రఘురామకు చిత్రహింసలపై..15 రోజుల్లోగా ‘థర్డ్‌ డిగ్రీ’ నివేదిక!

ABN , First Publish Date - 2021-06-19T08:48:27+05:30 IST

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై లోక్‌సభ సచివాలయం స్పందించింది

రఘురామకు చిత్రహింసలపై..15 రోజుల్లోగా ‘థర్డ్‌ డిగ్రీ’ నివేదిక!

కేంద్ర హోం కార్యదర్శికి లోక్‌సభ సచివాలయం లేఖ


న్యూఢిల్లీ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై లోక్‌సభ సచివాలయం స్పందించింది. పార్లమెంటు సభ్యుడి హక్కులను ఉ ల్లంఘించిన ఘటనపై 15 రోజుల్లోగా సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లాకు లేఖ రాసింది. తనపై రాజద్రోహం కేసు పెట్టి.. స్పీకర్‌కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేసి.. పోలీసు కస్టడీలోనే విచారణ పేరుతో తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి, భౌతికంగా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సభాహక్కుల ఉల్లంఘన చర్యలు చేపట్టాలని రఘురామరాజు ఇటీవల లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి  సభాహక్కుల నోటీసు సమర్పించారు. ఇందులో ఏపీ సీఎం, డీజీపీ, సీఐడీ ఏడీజీ, సీఐడీ అదనపు ఎస్పీ, గుంటూరు జిల్లా అర్బన్‌ ఎస్పీలను బాధ్యులుగా పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-19T08:48:27+05:30 IST