‘‘ముప్ఫై ఏళ్ళ నాటి నిజాన్ని ప్రపంచానికి చాటేందుకు’’

ABN , First Publish Date - 2020-04-20T10:31:04+05:30 IST

1991 ఫిబ్రవరి 23-24 అర్ధరాత్రి కునన్‌ పోష్పోరా అనే గ్రామంలో వందమందికి పైగా కశ్మీరీ స్త్రీలపై అత్యాచారం జరిగింది. భద్రతాదళాల అఘాయిత్యంపై ఆ స్త్రీల న్యాయ పోరాటం ఫలించలేదు, ఎవరికీ శిక్ష పడలేదు. ...

‘‘ముప్ఫై ఏళ్ళ నాటి నిజాన్ని ప్రపంచానికి చాటేందుకు’’

1991 ఫిబ్రవరి 23-24 అర్ధరాత్రి కునన్‌ పోష్పోరా అనే గ్రామంలో వందమందికి పైగా కశ్మీరీ స్త్రీలపై అత్యాచారం జరిగింది. భద్రతాదళాల అఘాయిత్యంపై ఆ స్త్రీల న్యాయ పోరాటం ఫలించలేదు, ఎవరికీ శిక్ష పడలేదు. ఇరవై ఏళ్ళ తర్వాత, 2012లో నిర్భయ ఘటన సందర్భంగా భారత ప్రజల స్పందనను గమనించిన ఐదుగురు కశ్మీరీ యువతులు- ఆనాడు కుషన్‌ పోష్పోరా గ్రామంలోని స్త్రీలకు జరిగిన అన్యాయాన్ని అందరి ముందుకూ తేవాలనుకున్నారు. వారు సమాచార చట్టం ద్వారా సంపాదించిన వివరాలతోను, బాధితులు సాక్షుల ఇంటర్వ్యూలతోను, తమ సొంత అను భవాలను జోడిస్తూ, ‘డూ యు రిమెంబర్‌ కునన్‌ పోష్పోరా’ అనే పుస్తకం రాశారు. ఇప్పుడు ఈ పుస్తకాన్ని పర్‌స్పెక్టివ్స్‌ పబ్లిషర్స్‌ తెలుగులోకి తెచ్చారు. ల.లి.త అనువాదం చేశారు, రమాసుందరి సంపాదకత్వం వహించారు. ఈ సందర్భంగా రమాసుందరితో ‘పలకరింపు’ ఇది: 



ఈ పుస్తకంలో 90ల నాటి కశ్మీర్‌ కల్లోలిత వాతా వరణంలో పుట్టిపెరిగిన అయిదుగురు యువ రచయిత్రులు తమకు కశ్మీర్‌ సమస్య మీద వున్న అవగాహనను తెలియజేయటంలో ఎంతవరకూ సఫలులయ్యారు?

1991లో కశ్మీర్‌ సరిహద్దు జంటగ్రామాలైన కునన్‌ పోష్పోరాలలో దాదాపు 100మంది మహిళలను అత్యా చారం చేసింది సైన్యం. మిలటరైజేషన్‌ కింద ఉన్న ఆ భూభాగంలో బాధితులకు న్యాయం అందించటంలో అక్కడి అన్ని వ్యవస్థలు విఫలం అయ్యాయి. కల్లోలిత ప్రాంతా లలో, కాలాల్లో పుట్టి పెరిగిన పిల్లల భవిష్యత్తును తల్లి దండ్రులు కాకుండా, అక్కడి పరిస్థితులు నిర్దేశిస్తాయి. అలాగే ఈ రచయిత్రులు ఎస్సార్‌ బతూల్‌, ఇఫ్రా భట్‌, సమ్రీనా ముస్తాక్‌, మునాజా రషీద్‌, నతాషా రాథర్లు- సామాజిక జీవితాన్ని ఎన్నుకొన్నారు. వారందరూ ‘జమ్మూ కశ్మీర్‌ పౌర సమాజ కూటమి’ అనే శ్రీనగర్‌ కేంద్రంగా ఉన్న సంస్థలో పనిచేస్తున్నారు. అబద్ధాలను అల్లటానికి అట్టహాసం కావాలి కానీ, వాస్తవాన్ని వెలుగులో తీసుకొని రావటానికి వారికి ఉన్న నిజాయితీ, ఆవేదనా, చిత్తశుద్ధీ సరిపోతాయి. వాటితోనే వాళ్లు ఈ పుస్తకాన్ని అద్భుతంగా మలిచారు.  


