ఇదేం దా‘రుణం’

ABN , First Publish Date - 2021-10-18T05:46:17+05:30 IST

రాచర్ల మండలంలో మొత్తం 886 గృహాలు మంజూరయ్యాయి. వీరిలో 475 మందికి జగనన్న కాలనీల్లో నివేశన స్థలాలతోపాటు, ఇళ్లు కూడా మంజూరయ్యాయి. మొత్తం మీద ఇప్పటివరకూ నిర్మాణ పనులు చేపట్టినవి 100 కూడా దాటలేదు. ఈ నేపథ్యంలో డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు కాగా, ఇదే అదునుగా భావించిన అధికారులు వాటిని నిలిపివేశారు. డ్వాక్రా రుణాలు వచ్చిన వారిలో ఇంటి స్థలాలు మంజూరైన వారు, ఇంటి స్థలం ఉండి గృహాలు మంజూరైన వారి జాబితాలను బయటకు తీశారు. వారికి మంజూరైన డ్వాక్రా రుణ సొమ్మును ఆపివేసే కార్యక్రమం చేపట్టారు.

ఇదేం దా‘రుణం’
పాలకవీడులో జగనన్న కాలనీ ఇదే

జగనన్న ఇల్లు కట్టుకుంటేనే రుణమిస్తాం

డ్వాక్రా లోన్‌లను నిలిపివేసిన అధికారులు

లబోదిబోమంటున్న బాధితులు

రాచర్ల, అక్టోబరు 17 :

ప్రతి పేదకూ ఇంటి స్థలంతోపాటు గృహాన్ని నిర్మించి ఇస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పెద్దఎత్తున సొంత గూడు కోసం పేదలు దరఖాస్తు చేసుకున్నారు. తమ చిరకాల స్వప్నం నెరవేరుతుందని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో ప్రభుత్వం మాట మార్చింది. మడం తిప్పింది. ఇంటిని లబ్ధిదారుడే నిర్మించుకోవాలని తీవ్రమైన ఒత్తిడి చేస్తోంది. ఇందుకోసం అన్ని అడ్డదారులూ వెతుకుతోంది. తాజాగా డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలకు రుణాలను నిలిపివేయించింది. ఇంటిని కట్టుకుంటేనే మీకు మంజూరైన డ్వాక్రా రుణం ఇస్తామని అధికారులు బాధితులను భయపెడుతున్నారు. జగనన్న ఇల్లు మాట దేవుడెరుగు డ్వాక్రా రుణాలను అధికారులు ఆపివేయడంతో ఇదేమి పాలన అని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదీ రాచర్ల మండలంలో అధికారుల తీరు.

 రాచర్ల మండలంలో మొత్తం 886 గృహాలు మంజూరయ్యాయి. వీరిలో 475 మందికి జగనన్న కాలనీల్లో నివేశన స్థలాలతోపాటు, ఇళ్లు కూడా మంజూరయ్యాయి. మొత్తం మీద ఇప్పటివరకూ నిర్మాణ పనులు చేపట్టినవి 100 కూడా దాటలేదు. ఈ నేపథ్యంలో డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు కాగా, ఇదే అదునుగా భావించిన అధికారులు వాటిని నిలిపివేశారు. డ్వాక్రా రుణాలు వచ్చిన వారిలో ఇంటి స్థలాలు మంజూరైన వారు, ఇంటి స్థలం ఉండి గృహాలు మంజూరైన వారి జాబితాలను బయటకు తీశారు. వారికి మంజూరైన డ్వాక్రా రుణ సొమ్మును ఆపివేసే కార్యక్రమం చేపట్టారు. 

ఇల్లు కట్టుకుంటానని రాసిస్తే..

