Abn logo
Oct 11 2021 @ 00:00AM

కలలో కూడా ఊహించని గుర్తింపు ఇది!

ఆమె స్కూల్‌లో చదివేటప్పుడు జిల్లా స్థాయి కబడ్డీ క్రీడాకారిణి.కాలేజీ రోజుల్లో మోడలింగ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత బుల్లితెర కార్యక్రమాల్లో యాంకరయ్యింది. ఏదేమైనా ప్రొ కబడ్డీ, ఐపీఎల్‌కి తెలుగు ప్రెజెంటర్‌ కావటం అనుకోని ముచ్చట అంటోంది. తెలుగులో మొట్టమొదటి మహిళా స్పోర్ట్స్‌ ప్రెజెంటర్‌ కావటం వల్ల మరింత బాధ్యత పెరిగిందంటోన్న మేడపాటి వింధ్య విశాఖతో ‘నవ్య’ ముచ్చటించింది. 


పీఎల్‌ అంటేనే ఒకటే హడావిడి..దేశీ, విదేశీ క్రికెటర్లు.. ఛీర్‌గాళ్స్‌, ఫ్రాంచైజీలు, సెలబ్రిటీల రాక.. అంతా ఓ పండుగ వాతావరణమే.అలాంటి ఐపీఎల్‌ క్రికెట్‌మ్యాచ్‌లను స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు చానెల్‌ తరఫున ప్రెజెంట్‌ చేస్తుంటా. ఇక్కడ క్రికెట్‌ అంటే ప్రేమ ఉండాలి. క్రికెటర్లు, వాళ్ల బలాలు, బలహీనతలు, ఆటతీరు, వారి టెక్నిక్స్‌.. ఇలా అన్నీ మనకు తెలిసి ఉండాలి. మ్యాచ్‌ గురించి స్టాటస్టిక్స్‌ ఇచ్చే టీమ్‌ ఉన్నా.. ఆ ఏముందిలే అనుకుంటే  ఒక్కడుగూ ముందుకు వేయలేం. ఎందుకంటే ఇక్కడ నాలెడ్జి ముఖ్యం. స్పాంటేనియ్‌సతో పాటు సమాచారమే అందించాలి. అందుకే సాధన తప్పనిసరి. 


నిత్య విద్యార్థిగా ఉండాలి...

ఇక్కడ పక్కవారితో ఇంటరాక్షన్‌ ముఖ్యం. ఒకే ఫ్లోర్‌లో తమిళం, హిందీ, ఇంగ్లీష్‌.. ఇలా చాలామంది ప్రెజెంటేటర్లు ఉంటారు. వారితో కలిసి పని చేయాలి. నచ్చిన క్రికెటర్‌ను దగ్గరగా చూసినప్పుడు, మాట్లాడినప్పుడు ‘కల నెరవేరినట్లు’ అనిపిస్తుంది. మాకోసం వర్క్‌షా్‌పలు ఏర్పాటు చేస్తారు. ప్రతిదీ అర్థం చేసుకోవాలి. హుషారుగా ఉండటంతో పాటు బ్రైనీ అయితేనే ఇక్కడ నిలబడతాం. సమయం దొరికినప్పుడు క్రికెటర్లతో మాట్లాడటం, పాత మ్యాచ్‌లను చూడటం వల్ల మరిన్ని ఇన్‌పుట్స్‌ దొరుకుతాయి. గణాంకాలు ఇచ్చినా.. వాటిని గుర్తు పెట్టుకోవాలి. నిత్య విద్యార్థిలా ప్రతి రోజూ అప్‌డేట్‌ అవుతూనే ఉండాలి. 


అలా యాంకరయ్యా..

