అచ్చిరాని సిడ్నీలో.. చరిత్ర సృష్టించాలని..

ABN , First Publish Date - 2021-01-07T10:29:13+05:30 IST

గత పర్యటనలో భారత్‌ టెస్ట్‌ సిరీస్‌ గెలిచి ఉండొచ్చు.. కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా విభిన్నం.. నాడు పూర్తిస్థాయి బ్యాటింగ్‌, బౌలింగ్‌ బలగంతో టీమిండియా తలపడింది..

అచ్చిరాని సిడ్నీలో..  చరిత్ర సృష్టించాలని..

ఆత్మవిశ్వాసంతో భారత్‌

సైనీ అరంగేట్రం

ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌ నేటి నుంచే

ఉదయం 5 నుంచి సోనీసిక్స్‌లో

రోహిత్‌పైనే కళ్లన్నీ 


గత పర్యటనలో భారత్‌ టెస్ట్‌ సిరీస్‌ గెలిచి ఉండొచ్చు.. కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా విభిన్నం.. నాడు పూర్తిస్థాయి బ్యాటింగ్‌, బౌలింగ్‌ బలగంతో టీమిండియా తలపడింది.. కానీ ఈసారి సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ లేడు.. ఇక, తొలి టెస్ట్‌లో 36 పరుగులకు ఆలౌటై ఘోర ఓటమి..అద్భుత ఫామ్‌లో ఉన్న షమి రెండో టెస్ట్‌కు ముందు గాయంతో అవుట్‌.. కెప్టెన్‌ కోహ్లీ పితృత్వ సెలవుతో స్వదేశం వెళ్లిపోయాడు.. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా రెండో టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది.. ఈ జోష్‌లో ఉన్న టీమిండియాకు హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ చేరికతో అదనపు బలం సమకూరింది.. దాంతో మరింత  ఉత్సాహంతో ఆస్ట్రేలియాతో గురువారం ఆరంభమయ్యే మూడో టెస్ట్‌కు సిద్ధమైంది..అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో తిరుగులేకున్నా, సిడ్నీ గ్రౌండ్‌లో మన పేలవ రికార్డే ఆందోళన కలిగిస్తోంది..అయినా మెల్‌బోర్న్‌  టెస్ట్‌ విజయోత్సాహంతో సిడ్నీలోనూ జయకేతనం ఎగురవేస్తే అది భారత క్రికెట్‌ చరిత్రలో సువర్ణాఽధ్యాయమే అవుతుంది.


సిడ్నీ: మొదటి టెస్ట్‌ ఓటమి నుంచి అనూహ్యంగా కోలుకొని మెల్‌బోర్న్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాకు షాకిచ్చిన భారత్‌ మూడో టెస్ట్‌కు సై అంటోంది. 1-1తో సిరీ్‌సను సమం చేసిన జోష్‌లో సిడ్నీలోనూ ‘కంగారు’పెట్టేసి ఆధిక్యం ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది. అయితే గత  పర్యటనల్లో సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎస్‌సీజీ)లో భారత బ్యాట్స్‌మెన్‌ సత్తా చాటినా..టెస్ట్‌ విజయం మాత్రం అందని ద్రాక్షగానే మిగులుతోంది. ఈ మైదానంలో భారత్‌ టెస్ట్‌ గెలుపు రుచి చూసి 42 ఏళ్లు కావడం గమనార్హం.  


బ్యాటింగ్‌ మరింత పటిష్టం: రోహిత్‌ శర్మ చేరికతో భారత్‌ బ్యాటింగ్‌ మరింత పటిష్టమైంది. మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో జట్టులోకొచ్చిన రోహిత్‌..గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభించనున్నాడు. ఓపెనర్‌గా  ఐదు టెస్ట్‌లే ఆడిన రోహిత్‌..అందులో 92.66 సగటు ఉండడం విశేషం. అయితే ఏడాదిగా టెస్ట్‌లకు దూరంగా ఉన్న రోహిత్‌.. కమిన్స్‌, స్టార్క్‌, హాజెల్‌వుడ్‌ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటాడన్నది కీలకం. గిల్‌..మెల్‌బోర్న్‌లో తత్తరపాటు లేకుండా ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొని ప్రశంసలందుకున్నాడు. రోహిత్‌, గిల్‌ ఆసీస్‌ పేస్‌ త్రయాన్ని సమర్థంగా అడ్డుకొని పరుగులు సాధించగలిగితే తదుపరి బ్యాట్స్‌మెన్‌ పని సులువవుతుంది. ముఖ్యంగా రెండు టెస్ట్‌ల్లో పెద్దగా రాణించని పుజారపై ఒత్తిడి తగ్గి అతడు స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయగలుగుతాడు. కాగా, గత పర్యటనలో ఎస్‌సీజీలో శతకం చేయడం పుజారలో ఆత్మవిశ్వాసం పెంచేదే.  మెల్‌బోర్న్‌లో సెంచరీతో ఔరా అనిపించిన రహానె ఆ జోరు కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు.