కునన్‌ పోష్పోర ప్రాసంగికత ఇప్పుడు ఏమిటి? ‘జ్ఞాపకం మనది’ అని నొక్కి చెబుతున్న ఈ పుస్తకం ఉద్దేశ్యం ఏమిటి?

పగా, ప్రతీకారాలను తీర్చుకోవటానికి స్త్రీల శరీరాలు యుద్ధభూములుగా మారుతున్న సందర్భాలు, ప్రజలపై శత్రుపక్షంగా ప్రభుత్వమే వ్యవహరిస్తున్న సందర్భాలు కను మరుగు అవనంత కాలం ‘కునన్‌ పోష్పోర’కు ప్రాసంగి కత ఉంటుంది. సామాజిక దురన్యాయాలు జరిగినపుడు, సామూహిక జ్ఞాపకాలు విస్మృతికి గురి అయితే బాధితు లకు ఎన్నడూ న్యాయం జరగదు. అది జరగకూడదని దాదాపు 30 ఏళ్లనాటి శిథిలాలను వాళ్లు వెలికి తీశారు. నిజాన్ని ప్రపంచానికి చాటటమే ఈ పుస్తక ఉద్దేశ్యం.


ఉత్తమస్థాయిలో క్షుణ్ణంగా సాగిన ఈ నిజనిర్ధారణ పరిశోధనా శకలం కశ్మీరీ ప్రజల మీద సాధారణంగా ఇండియాలో ఉండే తేలిక అభిప్రాయాలను ఎంత వరకూ తగ్గించగలదు?

కశ్మీర్‌ భారతదేశంలో ఆంతర్భాగమని భావించే వాళ్లు కునాన్‌ పోష్పోరా, ఇంకా అక్కడ జరిగిన అనేక వ్యథలను తమవిగా భావిస్తారా అనే ప్రశ్న కీలకమైంది. ఈ పుస్తకంలో అధికారికంగా ఇచ్చిన సమాచారాన్ని అంగీకరిస్తే- సైన్యాని కిస్తున్న అపరిమితమైన అధికారాలు, కశ్మీర్‌ విముక్తి పోరా టాన్ని అణచటానికి ఆనాటి నుండే ఎలా ఉపయోగప డుతున్నాయో అనే విషయాన్నయినా అంగీకరించగలరు. అక్కడి స్త్రీల హక్కుల ఉల్లంఘన నుండి అయినా కశ్మీర్‌ పరిస్థితిని అర్థం చేసుకొంటారు. 


లైంగిక అత్యాచారం నేరమైన దేశంలో కశ్మీరీ మహిళల మీద అత్యాచారం ఎలా శిక్షార్హం కాకుండా పోతుంది?

అత్యాచార నిందితులకు ఉరిశిక్షలు అమలు చేయాలని కోరుతున్న దేశం ఇది. నిర్భయ నిందితులకు అదే జరి గింది. న్యాయాతీత శిక్షలను కూడా సాక్షాత్తూ ప్రభుత్వమే అమలు జరుపుతూ, వాటికి ప్రజల ఆమోదాన్ని మీడియా సహాయంతో ఒడిన కట్టుకొంటున్న సమయంలో, ‘రాజ్యమే రేపిస్టు అయితే...?’ అని ప్రశ్నిస్తుంది ఈ పుస్తకం. ఈ ప్రశ్న అత్యంత ప్రాముఖ్యం కలది.


పరిశోధనా పత్రం పరిభాషను దాటిన సాహిత్య విలువలు ఇందులో వున్నాయా?

ఈ పుస్తకంలో సాహిత్యం ఉంది. ఆ సాహి త్యం బాధితుల జీవితాల నుండి వచ్చింది. వారి పట్టుదలనుండి వచ్చింది. కాల్పనిక సాహిత్యా న్ని మించిన ప్రభావం ఈ పుస్తకం పడవేయ గలదు. నిజ జీవితాల వాస్తవ చిత్రీకరణ బల మైన సాహిత్యాన్ని సృష్టిస్తుంది. ఈ పుస్తకం పాఠకుల మనసులో చిరస్థాయిగా నిలుస్తుంది.

పర్‌స్పెక్టివ్స్‌ పబ్లిషర్స్‌ 83329 34548

పలకరింపు : రమాసుందరి 




Updated Date - 2020-04-20T10:31:04+05:30 IST