మూడో సంజీవని

ABN , First Publish Date - 2021-04-14T07:35:49+05:30 IST

రష్యాఅభివృద్ధి చేసిన కరోనా వాక్సిన్‌ స్పుత్నిక్‌ను మనదేశంలో అత్యవసర వినియోగానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ అనుమతించడం...

మూడో సంజీవని

రష్యాఅభివృద్ధి చేసిన కరోనా వాక్సిన్‌ స్పుత్నిక్‌ను మనదేశంలో అత్యవసర వినియోగానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ అనుమతించడం, మహమ్మారి మరోమారు అతివేగంగా విజృంభిస్తున్న స్థితిలో ఊరటనిచ్చే పరిణామం. ఇప్పటికే అత్యవసర వినియోగంలో ఉన్న కోవిషీల్డ్‌, కోవాక్సిన్‌లకు తోడుగా ఈ మూడో టీకా కరోనా నియంత్రణ దిశగా మనం వేగంగా అడుగులు వేయడానికి ఉపకరిస్తుంది. స్పుత్నిక్‌ను ఇప్పటికే దాదాపు అరవైదేశాలు వినియోగిస్తున్నాయి. 


దేశంలో వాక్సిన్‌ కొరతేమీ లేదనీ, కోటిన్నరకు మించిన డోసులు రాష్ట్రాలూ కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర నిల్వలుగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి అంటున్నారు. సమస్య వాక్సిన్‌లది కాదనీ, రాష్ట్రాలు సరిగ్గా ప్రణాళికలు వేసుకోకపోవడమేనని ఆయన అన్నారు. దీనికి తోడుగా ఏప్రిల్‌ మాసాంతానికి కనీసం రెండుకోట్ల డోసులు అదనంగా వచ్చిచేరతాయనీ, అందువల్ల వాక్సిన్‌ కొరత ఆరోపణల్లో నిజం లేదంటారాయన. కేంద్రప్రభుత్వం అవసరమైనమేర టీకా సరఫరా చేయడం లేదంటూ అరడజనుకు పైగా రాష్ట్రాలు విమర్శించడం, వాక్సినేషన్‌ కేంద్రాల సంఖ్యను పరిమితం చేసుకోవడం, ఒడిశా ఏకంగా వందల సంఖ్యలో వాటిని మూసివేయడం తెలిసిందే. ఒకపక్క కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్న స్థితిలో మరోపక్క కేంద్ర రాష్ట్రాల మధ్య వాక్సిన్‌ యుద్ధం సాగుతోంది. కేంద్రం వాదిస్తున్నట్టుగా వాక్సినేషన్‌ ప్రక్రియలో రాష్ట్రాలు కుంటుతూండవచ్చునేమో కానీ, కొరత ఎంతమాత్రం లేదన్న వాదన సరికాదు. కరోనా మలిదశ విజృంభణతో ప్రజల్లో అప్పటివరకూ వాక్సిన్‌ విషయంలో ఉన్న సందేహాలు, భయాలు పక్కకుపోయి, పెద్ద సంఖ్యలో టీకా వేయించుకోవడం ఆరంభమైంది. దీనితో రెండోడోసుకు చాలా చోట్ల టీకా దొరక్కపోవడం కూడా మొదలైంది. 


స్పుత్నిక్‌ వాక్సిన్‌ ప్రపంచంలోనే తొలి కరోనా టీకా. గత ఏడాది ఆగస్టులో రష్యన్‌ ప్రభుత్వం దీనిని రిజిస్టర్‌ చేసినప్పుడు, లక్షలాదిమంది మీద మూడోదశ పరీక్షలు జరపలేదన్న కారణాన్ని చూపి, వాక్సిన్‌ రేసులో వెనుకబడిన మిగతా అగ్రరాజ్యాలు దానిని అనుమానించాయి. ఆ విమర్శలకు జవాబుగా స్వయంగా వైద్యురాలైన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కుమార్తె తనమీద టీకా ప్రయోగించుకొని మరీ చూపించారు. ఈ తరహా వాక్సిన్ల తయారీలో గమలేయా ఇనిస్టిట్యూట్‌కు వందేళ్ళకు మించిన అనుభవం ఉన్నది. స్పుత్నిక్‌ ప్రభావశీలత 90శాతానికి మించే ఉన్నదనీ, భద్రత విషయంలోనూ చక్కనిదని ఆ తరువాత వెల్లడైంది కూడా. డిసెంబరులోనే భారీ స్థాయి ఉత్పత్తి ఆరంభమై, దాదాపు అరవైదేశాల్లో అత్యవసర వినియోగం కొనసాగుతూండగా, భారత్‌ ఇంతకాలానికి సరేననడం, నిజానికి బాగా ఆలస్యం చేసినట్టే లెక్క. అయినప్పటికీ, భారీ ఉత్పత్తితో కోట్లాది టీకాలు అందుబాటులోకి రావడం కష్టకాలంలో ఉపకరిస్తుంది. ఇకపై విదేశాల్లో అనుమతిపొందిన వాక్సిన్లను మనదేశంలో కేవలం వందమందిమీద ఏడురోజులపాటు పరీక్షించి చూసి అత్యవసర వినియోగానికి తలూపేయాలన్న నిర్ణయం వాక్సిన్‌ కొరతను మరింత తీరుస్తుంది. గతంలో వెనక్కుపోయిన ఫైజర్‌ సహా అనేక కంపెనీలు వరుసకడితే మహమ్మారిపై పోరు మరింత ఉధృతంగా సాగించవచ్చు. అదర్‌ పూనావాలాకు చెందిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆశించిన స్థాయిలో టీకా సరఫరా చేయలేకపోవడం, మరోపక్క వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో ప్రభుత్వం సత్వర నిర్ణయాలతో పరుగులు తీస్తున్నది. మహమ్మారి తీవ్రత ప్రస్తుతానికి కొన్ని రాష్ట్రాల్లోనే హెచ్చుగా ఉన్నప్పటికీ, అది దేశవ్యాప్త విపత్తుగా పరిణామం చెందడం ఎంతో దూరంలో లేదు. రోగవ్యాప్తి పెద్దగా లేదని వాదిస్తున్న రాష్ట్రాల్లోనే పడకల కొరత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ఈ మలిదశ రోగ ఉధృతి ఊహకు అందనిదేమీ కాదు. వైరస్‌ మీద విజయం సాధించామంటూ పాలకులు ఇటీవల మీసాలు మెలేసినప్పుడల్లా నిపుణులు హెచ్చరికలు చేస్తూనే వచ్చారు. కానీ, వైరస్‌ కాస్తంత వెనక్కుతగ్గగానే అన్ని రంగాలనూ తెరిచేసి, చివరకు ఎన్నికల సభలూ, మత సమావేశాలూ కానిచ్చిన ఫలితం ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు.

Updated Date - 2021-04-14T07:35:49+05:30 IST