తాతయ్య వాళ్లది తణుకు ప్రాంతం. అక్కడనుంచి వలస వచ్చి హైదరాబాద్‌లో దగ్గర ఉండే ఘటకేసర్‌లో స్థిరపడ్డారు. నాన్న రైతు. అమ్మ ఫిజికల్‌ డైరెక్టర్‌ టీచర్‌, ఇంగ్లీషు కూడా బోధించేది. అమ్మకి స్పోర్ట్స్‌ అంటే ఇష్టం. స్పోర్ట్స్‌లోనే ఉండాలని అనుకోనేదట. కానీ ఆడపిల్ల అని బయటకు పంపలేదు. త్వరగా పెళ్లి చేశారు. అయితే తనలా కాకూడదని.. నన్ను ప్రోత్సహించేది. చిన్నప్పుడు జిల్లా స్థాయిలో కబడ్డీ ఆడాను. డిగ్రీలో జాయినయ్యాక మిస్‌ ఫ్రెషర్‌ టైటిల్‌ గెలుచుకున్నా. ఆ తర్వాత లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంప్‌ వాక్‌ చేశా. మిసెస్‌ కవర్‌ గర్ల్‌ టైటిల్‌ విన్నర్‌ను. అప్పుడే కొన్నాళ్లు న్యూస్‌ ప్రెజెంటర్‌గా చేసి మానేశా. చదువులో హార్డ్‌వర్కర్‌ని. ఆ లక్షణంతోనే ఏ పని చేసినా గట్టిగా చేయాలనే సంకల్పం నాది. డిగ్రీ పూర్తయ్యాక మాటీవీలో ‘చాయ్‌ బిస్కెట్‌’ అనే లైవ్‌ చేశా. అప్పటి నుంచి ఈ రంగంలోకి పూర్తిగా వచ్చేశా. అన్నట్లు ఎమ్‌.ఎ. ఇంగ్లీష్‌ లిటరేచర్‌ పూర్తి చేశాను. 


అదే నేర్చుకున్నా.. 

ఎంటర్‌టైన్‌మెంట్‌ యాంకర్‌గా ఉన్నప్పుడు సహనం ఎక్కువ ఉండాలి. సెలబ్రిటీలు అనుకున్న సమయానికి రారు. ఎదురుచూడాల్సి వస్తుంది. క్రీడల విషయంలో అలా కాదు.. ఉదయం ఆరున్నర అంటే .. అదే సమయానికి రెడీ అవుతుంది ప్రోగ్రామ్‌. ఇక్కడ సమయం పాటించాలి. అదీగాక ఇంటర్నేషనల్‌ స్థాయి జనాలకు ఇంటరాక్టవ్వడం గొప్ప ఆనందకరమైన విషయం. స్పోర్ట్స్‌ ప్రెజెంటరయ్యాక నా ఆలోచనా తీరులో మార్పొచ్చింది. ఎందుకంటే క్రికెటర్లు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొని వస్తారు. రాజకీయాలతో ఒక్క మ్యాచ్‌కూడా అవకాశం రాదు. సరిగా ఆడితే ఓ రకంగా.. ఫెయిలయితే అభిమానులు మరో విధంగా ట్రీట్‌ చేస్తారు. ఎన్నో అవమానాలు, అప్‌ అండ్‌ డౌన్స్‌ చూసొస్తారు. వారిని చూశాక.. మనం చిన్నవాటికే కుంగిపోకూడదనిపిస్తుంది. మైండ్‌సెట్‌ మారింది. నా ఫేవరేట్‌ యువరాజ్‌ సింగ్‌. ఆయన కేన్సర్‌తో బాధపడినా.. మానసికబలంతో ఎదుర్కొన్నారు. గొప్ప క్రికెటర్‌గా ప్రపంచక్‌పను అందించడానికి కీలకంగా ఉపయోగపడ్డాడు. ఇక ధోనీ గురించి చెప్పనక్కర్లేదు. వరల్డ్‌క్‌పను అందించి దేశానికి పేరు తెచ్చారు. మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ వెంకటపతి రాజు ద్వారా ధోనీని కలిశా. ఆయనతో పది నిమిషాలు మాట్లాడటం సంతోషకరమైన విషయం. 


అదే నా ఆశయం.. 

