అక్టోబరులో పతాకస్థాయికి కరోనా థర్డ్‌వేవ్.. చిన్నారులకు ముప్పు!

ABN , First Publish Date - 2021-08-23T22:45:24+05:30 IST

దేశంలో కరోనా వైరస్ థర్డ్‌వేవ్ అక్టోబరులో పతాకస్థాయికి చేరుతుందని ప్రభుత్వ నియమిత ప్యానెల్ పేర్కొంది.

అక్టోబరులో పతాకస్థాయికి కరోనా థర్డ్‌వేవ్.. చిన్నారులకు ముప్పు!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ థర్డ్‌వేవ్ అక్టోబరులో పతాకస్థాయికి చేరుతుందని ప్రభుత్వ నియమిత ప్యానెల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ముప్పు ఎదుర్కొనే చిన్నారుల కోసం ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచాలని, ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సూచించింది. కరోనా తొలి, రెండో దశల్లో వైరస్ ప్రభావం పెద్దలపైనే ఎక్కువగా ఉంది. ఈ రెండు దశల్లోనూ చిన్నారులు తప్పించుకున్నారు. అయితే, మూడో దశ ముప్పు మాత్రం వారికేనని ఇప్పటికే పలు నివేదికలు, పరిశోధనలు వెల్లడించాయి.


నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్ఐడీఎం) కింద ఈ నిపుణుల కమిటీని కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికలో మూడో దశ కోసం చేపట్టాల్సిన చర్యలను వివరించింది. పెద్ద సంఖ్యలో కనుక వైరస్ సంక్రమణలు జరిగితే చిన్నపిల్లల వైద్యులు, సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్స్‌ల అవసరం ఏర్పడుతుందని తెలిపింది. 


థర్డ్ వేవ్‌లో చిన్నారులు కరోనా బారినపడతారని చెప్పే రుజువులు నేరుగా లేకున్నప్పటికీ, వారికి ఇంకా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో థర్డ్‌వేవ్‌లో వారికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. థర్డ్‌వేవ్‌లో పెద్దలకంటే పిల్లలే ఎక్కువ వైరస్ బారినపడే అవకాశం ఉందని చాలామంది ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని నిపుణల కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. అయితే, తాజా నివేదిక మాత్రం మరోలా ఉందని పేర్కొంది.

Updated Date - 2021-08-23T22:45:24+05:30 IST