హైవే దొంగలు!

ABN , First Publish Date - 2021-08-28T06:18:02+05:30 IST

జాతీయ రహదారిపై దొంగల ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి.

హైవే దొంగలు!

వరుస దోపిడీలు

రన్నింగ్‌లోనూ లారీలు, కంటైనర్ల హైజాక్‌

లారీతో వెంటాడి.. చిక్కినదంతా మాయం

భారీగా సొత్తు, వస్తువుల అపహరణ

వాహనాలనూ తస్కరిస్తున్న వైనం 

పోలీసులపైన తిరగబడుతున్న ఘటనలు 

పూర్తిస్థాయిలో కనిపించని గస్తీ

రెచ్చిపోతున్న డీజిల్‌ చోరులు

వారంక్రితం గుడ్లూరు మండలం తెట్టు వద్ద  ఆగిఉన్న కంటైనర్‌ నుంచి విలువైన మందుల బాక్స్‌లు పోయాయి. కంటైనర్‌ వెనుక భాగంలో అవి ఉన్నాయి. లోపల లక్షల  విలువ చేసే కంప్యూటర్‌, ఏసీ లాంటి ఎలక్ర్టానిక్‌ గూడ్స్‌ ఉండడాన్ని దొంగలు గుర్తించ లేదు. 

ఇటీవల నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద ఆగిఉన్న లారీ నుంచి లక్షల విలువ చేసే ఎలక్ర్టానిక్‌ కుక్కర్లను క్షణాల్లో మాయం చేశారు. అదేవిధంగా కావలి టోల్‌ప్లాజా వద్ద కూడా డైపర్ల లోడ్‌తో వెళుతున్న లారీ నుంచి సరుకును దొంగిలించారు.  

ఇప్పుడు మార్టూరు వద్ద ఇదేతరహా దొంగతనం. హైవేపై కంటైనర్‌ లాంటి మినీ లారీలో తిరుగుతూ అర్ధరాత్రుళ్లు రోడ్డు పక్కన ఆపి డ్రైవర్లు నిద్రిస్తున్న సమయంలో, హోటల్‌ వద్ద నిలిపి టీతాగేటప్పుడు తమిళనాడుకు చెందిన దుండగులు ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. గత రెండు నెలలుగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వరుసగా హైవేపై దొంగతనాలు జరిగాయి.

ఇదీ హైవేపై పరిస్థితి. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఆగి ఉన్న లారీల్లో విలువైన సామగ్రి, సొత్తు కొల్లగొడుతున్నారు. వరుస దోపిడీలకు పాల్పడుతూ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అవసరం అనుకుంటే అడ్డం వచ్చిన వారిని అంతమొందించేందుకు కూడా వెనుకాడటం లేదు.  పోలీసులపై తిరగబడి ఎస్సై స్థాయి అధికారిని సైతం గాయపరిచిన ఘటనలు వారి బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నిత్యం నిర్విరామంగా వాహనాలు  తిరిగే  హైవేపై దొంగల స్వైర విహారంతో లారీడ్రైవర్లతోపాటు, ద్విచక్ర వాహనదారులు వణికిపోతున్నారు. 

ఒంగోలు(క్రైం), ఆగస్టు 27: జాతీయ రహదారిపై దొంగల ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. అటు డీజిల్‌ చోరీ మొదలు విలువైన సామగ్రిని దోచేస్తున్నారు. అవసరమైతే ఏకంగా సరుకుతో సహా లారీలనే మాయం చేస్తున్నారు. ఇందుకు శుక్రవారం ఉలవపాడు మండలంలో దొరికిన లారీనే ఉదాహరణ. దొంగలు ఏకంగా లారీనే ఉపయోగించి హైవేపై తిరుగుతూ ఎంచుకున్న వాహనాన్ని దోచేస్తున్నారు.  ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దోపిడీ ముఠాలు రాత్రి సమయంలో ఆగి ఉన్న లారీల్లో విలువైన సరుకును అపహరించుకుపోతున్నారు. లారీడ్రైవర్లు కీనర్లపై దాడులకు పాల్పడుతున్నారు. జిల్లాలో మార్టూరు మండలం బొల్లాపల్లి నుంచి గుడ్లూరు మండలం చేవూరు వరకు సుమారు 180 కిలోమీటర్ల మేర ఎన్‌హెచ్‌-16 ఉంది. ఇది 11 పోలీసు స్టేషన్ల పరిధి ఉంది. అయినప్పటికీ పోలీసు గస్తీ తగ్గడంతో దొంగలు ఇష్టారాజ్యంగా దోపిడీలకు పాల్పడుతున్నారు. వాహనదారులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. 


