిమెంట్‌, యూరియా, గ్రానైట్‌ తదితర కార్గో కోసం విదేశీ నౌకలు వచ్చిపోతుంటాయి. ఇలా వచ్చే విదేశీ నౌకలు కాకినాడకు కొన్ని నాటికల్‌మైళ్ల దూరంలో బెర్త్‌ కోసం కొన్ని రోజులపాటు వేచి ఉంటాయి. యాంకరేజ్‌ పోర్టుకు వచ్చే నౌకలు బెర్త్‌తో పనిలేకుండా సముద్రంలోనే అన్‌లోడింగ్‌,లోడింగ్‌ చేసుకుంటాయి. విదేశాల నుంచి వచ్చే నౌకల్లో లక్షల లీటర్లలో డీజిల్‌ ఉంటుంది. రిజర్వ్‌ కూడా భారీగానే ఉంటుంది. సముద్ర ప్రయాణంలో గాలివాటం ఆధారంగా ఈ నౌకలు భారీగా డీజిల్‌ మిగుల్చుకుంటాయి. ఈ క్రమంలో విదేశీ నౌకలతో ఆయిల్‌ ముఠాలు బేరం కుదుర్చుకుని ఆ డీజిల్‌ కొట్టేస్తున్నాయి. వారానికి మూడుసార్లు కాకినాడ నుంచి ఆరు గంటల ప్రయాణం చేసి కొన్ని బోట్లు సదరు విదేశీ నౌకల వద్దకు వెళ్తున్నాయి.


సరిగ్గా అర్ధరాత్రి నుంచి తెల్లవారు మధ్యలో అవి చేరుకుంటాయి. నౌకలోని ఆరు అంగుళాల పరిమాణంలో ఉండే మోటార్ల ద్వారా బోటులోకి డీజిల్‌ పంపింగ్‌ చేస్తారు. ఇలా డీజిల్‌ ఇచ్చినందుకు ఆయిల్‌ ముఠా లీటర్‌కు రూ.35 చొప్పున డాలర్ల రూపంలో చెల్లిస్తాయి. కాకినాడలో తిలక్‌ వీధిలో పేరుమోసిన కొందరు వ్యాపారుల నుంచి డాలర్లు సదరు మాఫియా ముఠాలకు అందుతాయి. అంతేకాదు కాకినాడ నుంచి బయలుదేరేముందు బోట్లలో కొన్ని ముఠాలు అమ్మాయిలను వెంట తీసుకువెళ్తున్నారు. ఇలా ఎర వేసి డీజిల్‌ పని కానిచ్చుకుంటారు. అటు విదేశీ నౌకల్లో కొన్ని ఏ దేశం నుంచి ఏసమయానికి కాకినాడకు వస్తాయో ముఠాల వద్ద కచ్చిత సమాచారం ఉంటోంది. కొన్ని నౌకల సిబ్బంది అయితే తాము చేరుకున్న సమాచారాన్ని కాకినాడ వాకలపూడిలోని లైట్‌హౌస్‌ ముఠాలకు ముందే చేరవేస్తున్నాయి. దీంతో నౌకల్లోంచి వారానికి ఏడు లక్షల లీటర్ల వరకు డీజిల్‌ ముఠాల చేతికి చిక్కుతోంది. లైట్‌హౌస్‌ ,సూర్యాపేట,చినవాకలపూడి,భైరవపాలెం తదితర ప్రాంతాల్లో మొత్తం ఆరు ఆయిల్‌ ముఠాలు సముద్రంపై పట్టు సాధించాయి. ఒక్కో ముఠాలో బోటు యజమానితో పాటు పనిచేసే సిబ్బంది ఆరుగురు ఉంటారు. వారంతా ఒక్కో నౌక నుంచి గరిష్ఠంగా 30 వేల లీటర్ల వరకు డీజిల్‌ కొట్టేస్తున్నారు. వీటిని బోటులో ఐస్‌,చేపల నిల్వకు వాడే స్టోరేజీ ట్యాంకులో నిల్వ చేస్తారు. అదనంగా కావాలంటే డ్రమ్ముల్లో నిల్వ చేస్తారు. 