మండలంలోని పాలకవీడుకు చెందిన షేక్‌ ఖాదర్‌బీని పదేళ్ల క్రితం భర్త వదిలివేయడంతో ఒంటరిగా బంధువుల వద్ద ఆశ్రయం పొందుతోంది. ఆమెకు గ్రామంలో జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరైంది. ప్రభుత్వమే కట్టిస్తుందన్న ఆశతో నిర్మాణం చేపట్టలేదు. ముందే పేదరికంలో ఉన్న ఆమె గ్రామంలోని నవ్యశ్రీ మహిళా గ్రూపులో సభ్యురాలుగా చేరింది. అయితే ఆ గ్రూపులో 10 మంది సభ్యులు ఉండగా గతవారం రూ.3 లక్షలు డ్వాక్రా రుణం మంజూరైంది. ఎనిమిది మంది మహిళా సభ్యులు ఒక్కొక్కరు రూ.30వేల చొప్పున తీసుకున్నారు. అయితే జగనన్న ఇంటిస్థలం పొందిన ఖాదర్‌బీతోపాటు మరో మహిళకు రుణం ఇవ్వకుండా నిలిపివేశారు. వారితోపాటు రాచర్ల గ్రామానికి చెందిన ఎం.అచ్చమ్మ ఇంటి స్థలం ఉండగా, ఆమెకు గృహం మంజూరైంది. ఆమెకు కూడా డ్వాక్రా రుణం మంజూరు కాగా డబ్బులు ఇవ్వలేదు. ఇలా పలువురుకి రుణాలు నిలిపివేశారు. బాధితులు స్థానిక హౌసింగ్‌, వెలుగు కార్యాలయానికి వెళ్లి అధికారులను వేడుకున్నా వారి నుంచి సమాధానం రాకపోగా.. ఇల్లు కట్టుకుంటానని తమకు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 

జాబ్‌కార్డులూ నిలిపేశారు..

కడు పేదరికంలో ఉన్న తాము ఇంటిని నిర్మించుకోకపోవడంతో జాబ్‌కార్డులు రాకుండా సచివాలయ అధికారులు నిలిపివేశారని బాధిత మహిళలు విలపిస్తున్నారు. అనేకమందికి డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరైనప్పటికీ జగనన్న స్థలాలు తీసుకున్న మహిళలకు మాత్రం గృహ నిర్మాణాలు చేపట్టలేదనే కారణంతో వీవోలు రుణాలను నిలిపివేశారు. మొత్తంమీద పేదరికంతో జగనన్న ఇంటిని నిర్మించుకోలేక, మరో పక్క డ్వాక్రా రుణాలు వచ్చినా వాటిని అధికారులు ఇవ్వకుండా ఆపివేయడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


హౌసింగ్‌ అధికారులతో మాట్లాడి ఇస్తాం

రఘుబాబు, ఏపీఎం 

జగనన్న గృహాలు మంజూరైన మహిళలకు డ్వాక్రాలో రుణం మంజూరైన మాట వాస్తవమే. మండలంలో తొమ్మిది మంది డ్వాక్రా మహిళలకు రుణం మంజూరైంది. ఇంటిని నిర్మించుకునేలా అవగాహన కల్పించాలని హౌసింగ్‌ అధికారులు చెప్పడంతో వీటిని తాత్కాలికంగా నిలిపివేశాం. హౌసింగ్‌ అధికారులతో మాట్లాడి వారికి ఈ రుణం అందేలా చర్యలు తీసుకుంటాం. 


దిక్కులేని దానిని కనికరించండి

షేక్‌ ఖాదర్‌బీ, పాలకవీడు గ్రామం

భర్త వదిలివేసి పదేళ్లు అయింది. కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు. ఇంటిస్థలం మంజూరైంది. ప్రభుత్వమే కట్టి ఇస్తుందని ముందే చెప్పడంతో ఎంతో ఆశపడ్డాను. డ్వాక్రా మహిళల గ్రూపులో నాకు రూ.30వేల  రుణం మంజూరైంది. అయినా తనకు డబ్బులు ఇవ్వలేదు. ఇంటిని నిర్మించుకుంటేనే డబ్బులు ఇస్తామని చెప్పారు. ఏంచేయాలో పాలుపోవడం లేదు. 


బిడ్డ పెళ్లి ఉందని చెప్పినా కనికరించడం లేదు

బి.అచ్చమ్మ, రాచర్ల గ్రామం

నాకు రాచర్లలో ఇంటి స్థలం ఉంది. అధికారులు గృహం మంజూరు చేశారు. నేను ప్రస్తుతం కట్టుకోలేను. నాకు లక్ష్మీ డ్వాక్రా గ్రూపులో సభ్యత్వం ఉంది. గ్రూపునకు రూ.10లక్షలు రుణం మంజూరైంది. జగనన్న ఇంటిని కట్టుకుంటేనే నీకు రుణం ఇస్తామని చెప్పి డబ్బులు ఇవ్వలేదు. అధికారులను కకలిసి ప్రాథేయపడినా ఎవరి నుంచీ ఎలాంటి స్పందన రాలేదు.  త్వరలో నా కూతురు పెళ్లి ఉంది. ఇప్పటికైనా డ్వాక్రా రుణం డబ్బులు ఇస్తే పెళ్లి చేస్తాను. 



Updated Date - 2021-10-18T05:46:17+05:30 IST