గత మ్యాచ్‌ల వైఫల్యాలను పక్కనబెట్టి తెలుగు క్రికెటర్‌ విహారి తన పాత్రకు న్యాయం చేయాల్సి ఉంటుంది. ఈ గ్రౌండ్‌లో కిందటి టూర్‌లో శతకం బాదిన రిషభ్‌ పంత్‌పైనా భారీ అంచనాలున్నాయి. రెండో టెస్ట్‌లో హాఫ్‌ సెంచరీతో మెరిసిన జడేజా కూడా అదే స్థాయిలో బ్యాటింగ్‌ చేస్తే భారత్‌ భారీ స్కోరు చేయడం ఖాయం. మరోవైపు సిడ్నీ పిచ్‌ గతంలోలా కాకుండా..స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుండడం మనకు సానుకూలాంశం. గత టూర్‌లో ఇక్కడ స్పిన్నర్‌ కుల్దీప్‌ ఐదు వికెట్లు పడగొట్టగా..నిరుడు న్యూజిలాండ్‌పై లియాన్‌ పది వికెట్లు తీయడం విశేషం. 


12 సిడ్నీ మైదానంలో ఇప్పటిదాకా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టులు. ఇందులో భారత్‌ ఒకేఒక టెస్టు నెగ్గగా.. ఐదుసార్లు ఆసీస్‌ గెలిచింది. మిగతా ఆరు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 




184 విదేశాల్లో వేయి పరుగులు పూర్తి చేసేందుకు రోహిత్‌కు కావాల్సిన పరుగులు


పిచ్‌/వాతావరణం

మూడో టెస్ట్‌ను వరుణుడు అడ్డుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో దట్టంగా మేఘాలు అలముకొని వర్షం కురిసే చాన్స్‌ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరీముఖ్యంగా తొలిరోజు ఉరుములతో కూడిన వర్షానికి అవకాశముంది. ఇక..పిచ్‌పై తగినంత పచ్చిక ఉన్నా..బ్యాట్స్‌మెన్‌, బౌలర్లకు సమంగా అనుకూలించనుంది. ప్రధానంగా స్పిన్నర్లకు ఎక్కువగా తోడ్పడనుంది. 


జట్లు

భారత్‌ (తుది 11మంది): రహానె (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, గిల్‌, పుజార, విహారి, పంత్‌, జడేజా, అశ్విన్‌, బుమ్రా, సిరాజ్‌, సైనీ.

ఆస్ట్రేలియా (అంచనా): పెయిన్‌ (కెప్టెన్‌), వార్నర్‌, లబుషేన్‌, స్మిత్‌, పుకోవ్‌స్కీ/వేడ్‌, గ్రీన్‌, హెడ్‌, స్టార్క్‌, కమిన్స్‌, హాజెల్‌వుడ్‌, లియాన్‌.


1978

సిడ్నీలో భారత్‌ ఏకైక టెస్ట్‌ విజయం సాధించిన సంవత్సరం. బిషన్‌ సింగ్‌ బేడీ కెప్టెన్సీలో భారత్‌ ఆ గెలుపు 

అందుకుంది.

20 ఎస్‌సీజీలో భారత బౌలర్‌ తీసిన అత్యధిక వికెట్లు. కుంబ్లే ఈ ఘనత సాధించాడు.


785 సిడ్నీ గ్రౌండ్‌లో భారత్‌ తరఫున సచిన్‌ చేసిన అత్యధిక పరుగులివి.


సైనీ రాకతో పెరిగిన పదును..

సీనియర్‌ పేసర్లు గాయాలతో జట్టుకు దూరమైనా..వారి స్థానాల్లో వచ్చిన బౌలర్లు అదరగొడుతున్నారు. షమి స్థానంలో వచ్చిన హైదరాబాద్‌ పేసర్‌ సిరాజ్‌ గత టెస్ట్‌లో స్వింగ్‌, సీమ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్‌ స్థానంలో ఈసారి జట్టులోకొచ్చిన నవదీప్‌ సైనీ కూడా అలాగే రాణిస్తాడేమో చూడాలి. బుమ్రా ఆధ్వర్యంలో బౌలింగ్‌ విభాగం మళ్లీ సత్తా చాటితే ఆసీ్‌సకు కష్టాలు ఖాయం. సిరీ్‌సలో ఇప్పటికే 10 వికెట్లు తీసిన స్పిన్నర్‌ అశ్విన్‌ ఊరిస్తున్న సిడ్నీ స్పిన్‌ పిచ్‌పై మరింత చెలరేగే చాన్సుంది.

Updated Date - 2021-01-07T10:29:13+05:30 IST