వారానికి లక్షన్నర లీటర్లు..

కేజీబేసిన్‌లో రిలయెన్స్‌, ఓఎన్జీసీతో సహా అనేక కంపెనీలు రిగ్గులతో గ్యాస్‌ నిక్షేపాల అన్వేషణ చేస్తుంటాయి. ఈ రిగ్గులకు అనుసంధానంగా సపోర్టింగ్‌ వెస్సల్స్‌ (చిన్నసైజు నౌకలు) పనిచేస్తుంటాయి. వీటి నుంచి రిగ్గు డ్రిల్లింగ్‌కు డీజిల్‌ సరఫరా అవుతుంది. ఈ రిగ్గులు, చిన్నసైజు నౌకల నుంచి ఆయిల్‌ ముఠాలు రకరకాల ఎరలతో డీజిల్‌ను కారుచౌకగా కొట్టేస్తున్నాయి. వీరి నుంచి లీటరు రూ.42 నుంచి రూ.50చొప్పున కొనుగోలు చేస్తున్నాయి. ఇలా రిగ్గుల నుంచి వారానికి లక్షన్నర లీటర్ల వరకు డీజిల్‌ ఆయిల్‌ మాఫియా చేతికి చిక్కుతోంది. వాస్తవానికి సముద్రంలో అక్రమ డీజిల్‌ వ్యాపారం చట్టరీత్యా నేరం. పన్నులు చెల్లించకుండా సాగే ఈ నల్ల వ్యాపారం వల్ల ఖజానా ఆదాయానికి భారీగా గండిపడుతోంది.


ఒకేచోట 70వేల లీటర్లు పట్టివేత..

ఆయిల్‌ ముఠాల మనుషులు కాకినాడ,చుట్టుపక్క ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లే బోట్ల నుంచి డీజిల్‌ బుకింగ్‌లు చేసుకుంటారు. సముద్రంలో సరుకు సిద్ధంకాగానే వీరికి సమాచారం ఇస్తారు. వెంటనే ఈ బోట్లు సముద్రంలోకి వెళ్లి ముఠాల నుంచి డీజిల్‌ను తీసుకుంటాయి. ఈ వ్యాపారం మొత్తం సముద్రంలో మూడో కంటికి తెలియకుండానే సాగిపోతోంది. బోటు నుంచి ఇంకో బోటుకు డీజిల్‌ను మోటార్ల సాయంతో తోడడానికి ప్రత్యేకంగా మోటార్లు,పైపులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అయితే డీజిల్‌ కొనుగోలు చేసే ఫిషింగ్‌బోట్లలో కొన్ని నేరుగా అటునుంచి అటే ఇతర రాషా్త్రలకు వేటకు వెళ్లిపోతుంటాయి. కొన్ని ఒడ్డుకు వస్తాయి. ఈ క్రమంలో అప్పుడప్పుడు పోలీసులకు చిక్కుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో మూడుసార్లు 70వేల లీటర్ల దొంగ డీజిల్‌తో రెండు బోట్లు పట్టుబడ్డాయి. మరో బోటు భైరవపాలెం సముద్రమొగ వద్ద 20వేల లీటర్ల డీజిల్‌తో దొరికిపోయిందంటే సముద్రంలో ఏ స్థాయిలో ఆయిల్‌ దందా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.


చెరువులకు అదే...బంకులకు పండగే..

