చేజారుతోందా..?

ABN , First Publish Date - 2021-01-10T10:13:46+05:30 IST

ఓవర్‌నైట్‌ స్కోరు 96/2.. మరోవైపు ఫ్లాట్‌ పిచ్‌.. క్రీజులో ఉన్నది టెస్టు స్పెషలిస్టులు రహానె, పుజార. ఇన్ని అనుకూలతల మధ్య మూడో రోజున భారత్‌ ఆత్మవిశ్వాసంతో ఆడుతుందనే అంతా ఆశించారు. కానీ కమిన్స్‌ షార్ట్‌ పిచ్‌

చేజారుతోందా..?

  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 244
  • చెలరేగిన కమిన్స్‌
  • ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 103/2
  • ప్రస్తుత ఆధిక్యం 197


ఓవర్‌నైట్‌ స్కోరు 96/2.. మరోవైపు ఫ్లాట్‌ పిచ్‌.. క్రీజులో ఉన్నది టెస్టు స్పెషలిస్టులు రహానె, పుజార. ఇన్ని అనుకూలతల మధ్య మూడో రోజున భారత్‌ ఆత్మవిశ్వాసంతో ఆడుతుందనే అంతా ఆశించారు. కానీ కమిన్స్‌ షార్ట్‌ పిచ్‌ బంతులకు వీరి దగ్గర సమాధానమే లేకుండా పోయింది. పుజార తన కెరీర్‌లోనే అత్యంత నెమ్మదిగా ఆడడం.. అటు ముగ్గురు ఆటగాళ్లు రనౌట్లు కావడం భారత్‌ను దెబ్బతీసింది. దీంతో 148 పరుగులకే చివరి ఎనిమిది  వికెట్లు కోల్పోయింది. ఇక లబుషేన్‌, స్మిత్‌ అండతో ఆసీస్‌ ఇప్పటికే 197 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌ ఈ మ్యాచ్‌పై ఆశలు పెట్టుకోవాలంటే అద్భుతం జరగాల్సిందే!


సిడ్నీ: రసవత్తరంగా సాగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఆతిథ్య జట్టు పేస్‌ త్రయం అద్భుత బౌలింగ్‌ ముందు భారత బ్యాట్స్‌మెన్‌ నిలవలేకపోయారు. టాప్‌-7 ఆటగాళ్లలో ఆరుగురు రెండంకెల స్కోరు సాధించినా భారీ ఇన్నింగ్స్‌ ఆడడంలో మాత్రం విఫలమయ్యారు. ముఖ్యంగా ప్యాట్‌ కమిన్స్‌ (4/29) జోరుకు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 100.4 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. పుజార (176 బంతుల్లో 5 ఫోర్లతో 50) ఆచితూచి ఆడగా పంత్‌ (36), జడేజా (28 నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. హాజెల్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత 94 పరుగుల ఆధిక్యంతో ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. లబుషేన్‌ (47 బ్యాటింగ్‌), స్మిత్‌ (29 బ్యాటింగ్‌) ధాటిని కొనసాగిస్తుండగా శనివారం మూడోరోజు ఆట ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆతిథ్య జట్టు 197 పరుగుల భారీ ఆధిక్యంలో ఉండగా చేతిలో 8 వికెట్లున్నాయి. ఈ పిచ్‌పై 250 పరుగుల ఛేదనే కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


నిదానంగా...: మూడో రోజు ఉదయం సెషన్‌లో రహానె (22), పుజార ఆచితూచి ఆడడంతో భారత్‌ స్కోరు నత్తనడకన సాగింది. బాక్సింగ్‌ డే టెస్టులో జోరు చూపించిన రహానె ఈసారి నెమ్మదిగా ఆడడం ఆశ్చర్యపరిచింది. ఈ రీతిన 10 ఓవర్లలో 21 పరుగులు జత చేశాక కమిన్స్‌ బౌలింగ్‌లో రహానె అవుటయ్యాడు. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని అతడి వికెట్లను పడగొట్టింది. అటు హనుమ విహారి (4) నిర్లక్ష్యపు పరుగుతో మూల్యం చెల్లించుకున్నాడు. మిడ్‌ ఆఫ్‌ వైపు షాట్‌ ఆడి లేని రన్‌ కోసం పరిగెత్తాడు. అయితే డైవ్‌ చేస్తూ బంతిని అందుకున్న హాజెల్‌వుడ్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా త్రో విసరడంతో విహారి రనౌటయ్యాడు. పుజార, విహారి డిఫెన్సివ్‌ ఆటతో 13 ఓవర్లలో జట్టుకు 25 పరుగులే వచ్చాయి. కానీ రిషభ్‌ పంత్‌ రాకతో స్కోరులో వేగం పెరిగింది. మరో వికెట్‌ పడకుండా వీరు లంచ్‌ బ్రేక్‌కు వెళ్లారు.


