థర్డ్‌ వేవ్‌ తథ్యం

ABN , First Publish Date - 2021-05-06T07:42:48+05:30 IST

కరోనా రెండో ప్రభంజనంతోనే అల్లాడుతున్న ప్రజలకు దుర్వార్త. కరోనా మూడో వేవ్‌ ముప్పు కూడా తప్పదని.. దాన్ని ఎదుర్కోవడానికి మనమంతా సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ...

థర్డ్‌ వేవ్‌ తథ్యం

  • వైరస్‌ కొత్త స్ట్రెయిన్లపై పోరాడడానికి
  • తగ్గట్టుగా టీకాలను నవీకరించాలి
  • మరిన్ని వేవ్‌లకు సిద్ధంగా ఉండాలి
  • ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు

న్యూఢిల్లీ, మే 5 (ఆంధ్రజ్యోతి): కరోనా రెండో ప్రభంజనంతోనే అల్లాడుతున్న ప్రజలకు దుర్వార్త. కరోనా మూడో వేవ్‌ ముప్పు కూడా తప్పదని.. దాన్ని ఎదుర్కోవడానికి మనమంతా సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు విజయరాఘవన్‌ హెచ్చరించారు. అయితే, మూడో వేవ్‌ ఎప్పుడు వస్తుందనే విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. వైరస్‌ రోజురోజుకూ రూపుమార్చుకుని కొత్త స్ట్రెయిన్ల రూపంలో అవతరిస్తున్నందున, మరిన్ని వేవ్‌లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. బుధవారం ఆయన కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. జాతీయవ్యాప్తంగా పరిగణనలోకి తీసుకుంటే మే 7కు సెకండ్‌ వేవ్‌ పతాకస్థాయికి చేరుకుంటుందని, ఈ వారాంతం నుంచి క్షీణించడం మొదలవుతుందని విజయరాఘవన్‌ తెలిపారు.


కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంకా పతాకస్థాయికి చేరలేదని చెప్పారు. ఏడు రోజుల సగటు ఆధారంగా ఈ అంచనా వేస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉన్న టీకాలకు కొత్త వేరియంట్లను కూడా ఎదుర్కోగల సామర్థ్యం ఉన్నప్పటికీ.. వైరస్‌ ఉత్పరివర్తనాలపై నిఘా కొనసాగించాలని, కొత్త మ్యుటేషన్లను సమర్థంగా ఎదుర్కొనేలా టీకాలను నవీకరించుకోవాలని విజయరాఘవన్‌ సూచించారు. ఈసారి కేసులు ఇంత భారీ సంఖ్యలో ఉండడానికి డబుల్‌ మ్యుటెంట్‌ రకం, బ్రిటన్‌ వేరియంట్లే కారణమని అభిప్రాయపడ్డారు. దాంతోపాటు.. మొదటి వేవ్‌ సమయంలో జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోవడం, చాలా మందిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడమూ కారణాలేనన్నారు. వైర్‌సను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్‌కి సంబంధించి, సన్నద్ధతకు సంబంధించి వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలందరూ మాస్కులను ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అందరూ టీకాలు వేయించుకోవడం, కొత్తగా వైరస్‌ బారిన పడినవారిని గుర్తించడం, కట్టడి ప్రాంతాల ఏర్పాటు.. వైర్‌సకు చెక్‌ పెట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. కాగా.. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్‌ సహా 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్‌ కేసులున్నాయని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు 15 శాతానికి పైగా ఉందన్నా రు. కాగా.. దేశంలో కేసులు, మరణాలకు సంబంధించి అధికారికంగా ఇస్తున్న గణాంకాలకన్నా వాస్తవ కేసులు, మరణాల సంఖ్య 5 నుంచి 10 రెట్లు ఎక్కువ ఉండొచ్చని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Updated Date - 2021-05-06T07:42:48+05:30 IST