తూర్పుగోదావరి జిల్లా రొయ్యల చెరువులకు పెట్టింది పేరు. వీటికి పెద్ద మొత్తంలో డీజిల్‌ అవసరం. కానీ బయట కొనాలంటే ఖర్చు ఎక్కువ. ఈనేపథ్యంలో కాకినాడ ఆయిల్‌ముఠాల నుంచి కొందరు పెద్ద రొయ్య చెరువుల రైతులు వందల లీటర్ల డీజిల్‌ కొనుగోలు చేస్తున్నారు. ఇవికాకుండా కొన్ని పెట్రోల్‌ బంకులకు సైతం ఈ డీజిల్‌ సరఫరా అవుతుంది. రాత్రివేళలో గుట్టుచప్పుడు కాకుండా ఫిల్లింగ్‌ జరిగిపోతుంది. కాకినాడ,చుట్టుపక్కల ఆయిల్‌ ముఠాలు గడచిన ఆరు నెలలుగా మాఫియాను మరింత విస్తరించాయి. గత ప్రభుత్వ హయాంలో స్తబ్ధుగా ఉన్నాయి. అయితే ప్రభుత్వం మారడంతో మళ్లీ రెచ్చిపోతున్నాయి. తెరవెనుక కాకినాడకు చెందిన అధికారపార్టీ కీలకనేత అనుచరులు ముగ్గురు ఈ ముఠాల నిర్వహణలో ఆరితేరిపోయారు. ఈ నియోజకవర్గానికి సమీపంలో మరో అమాత్యుడి అండదండలతో ఓ ఇద్దరు అనుచరులు ఈవ్యాపారంలో బాగా గడించారు. ఈ ఇద్దరి నేతల అనుచరులు తరచుగా వారివద్దకు వచ్చి పోతుంటారు. కొన్నినెలల కిందట ముఠా కీలక సభ్యుడు పట్టుబడగా  సదరు నేత ద్వారా బయటకు వచ్చే ప్రయత్నాలు చేశారు. అయితే తెరవెనుక ఈ మాఫియా గురించి తెలిసినా సదరు నేతలు నోరుమెదపలేని పరిస్థితి.


కొట్టేసినచోటే అమ్మేస్తారు...

ఆయిల్‌ ముఠాలు కొట్టేసిన డీజిల్‌ను తిరిగి ఒడ్డుకు తెచ్చి విక్రయించుకునే బాధ లేకుండా, సముద్రంలోనే తెలివిగా సరుకు విక్రయిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నాయి. కాకినాడ హార్బర్‌ నుంచి దాదాపు 500 బోట్ల వరకు కేరళ,గుజరాత్‌,పారాదీప్‌ తదితర ప్రాంతాల వరకు చేపలవేటకు వెళ్తుంటాయి. ఒక బోటు నెలంతా వేటాడడానికి 16 వేల లీటర్ల డీజిల్‌ అవసరం. సరాసరి వీటికి గంటకు 40 లీటర్ల డీజిల్‌ కాలుతుంది. కానీ ఇదంతా బయట కొనాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. ప్రభుత్వం ఇచ్చే డీజిల్‌ సబ్సిడీ లీటర్‌కు రూ.9వరకే ఉంటుంది. అది కూడా కొన్ని లీటర్లే. ఈ నేపథ్యంలో ముఠాలు ఎంచక్కా ఈ ఫిషింగ్‌బోట్లకు దొంగ డీజిల్‌ను విక్రయిస్తున్నాయి. నౌకల నుంచి రూ.35కు కొన్న లీటర్‌ డీజిల్‌ను రూ.65 చొప్పున విక్రయిస్తున్నాయి. అంటే ఒక దఫా నౌక నుంచి 30 వేల లీటర్లు కొట్టేసి బోట్లకు తిరిగి విక్రయిస్తే ఒక ముఠాకు రూ.9 లక్షల వరకు లాభం అన్నమాట. ఇలా ఆరు ఆయిల్‌ ముఠాలు కలిపి నెలకు కోట్లలో టర్నోవర్‌ జరుపుతూ కోట్లు సంపాదిస్తున్నాయి. సముద్రంలో వాతావరణం బాగుంటే ఈ వ్యాపారం నెలకు 15 లక్షల లీటర్ల వరకు రెట్టింపు అవుతుంది. అంతేకాదు నౌకల నుంచి నాణ్యమైన డీజిల్‌ కొట్టేసే మాఫియా ఆ డీజిల్‌ను కల్తీ చేసి ఫిషింగ్‌బోట్లకు విక్రయిస్తాయి. అంటే లాభం మరింత రెట్టింపు!

Updated Date - 2020-12-23T07:43:20+05:30 IST