హర్షాభోగ్లే, రవిశాస్ర్తి కామెంట్రీలను విని పెరిగినదాన్ని. వాళ్లతో మాట్లాడే అవకాశమొచ్చిందిప్పుడు. ఖాళీ సమయంలో హర్షాభోగ్లేని కల్సినప్పుడు ఎన్టీయార్‌, సూర్యకాంతం నటన గురించి మాట్లాడుకుంటుంటాం. ‘మాయాబజార్‌’ లాంటి పాత చిత్రాలను నెమరువేసుకుంటాం. హైదరాబాద్‌ హిందీలో ఉండే హాస్యాన్ని చక్కగా చెబుతారు. ఆయన కామెంట్రీ అద్భుతంగా ఉంటుంది.. కథలు చెబుతారు. తెలియని కొత్త విషయాలు చెబుతారు. పెళ్లయ్యాక మూడు రోజులకి గాజులు, గోరింటాకుతో ప్రెజెంటర్‌గా వెళ్లా. ‘ఆట అంటే ఇష్టం ఉన్నవాళ్లే ఇలా పని చేస్తారు’ అన్నారాయన. మా వారు విశాల్‌ కుమార్‌ ఎమ్‌.ఎన్‌.సీ సంస్థలో పనిచేస్తారు. ఆయనకి క్రికెట్‌ అంటే పిచ్చి. అర్ధరాత్రులైనా టీవీ చూస్తూనే ఉంటారు. ఫలానా ప్రశ్న అడగమని, బ్యాక్‌గ్రౌండ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇస్తారాయన.. ఆటలు ఒత్తిడిని తగ్గిస్తాయి. శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి ఆటలు మంచివే. నాకు సినిమా ఆలోచనలేమీ లేవు. ఎంటర్‌టైన్‌మెంట్‌ యాంకర్‌తో పాటు స్పోర్ట్స్‌ ప్రెజెంటర్‌గానే కొనసాగుతా. ప్రస్తుతం ముంబైలో ఉంటా. ఐపీఎల్‌ అయ్యాక వరల్డ్‌ కప్‌కూ వెళ్తాను. స్పోర్ట్స్‌ ప్రెజెంటర్‌గా భావి తరాలకు ఆదర్శంగా నిలవాలన్నదే ఆశయం. 

రాళ్లపల్లి రాజావలి

స్పోర్ట్స్‌ ప్రెజెంటర్‌ అవకాశమిలా!

బుల్లితెర కార్యక్రమాలు, రియాలిటీ షోలు చేసేదాన్ని. 2017లో స్టార్‌స్పోర్ట్స్‌ లాంచ్‌ అయింది. స్పోర్ట్స్‌ చానెల్‌లో యాంకర్‌ ఉద్యోగానికి ఆడిషన్‌ కోసం ముంబైకి రమ్మని ఫోన్‌ వచ్చింది. వెళ్లి ఆడిషన్‌ ఇచ్చా. అలా ప్రొ కబడ్డీ సీజన్‌-5లో ప్రెజెంటరయ్యా. కబడ్డీ క్రీడాకారిణి కాబట్టి రూల్స్‌ తెలుసు. ఆటమీద పట్టు ఉంది కాబట్టి.. ఆటగాళ్ల తీరు, ఎలా ఆడతారని ముందే ఊహించి చెప్పేదాన్ని. ఆ తర్వాత ఐపిఎల్‌ కోసం క్రీడా నేపథ్యముండే ఫిల్మ్‌ సెలబ్రిటీ కోసం చాలా వెతికారు. అయితే అప్పటికే ప్రొ కబడ్డీ కోసం పనిచేసినా నాకు.. ఆ అవకాశం దొరికింది. అలా ఐపీఎల్‌కు ప్రెజెంటరయ్యాను. ఎంటర్‌టైన్‌మెంట్‌ నా కంఫర్ట్‌ జోన్‌. స్పోర్ట్స్‌నూ మేనేజ్‌ చేస్తున్నా. 

పెళ్లయినా ఆడపిల్లలు చేసే పని మారాలనే నియమం లేదు. నా కెరీర్‌కి మా అమ్మ, మా ఆయన ప్రోత్సాహం ఎనలేనిది. చదువుతో పాటు ఆటలూ ముఖ్యం. ‘స్వేచ్ఛ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నా. చదువు, ఆరోగ్య సమస్యల మీద మా సంస్థ పని చేస్తుంది. ఈ క్రమంలో మారుమూల గ్రామాలకు కూడా వెళ్తుంటా. ‘కబడ్డీ, క్రికెట్‌లో వస్తావు కదక్కా’ అంటారు పిల్లలు. మహిళలూ గుర్తుపడతారు. ఏదో ఒక గేమ్‌ ఆడాలని పిల్లలకు చెబుతుంటా. సోషల్‌మీడియాలోని నెగటివ్‌ కామెంట్స్‌ పట్టించుకోను. అప్‌డేట్‌గా ఉండాలంటే వాడాల్సిందే. ఖాళీగా ఉంటే యూట్యూబ్‌ వ్లాగ్‌కోసం వీడియోలు చేస్తుంటా.