బైక్‌లపై సంచరిస్తూ..

తాజాగా జరిగిన పరిణామాలను పరిశీలిస్తే మార్టురు నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు మధ్యప్రదేశ్‌కు చెందిన దోపిడీ ముఠా సంచరిస్తూ ఆగిఉన్న లారీలలో డీజిల్‌ దొంగిలిస్తోంది. ఎత్తుకెళ్లిన డీజిల్‌ను నెల్లూరులోని ఒక వ్యాపారికి విక్రయిస్తోంది. కొందరు బాధిత లారీ డ్రైవర్ల ఫిర్యాదు మేరకు నిఘా వేసిన పోలీసులు నాలుగురోజుల కిందట ఈ ముఠాను పట్టుకున్నారు. అదే క్రమంలో కొందరు దొంగలు మోటార్‌ సైకిళ్లపై సంచరిస్తూ ఒంటరిగా వెళ్లే వారిపై దాడిచేసి వారి వద్ద నగదు, బంగారు ఆభరణాలు అపహరించుకెళుతున్నారు. టంగుటూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇటీవల బైక్‌పై దొంగతనానికి పాల్పడిన దొంగ పోలీసుల కంటపడ్డాడు. వెంటనే అప్రమత్తమై వాహనంతో వెంటపడటంతో బైక్‌ను వదలివేసి పరారయ్యాడు. 


గస్తీ పటిష్టం చేయాలి

జిల్లాలో మొత్తం 11 పోలీసు స్టేష్టన్ల పరిధిలో ఉన్న జాతీయ రహదారిపై సంబంధిత పోలీసు అధికారుల పర్యవేక్షణ కొరవడడం కూడా దోపిడీ  దొంగలు రెచ్చిపోవడానికి కారణనే ఆరోపణలు ఉన్నాయి. నిరంతరం  పోలీసుల గస్తీ ఉంటే దొంగతనాలకు అవకాశం తక్కువే.  చెకింగ్‌లపై ఉన్న శ్రద్ధ గస్తీపై పెడితే దొంగల బెడద తప్పుతుందని కొందరు వాహనదారులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. జాతీయ రహదారిపై నాలుగు హైవే మొబైల్స్‌ గస్తీ తిరుగుతున్నాయి. అంతేకాదు హైవేపై 11 పోలీసు స్టేషన్ల పరిధి ఉంది. దీంతో జాతీయ రహదారిపై ప్రతి అరగంటకు ఒక పోలీసు వాహనం తిరగొచ్చు. హైవే పెట్రోలింగ్‌ వాహనాలు ఉన్నాయి.  అయినప్పటికీ దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. మొత్తంగా జాతీయ రహదారిపై గస్తీ ముమ్మరం చేసి తమను దోపిడీ దొంగల బారి నుంచి కాపాడాలని ప్రయాణికులు, లారీడ్రైవర్లు కోరుతున్నారు.


జాతీయ రహదారిపై జరిగిన దోపిడీల్లో కొన్ని.. 

రెండేళ్ల క్రితం మార్టూరు సమీపంలో బొల్లాపల్లి వద్ద లారీడ్రైవర్ల వద్ద దోపిడీలకు పాల్పడే ముఠా సభ్యుడు గస్తీలో ఉన్న ఎస్సైపై తిరగబడి గాయపరిచాడు. 

మద్దిపాడు మండల పరిధిలో ఉన్న జాతీయ రహ దారిపై గుర్తుతెలియని వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి డ్రైవర్లపై దాడులు చేసి నగదు దోచుకెళ్లారు. కొన్ని మాత్రమే కేసులు నమోదు కాగా మరికొందరు పోలీ సులకు సమాచారం ఇవ్వకుండా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.

