అచ్చం మనుషుల్లాగే.. ఈ చీమను వాడుకుని వదిలేశాయి

ABN , First Publish Date - 2021-10-22T23:33:06+05:30 IST

మనిషికి, ప్రకృతికి మధ్య విడదీయరాని సంబంధం పెనవేసుకుపోయింది. మానవుడి

అచ్చం మనుషుల్లాగే.. ఈ చీమను వాడుకుని వదిలేశాయి

న్యూఢిల్లీ: మనిషికి, ప్రకృతికి మధ్య విడదీయరాని సంబంధం పెనవేసుకుపోయింది. మానవుడి పుట్టుక నుంచి అది ఎన్నో పాఠాలు నేర్పుతూనే ఉంది. మానవుని మేధవల్లో, ఇంకేదో శక్తి వల్లో ప్రకృతిలోని మిగతా జీవరాశుల కంటే మనిషి కాస్తంత పైన నిలవగలిగాడు. ఇక, అల్ప ప్రాణులైన చీమలు మనిషికి నేర్పే పాఠాలు అన్నీ ఇన్నీ కావు. విశ్రమించకుండా పనిచేయడం వాటి నైజం, బద్దకం అనే పదం వాటి డిక్షనరీలోనే లేదు. ఇక పొదుపు పాఠాలు మొత్తం నేర్చుకున్నది చీమ నుంచే. సాధారణంగా ఆరు నెలల సావాసం వీరు వారుగా మారిపోతారని పెద్దలు చెబుతుంటారు.


సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. బెన్ ఫిలిప్స్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేసేన ఈ వీడియోను పరికిస్తే.. మనిషి బుద్ధులను ఇతర జీవులు నేర్చుకుంటున్నాయోమేనన్న అనుమానం రాకపోదు. ఇప్పటికే నాలుగు మిలియన్ల మందికిపైగా ఈ వీడియోను చూసి ఆలోచనలో మునిగిపోయారు. 


16 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో మూడు చీమలు తమపైనున్న ఆకుపైకి వెళ్లాలని భావిస్తాయి. కానీ అది ఎత్తులో ఉండడంతో అందదు. దీంతో ఓ చీమ తను నిల్చోవడంతో దానిపైకెక్కి మిగతా రెండు చీమలు పైకి వెళ్తాయి. కిందనున్న చీమ చేసిన సాయానికి ఎవరికైనా శభాష్ అని చెప్పాలని అనిపిస్తుంది. అంత వరకు ఓకే.. కానీ పైకి వెళ్లిన చీమలు తమ అవసరం తీరిపోవడంతో ఎంచక్కా అక్కడి నుంచి వెళ్లిపోతాయి. కిందనుంచి సాయం కోసం ఎదురుచూస్తున్న ఆ చీమను పట్టించుకున్న పాపానపోవు. అప్పుడా చీమ పైకి వెళ్లే మార్గం లేక కాసేపు అలాగే పైకి చూస్తూ ఉంటుంది. 


ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చీమలు కూడా మనుషుల్లా మారిపోతున్నాయని ఒకరంటే, అవసరం తీరాక మనిషైనా, జంతువైనా, ఇతర జీవులైనా అంతేనని ఈ వీడియో నిరూపించిందని కామెంట్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఆ చీమకు భావాలంటూ ఉంటే ఎంతగా బాధపడేదో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భావాల సంగతిని పక్కనపెడితే ఈ 16 సెకన్ల వీడియో ఎన్నో పాఠాలను బోధిస్తుందనడం అతిశయోక్తి కాదేమో!


సమాజంలో మనిషి ఎదుగుదల ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. ఒకరు కష్టపడి పైకి ఎదిగితే, మరొకరు మరో మార్గంలో సులభంగా ఎదిగేస్తారు. కొందరి విషయంలో ఇంకొందరు సాయం అందిస్తారు. అలా సాయం అందించిన వారికి తిరిగి సాయం అందించాలా? లేదా? అనేది వారి వారి నైతికతపై ఆధారపడి ఉంటుంది. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలోనూ నైతికత పాఠం ఉంది.. గ్రహించగలిన వారికి గ్రహించగలిగినంత!

Updated Date - 2021-10-22T23:33:06+05:30 IST