మువ్వన్నెల రెపరెపలు

ABN , First Publish Date - 2022-01-27T04:59:23+05:30 IST

మువ్వన్నెల రెపరెపలు

మువ్వన్నెల రెపరెపలు
వికారాబాద్‌ కలెక్టరేట్‌లో జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తున్న కలెక్టర్‌ నిఖిల


  • నిరాడంబరంగా గణతంత్ర వేడుకలు

వికారాబాద్‌/మేడ్చల్‌ జనవరి26: కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ 73వ గణతంత్ర వేడుకలు వికారాబాద్‌,   మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాల్లో బుధవారం నిరాడంబంరంగా జరిగాయి. వాడవాడలా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. వికారాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లలో  కలెక్టర్‌ నిఖిల, మేడ్చల్‌ కలెక్టరేట్‌లో  అదనపు కలెక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి జెండా ఆవిష్కరణ చేసి గౌరవవందనం స్వీకరించారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కింది స్థాయి ప్రజల వరకు అందేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని  వారు అన్నారు.  వికారాబాద్‌లో జరిగిన  వేడుకల్లో ఎస్పీకోటిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, అదనపు ఎస్పీ రషీద్‌, వికారాబాద్‌ ఆర్డీవో విజయకుమారి, ఎంపీపీ చంద్రకళ, తహసీల్దార్‌ షర్మిల, దళిత నాయకులు, కవి రాజలింగం జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్‌ కలెక్టరేట్‌లో జరిగిన వేడుకల్లో అదనపు కలెక్టర్‌ శ్యాంసన్‌, డీసీపీ రక్షిత మూర్తి, డీఆర్‌వో లింగ్యానాయక్‌, ఏవో వెంకటేశ్వర్లు, ఆర్డీవో రవితోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు,  కాగా వికారాబాద్‌ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ కోటిరెడ్డి జెండావిష్కరణ చేశారు. అనంతరం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశానిర్ధేశం చేశారన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రషీద్‌, డీఎస్పీ సత్యనారాయణ, ఏఆర్‌ డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐలు, ఎస్‌ఐలు, అధికారులు పాల్గొన్నారు. 



ఆకట్టుకున్న త్రివర్ణ దోశ

తాండూరు, జనవరి 26: గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఓ టిఫిన్‌ సెంటర్‌లోత్రివర్ణంలో తయారు చేసిన దోశ ఆకట్టుకుంది.  బుధవారం తాండూరు మండలం జినుగుర్తి గేటు వద్ద  శ్రీశైలానికి చెందిన ‘చిన్న’ అనే టిఫిన్‌సెంటర్‌లో  వంట మాస్టర్‌ బస్వరాజ్‌ దేశాభిమానాన్ని చాటుకున్నాడు. జాతీయ జెండా రంగుల్లో దోశ వేసి అందరిని ఆకట్టుకున్నాడు. అక్కడికి వచ్చిన వారు. త్రివర్ణంలో వేసిన దోశను తింటూ ఆస్వాదించారు. మాస్టర్‌ను అభినందించారు. 


పెన్సిల్‌ లిడ్‌పై జాతీయ జెండా

తాండూరుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్‌, వరల్డ్‌ రికార్డ్‌ హోల్డర్‌ మణిసాయి పెన్సిల్‌ లిడ్‌పై జాతీయ జెండాను ఆవిష్కృతం చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మణిసాయి తన ఆర్ట్‌తో పెన్సిల్‌ లిడ్‌పై జాతీయ జెండా, సెల్యూట్‌ చేస్తున్న సైనికుడి బొమ్మను అద్భుతంగా ఆవిష్కరించారు. దీంతో పట్టణ వాసులు మణిసాయిని అభినందించారు.


త్రివర్ణ అలంకరణలో శివుడు

 తాండూరు పట్టణంలోని భద్రేశ్వరాలయంలో శివుడు మువ్వన్నెల జెండా వస్త్రాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఆలయ పూజారి విజయ్‌కుమార్‌ శివుడిని  త్రివర్ణ వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. దైవభక్తితోపాటు దేశభక్తిని కూడా చాటారు. కాగా కులకచర ్లమండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ దేవాలయంలో రామలింగేశ్వరుడిని త్రివర్ణ పతాకం అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చాడు. ఆలయ చైర్మన్‌ రాములు స్వామివారికి పూజలు చేశారు. 

Updated Date - 2022-01-27T04:59:23+05:30 IST