 సింగరాయకొండ వద్ద ఏడాది క్రితం సిగరెట్ల లోడ్‌తో వస్తున్న కంటైనర్‌ను దొంగలు హైజాక్‌ చేశారు. దాన్ని పెరల్‌ డిస్టిలరీ సమీపంలో నిలిపి తమ లారీలోకి సరుకును ఎక్కించుకుని చెన్నై వైపు పారిపోయారు.

ఈనెల 12వ తేదీ రాత్రి గుడ్లూరు మండలం తెట్టు వద్ద ఆపి ఉన్న లారీలో సుమారు రూ.7.75 లక్షల విలువైన ప్యారాసెట్మాల్‌ ట్యాబ్లెట్లు ఉన్న పెట్టలను దొంగలు అపహరించుకు వెళ్లారు.

నెల క్రితం టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం ప్లైఓవర్‌ వద్ద ఆగి ఉన్న కంటైనర్‌లో సుమారు రూ.60 వేల విలువ చేసే ఫ్యాన్లను అపహరించుకు వెళ్లారు.

మార్టూరు నుంచి తడ వరకూ ఆపి ఉన్న లారీల్లో డీజిల్‌ను దొంగిలించడం ఏళ్ల తరబడి సాగుతోంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ కావడంతో ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘాపెట్టి మధ్యప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠాను పట్టుకున్నారు.

టంగుటూరు మండలపరిధిలో ద్విచక్ర వాహన దారులను లక్ష్యంగా చేసుకొని దొంగలు దోపిడీలకు పాల్పడుతున్నారు.


చిక్కినట్లే చిక్కి పరారీ!

దొంగలకు చెందిన కంటైనర్‌ లారీ స్వాధీనం

 హైవే దొంగల ముఠా చిక్కినట్లే చిక్కి పరారైంది. జాతీయరహదారిపై శుక్రవారం తెల్లవారుజామున అనుమానాస్పద  మినీ లారీని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా దొంగల ముఠా టోకరా ఇచ్చింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. గత కొన్నిరోజుల నుంచి హైవేపై వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. దీని దృష్టిలో పెట్టుకొని ఉలవపాడు, గుడ్లూరు, టంగుటూరు పోలీసులు రాత్రుళ్లు జాతీయరహదారిపై పెట్రోలింగ్‌ ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారు జామున సింగరాయకొండ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి సమీపంలో అనుమానాస్పద లారీ కనిపించడంతో ఆపేందుకు ప్రయత్నించారు. అది ఆగకుండా కావలి వైపు వేగంగా వెళ్లిపోయింది. పోలీసులు వెంబడించినా ఫలితం లేకుండాపోయింది. వెంటనే మిగతా పోలీసు స్టేషన్లను అలర్ట్‌ చేశారు. అయితే చివరికి ఉలవపాడు పంచాయతీ కొల్లూరుపాడు ఎస్సీకాలనీ వెనుక మామిడితోటల వద్ద వాహనాన్ని ఆపి దుండగులు పారిపోయారు. స్థానికుల సమాచారంతో ఆ వాహనాన్ని స్టేషన్‌కు తరలించి అందులో ఉన్న సామగ్రిని పరిశీలించారు. రెడీమేడ్‌ దుస్తులు, డైపర్‌లు ఉన్నాయి. ఈ వాహనం తమిళనాడు రిజిస్ర్టేషన్‌తో ఉంది. గత రాత్రి మార్టూరు వద్ద రెడీమేడ్‌ దుస్తుల లారీ నుంచి ఇవి దొంగిలించినట్లు తెలిసిందని పోలీసులు చెప్పారు. విషయం తెలిసిన వెంటనే ఉదయం 6 గంటలకల్లా కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసరావు, సీఐ శ్రీరాం, గుడ్లూరు ఎస్సై మల్లికార్జున హుటాహుటిన ఉలవపాడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. దర్యాప్తులో భాగంగా కందుకూరు సీఐతో ప్రత్యేక బృందాన్ని తమిళనాడుకు పంపినట్లు ప్రాథమిక సమాచారం.






Updated Date - 2021-08-28T06:18:02+05:30 IST