వికెట్లు టపటపా: ఈ సెషన్‌లో భారత్‌ చివరి ఆరు వికెట్లను కోల్పోయి ఇన్నింగ్స్‌ను ముగించింది. రెండో కొత్త బంతితో ఆసీస్‌ బౌలర్లు రాణించారు. మరోవైపు పుజార ఆటతీరుతో ఇతర బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో పంత్‌ గేరు మార్చుతూ రన్స్‌ రాబట్టాడు. అయితే 85వ ఓవర్‌లో కమిన్స్‌ వేసిన బంతి అతడి ఎడమ మోచేతికి తాకడంతో ఇబ్బందిపడ్డాడు. దీంతో 88వ ఓవర్‌లో స్లిప్‌లో వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. అదే ఓవర్‌లో పుజార 174 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. పంత్‌ దూకుడుతో ఐదో వికెట్‌కు 53 రన్స్‌ రావడం విశేషం. మరుసటి ఓవర్‌లోనే పుజారను కమిన్స్‌ అవుట్‌ చేయడంతో భారత్‌ వికెట్ల పతనం కొనసాగింది. ఆ తర్వాత అశ్విన్‌ (10), సైనీ (3), బుమ్రా (0) పెవిలియన్‌ చేరడంతో 21 పరుగుల వ్యవధిలోనే జట్టు 5 వికెట్లు కోల్పోయింది. జడేజా మాత్రం తుదికంటా నిలిచి బ్యాట్‌ ఝుళిపించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆసీస్‌ ఆధిక్యం కాస్త తగ్గింది.


రెండు వికెట్లు కోల్పోయినా..: 94 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ పది ఓవర్లలోనే ఓపెనర్లు వార్నర్‌ (13), పకోస్కీ (10) వికెట్లను కోల్పోయింది. కానీ, ఈ అవకాశాన్ని భారత బౌలర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. కీలక ఆటగాళ్లు లబుషేన్‌, స్మిత్‌ ఈ పిచ్‌పై ఎలా బ్యాటింగ్‌ చేయాలో సూచిస్తూ ఆసీ్‌సను భారీ ఆధిక్యం వైపు తీసుకెళుతున్నారు. మూడో వికెట్‌కు అజేయంగా 68 పరుగులు జోడించగా.. 29 ఓవర్లలోనే జట్టు స్కోరు వంద దాటింది. ఇక నాలుగో రోజు ఆటలో ఆసీస్‌ అనూహ్యంగా కుప్పకూలి.. భారత్‌ బ్యాటింగ్‌ మెరుగుపడితే తప్ప ఈ మ్యాచ్‌పై ఆశలు పెట్టుకోలేని పరిస్థితి నెలకొంది. 


 1 తన టెస్టు కెరీర్‌లో అత్యంత నెమ్మది (174 బంతుల్లో)గా అర్ధసెంచరీ చేయడం పుజారకు ఇదే తొలిసారి.


స్కోరుబోర్డు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 338; 


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి అండ్‌ బి) హాజెల్‌వుడ్‌ 26; గిల్‌ (సి) గ్రీన్‌ (బి) కమిన్స్‌ 50; పుజార (సి) పెయిన్‌ (బి) కమిన్స్‌ 50; రహానె (బి) కమిన్స్‌ 22; విహారి (రనౌట్‌) 4; పంత్‌ (సి) వార్నర్‌ (బి) హాజెల్‌వుడ్‌ 36; జడేజా (నాటౌట్‌) 28; అశ్విన్‌ (రనౌట్‌) 10; సైనీ (సి) వేడ్‌ (బి) స్టార్క్‌ 3; బుమ్రా (రనౌట్‌) 0; సిరాజ్‌ (సి) పెయిన్‌ (బి) కమిన్స్‌ 6; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 100.4 ఓవర్లలో 244. వికెట్ల పతనం: 1-70, 2-85, 3-117, 4-142, 5-195, 6-195, 7-206, 8-210, 9-216, 10-244. బౌలింగ్‌: స్టార్క్‌ 19-7-61-1; హాజెల్‌వుడ్‌ 21-10-43-2; కమిన్స్‌ 21.4-10-29-4; లియాన్‌ 31-8-87-0; లబుషేన్‌ 3-0-11-0, గ్రీన్‌ 5-2-11-0.


ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: వార్నర్‌ (ఎల్బీ) అశ్విన్‌ 13; పకోస్కీ (సి సబ్‌) సాహా (బి) సిరాజ్‌ 10; లబుషేన్‌ (బ్యాటింగ్‌) 47; స్మిత్‌ (బ్యాటింగ్‌) 29; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 29 ఓవర్లలో 103/2. వికెట్ల పతనం: 1-16, 2-35. బౌలింగ్‌: బుమ్రా 8-1-26-0; సిరాజ్‌ 8-2-20-1; సైనీ 7-1-28-0;అశ్విన్‌ 6-0-28-1.


అంపైర్‌పై పెయిన్‌ బూతు పురాణం

పుజార క్యాచ్‌ విషయంలో ఫీల్డ్‌ అంపైర్‌ విల్సన్‌తో ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పెయిన్‌ వాదనకు దిగాడు. అయితే దీనికి విల్సన్‌ కూడా గట్టిగానే బదులిచ్చాడు. 56వ ఓవర్‌లో లియాన్‌ వేసిన బంతిని పుజార పుష్‌ చేసే ప్రయత్నం చేయగా అది షార్ట్‌ లెగ్‌లో వేడ్‌ చేతుల్లోకి వెళ్లింది. అయితే ఆసీస్‌ క్యాచ్‌ అప్పీల్‌ను అంపైర్‌ తిరస్కరించాడు. పెయిన్‌ రివ్యూ కోరగా అందులోనూ స్పష్టత లేకపోవడంతో నిర్ణయం ఫీల్డ్‌ అంపైర్‌కే వదిలేశారు. దీంతో అసహనానికి లోనైన పెయిన్‌ అది అవుట్‌ అంటూ వాదనకు దిగాడు. ‘నిర్ణయం తీసుకుంది నేను కాదు.. థర్డ్‌ అంపైర్‌’ అంటూ విల్సన్‌ బదులిచ్చాడు. అయితే సంతృప్తి చెందని పెయిన్‌ బూతు మాటలతో ఎదురుదాడికి దిగుతూ.. బంతి బ్యాట్‌కు తాకిందని వాదించాడు.


పంత్‌ బ్యాటింగ్‌ చేస్తాడు!

వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ కూడా బ్యాటింగ్‌ సమయంలో గాయపడ్డాడు. అతడి స్థానంలో సాహా కీపింగ్‌ బాధ్యతలు చేపట్టాడు. అయితే అతడి మోచేతికి ఎలాంటి ఫ్రాక్చర్‌ కాలేదని బోర్డు ప్రకటించింది. ప్రస్తుతం నొప్పితో బాధపడుతున్నా భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌ బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది.



సిరీ్‌స నుంచి జడేజా అవుట్‌

టెస్టు సిరీ్‌సపై కన్నేసిన భారత్‌కు గట్టి ఝలక్‌ తగిలింది. గాయం కారణంగా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మిగిలిన సిరీస్‌కు దూరమయ్యాడు. మూడో రోజు ఆటలో స్టార్క్‌ వేసిన బంతి అతడి ఎడమచేతి బొటనవేలికి బలంగా తాకింది. అప్పటికి చికిత్స చేసుకుని బ్యాటింగ్‌ కొనసాగించినా ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో మయాంక్‌ ఫీల్డింగ్‌ చేశాడు. స్కానింగ్‌లో జడేజా వేలు ఫ్రాక్చర్‌ అయినట్టు తేలడంతో రెండు నుంచి మూడు వారాలపాటు విశ్రాంతి అవసరమని బీసీసీఐ అధికారి తెలిపాడు. దీంతో తాజా టెస్టులో నలుగురు బౌలర్లతోనే నెట్టుకురావాల్సి ఉంది. 

Updated Date - 2021-01-10T10:13:46+05:30 IST