Advertisement
Advertisement
Abn logo
Advertisement

అగ్రరాజ్యంలో వెరైటీ చోరీలు.. Los Angeles దొంగల రూటే సపరేటు!

లాస్ ఏంజిలిస్: అగ్రరాజ్యం అమెరికాలో వెరైటీ చోరీలు చోటు చేసుకుంటున్నాయి. మనకు తెలిసి ఇంతవరకు ఇళ్లు, రైళ్లలో పసిడి, నగదు దోపిడీ గురించి విని ఉంటాం. కానీ లాస్ ఏంజిలిస్‌లోని ఈ దొంగల రూటే సపరేటు. ఏకంగా రైళ్లపై దాడులు చేసి వాటిలోని కస్టమర్ల పార్శిళ్లతో ఉడాయిస్తున్నారు దుండగులు. అమెజాన్, యూపీఎస్, ఫెడెక్స్‌, టార్గెట్ వంటి ఈ-కామర్స్‌ సంస్థల నుంచి వినియోగదారులు ఆర్డర్ చేసిన సరకులను రైళ్లు సరఫరా చేస్తుంటాయి. వాటినే ఇలా దొంగిలిస్తున్నారు. ఖాళీ ప్యాకేజీలను పట్టాలపై అలాగే వదిలి వెళ్తున్నారు. దీంతో లాస్ ఏంజిలిస్​ సిటీ సెంటర్‌కు సమీపంలో ఉన్న పట్టాలపై ఎక్కడ చూసినా ఖాళీ పార్శిళ్లే కనిపిస్తున్నాయి. అలాగే మళ్లీ విక్రయించేందుకు వీలు పడని, తక్కువ విలువగల వస్తువులను కూడా పట్టాలపై వదిలేసి వెళ్తున్నారట దొంగలు. 

ఇక లాస్ ఏంజిలిస్​ కౌంటీలో 2020 డిసెంబర్ నుంచి ఈ తరహా దోపిడీలు 160శాతం మేర పెరిగాయని అధికారులు చెబుతున్నారు. అంతేగాక 2020 అక్టోబర్ మాసంతో పోల్చుకుంటే 2021 అక్టోబర్ నెలలో 356శాతం పెరిగాయని తెలిపారు. క్రిస్మస్ సమయంలో సాధారణంగానే భారీ సంఖ్యలో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు జరుగుతాయి. దాంతో ఈ సమయంలోనే అధిక దోపిడీలు జరిగాయి. కాగా, 2021 చివరి త్రైమాసికం నుంచి లాస్ ఏంజిలిస్​లో నిత్యం 90 కంటైనర్లు దోపిడీకి గురవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అప్రమత్తమైన రైల్వే పోలీసులు ఈ దోపిడీల కట్టడికి డ్రోన్‌లు, డిటెక్షన్ సిస్టమ్‌లు వంటి నిఘా చర్యలను బలోపేతం చేశారు. దీంతో 2021 చివరి మూడు నెలల్లో వంద మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కానీ, న్యాయస్థానంలో నామమాత్రపు శిక్షలు విధిస్తుండటం నేరస్థులకు వరంగా మారింది. ఈ దొంగతనాలను చిన్న నేరంగా పరిగణించి కోర్టులు తక్కువ జరిమానాలు విధిస్తున్నాయి. దాంతో జరిమానా చెల్లించి బయటకు వస్తున్న నేరస్థులు 24 గంటలు తిరక్కముందే మళ్లీ దోపిడీలకు తెగబడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఇక 2021లో సుమారు రూ.37కోట్లు విలువ చేసే పార్శిల్ సరకు ఇలా దోపిడీకి గురైనట్లు అధికారులు తెలిపారు.


Advertisement
Advertisement