ఇదీ 111 జీవో చరిత్ర

ABN , First Publish Date - 2022-04-13T08:13:34+05:30 IST

చారిత్రక జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరిరక్షణలో

ఇదీ 111 జీవో చరిత్ర

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌12(ఆంధ్రజ్యోతి) : చారిత్రక జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరిరక్షణలో భాగంగా పది కి.మీ విస్తీర్ణంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దన్న ఉద్దేశంతో 1996 మార్చి 8న ప్రభుత్వం జీవో 111 తీసుకొచ్చింది. పది కి.మీ పరిధిలో కాలుష్యకారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జీవో 192ను తీసుకొచ్చారు. దీనిపై అభ్యంతరాలు రావడంతో జంట జలాశయాల పరిరక్షణ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీం తీర్పుకు అనుగుణంగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లయ్‌ అండ్‌ సివరేజీ బోర్డు చేసిన సూచనల మేరకు జంట జలాశయాలను పరిరక్షించడానికి 111 జీవోను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.


ఈ ఉత్తర్వుల ప్రకారం వినియోగించే భూమిలో 90 శాతం కన్జర్వేషన్‌ కోసం కేటాయించాలి. పది శాతం మాత్రమే వినియోగించాలి. కన్జర్వేషన్‌ జోన్‌లో పూర్తిగా వ్యవసాయ భూములుగానే ఉండాలి. అయితే జీవోకు అనుగుణంగా 2013లో తీసుకొచ్చిన మాస్టర్‌ప్లాన్‌లోనూ, అంతకు ముందు హుడా తీసుకొచ్చిన మాస్టర్‌ప్లాన్‌లోనూ 111 జీవో పరిధిలోని 64 గ్రామాలను బయో కన్జర్వేషన్‌ జోన్‌లో పొందుపరిచారు. ఈ ప్రాంతాల్లో భవన నిర్మాణాలు, చెక్‌ డ్యామ్‌లు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు కూడా జరగకూడదు. లేఅవుట్లకు, భారీ భవన నిర్మాణాలకు అనుమతి లేదు. ఈ పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు రాకుండా చూడాల్సిన బాధ్యత హెచ్‌ఎండీఏ, స్థానిక సంస్థలది. అదేవిధంగా ఉస్మాన్‌సాగర్‌ నుంచి ఆసి్‌ఫనగర్‌ వరకు గల వరదనీటి కాలువ వెంట 100 ఫీట్ల వరకు ఎలాంటి భవన నిర్మాణాలు చేపట్టకూడదనే జీవోను తీసుకొచ్చారు.

Updated Date - 2022-04-13T08:13:34+05:30 IST