ఇదేం క్లీనింగ్‌

ABN , First Publish Date - 2022-01-23T05:06:04+05:30 IST

కర్నూలు మార్కెట్‌ కమిటీ యార్డులో శుభ్రత పేరుతో అవినీతి పేరుకపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదేం క్లీనింగ్‌
కర్నూలు మార్కెట్‌ యార్డులో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే

  1. కర్నూలు యార్డులో ప్రతినెలా రూ. 4 లక్షల ఖర్చు
  2. అన్నీ దొంగ బిల్లులే అంటున్న పాలకవర్గం 
  3. కమీషన్‌ ఏజెంటుపైనా ఆరోపణలు.. కమిషనర్‌కు ఫిర్యాదు


 కర్నూలు మార్కెట్‌ కమిటీ యార్డులో శుభ్రత పేరుతో అవినీతి పేరుకపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుభ్రతకే నెలకు రూ. 2.5 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా ఖర్చు చేస్తున్నారు. లెక్కాపక్కాలేని ఈ దుర్వినియోగంపై విమర్శలు ఉన్నాయి. ఈ మేరకు యార్డు పాలకవర్గం మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్నకు ఫిర్యాదు చేసింది. దీంతో కమిషనర్‌ కార్యాలయం నుంచి సెక్రటరీ జయలక్ష్మికి, సూపర్‌వైజర్‌ శ్రీనివాసరావుకు తాఖీదులు అందాయి. తక్షణంకమిషనర్‌ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని వీరికి ఆదేశాలు అందాయి. దీంతో కమిషనర్‌ను కలవడానికి వీరిద్దరు బయలుదేరి వెళ్లారు. వేగంగా జరిగిన ఈ పరిణామాలు కలకలం రేపాయి. 

     - కర్నూలు(అగ్రికల్చర్‌) 

అవినీతి పరాకాష్ట

మెసిలేనియన్‌ పద్దు కింద ఆగస్టు నుంచి డిసెంబరు వరకు ప్రతి నెలా రూ.2.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో పేర్కొని.. వీటిని ఆమోదించాలని సెక్రటరీ ఈ నెల 8న పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో చైర్మన్‌ కొట్టం రోఖియాబీ, వైస్‌ చైర్మన్‌ రాఘవేంద్ర రెడ్డి, డైరెక్టర్లు మహబూబ్‌ బాషా, మంగమ్మ తదితరులు ఖర్చుల వివరాలను, ఓచర్లను సెక్రటరీ జయలక్ష్మిని అడిగారు. ఆమె సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పాలకవర్గం ఖర్చులు ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచారు. ఇప్పటి దాకా కర్నూలు మార్కెట్‌ కమిటీ చరిత్రలో యార్డులో చేసిన ఖర్చుకు ఆమోదం తెలపకపోవడం ఇదే మొదటిసారి. ఈ వ్యవహారంపై పాల కవర్గం, సెక్రటరీ మధ్య వివాదం పది రోజులుగా కీలకమైన మలుపులు తిరుగుతోంది. ఇరువురు పట్టుదలగా ఉండటంతో పరిస్థితి చేయి దాటిపోయింది. సెక్రటరీ తమ మాట వినకపోవడం, లెక్కలేకుండా వ్యవహరించడం, చేసిన ఖర్చుకు ఓచర్లు సమర్పించకపోవడంతో కమిటీ చైర్మన్‌, డైరెక్టర్లు ఇటీవల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సమస్య జఠిలం అవుతున్నట్లు గుర్తించిన కమిషనర్‌ అవినీతి ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే సెక్రటరీతోపాటు మరో సూపర్‌వైజర్‌ను తన వద్దకు పిలిపించుకుని జరిగిన విషయాలపై సమాచారం రాబట్టాలనుకున్నట్లు తెలుస్తోంది. 


మితిమీరిన ఖర్చు.. ఓచర్లు నిల్‌.. 

రైతుల స్వేదంతో సమకూరిన ఆదాయంలో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయడానికి వీల్లేదు. దాన్నంతా రైతుల ప్రయోజనం కోసమే ఖర్చు చేయాలి. అధికారులపై ఈ బాధ్యత ఉంది. దీన్ని అధికా రులు ఏనాడో తుంగలో తొక్కేశారు. సెస్సు ఆదాయం తగ్గుతున్న సమ యంలో పొదుపు పాటించాల్సిందిపోయి.. విచ్చల విడిగా ఖర్చు చేయడం ఆరంభించారు. దీనిపై పాలకవర్గ సభ్యులు, రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. యార్డు క్లీనింగ్‌, రైతుల విశ్రాంతి భవనం మర మ్మతులు, కంప్యూటర్ల మరమ్మతులు, ఆఫీస్‌ మెయింటెనెన్స్‌ మొదలైన వాటి పేరుతో ప్రతి నెలా రూ.2.50 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా ఖర్చు చేయడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. చెత్తా చెదారాన్ని బయటకు తరలించే ఖర్చులు తగ్గిస్తామని చెప్పి.. కొద్ది నెలల కింద ట్రాక్టర్‌ను కొన్నారు. దీని వల్ల ఖర్చు తగ్గుతుందని పాలకవర్గం, రైతులు కూడా సంతోషించారు. అయినా ప్రతి నెలా క్లీనింగ్‌ పేరుతో ఖర్చు పెంచుతూ పోయారు. యార్డు క్లీనింగ్‌ బాధ్యత తనకు నామమాత్రంగా అప్పగించి.. ఖర్చుకు సంబంధించిన బిల్లులు ఎవరు తెస్తున్నారో, బ్యాంకుకు వెళ్లి ఎవరు డబ్బులు డ్రా చేస్తున్నారో తనకేమీ తెలియదని, తనకు ఆ అధికారం లేదని, నిమిత్తమాత్రుడినని సూపర్‌వైజర్‌ మోహన్‌ రెడ్డి చెబుతున్నారు. అకౌంటెంట్‌ కార్నలీస్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. పేరుకే తాను అకౌంటెంట్‌నని, ఈ వ్యవహారాలన్నీ తన జూనియర్‌ చక్కదిద్దుతున్నాడని, తాను కేవలం కూరగాయల మార్కెట్‌లో షాపుల అద్దెలు మాత్రమే వసూలు చేస్తానని అంటున్నారు. 


వివాదం తారస్థాయికి

యార్డులో చేస్తున్న ఖర్చు విషయంలో పాలకవర్గం, సెక్రటరీ మధ్య వివాదం కొద్ది రోజులుగా తీవ్రమైపోయింది. ఈ క్రమంలోనే కమిషనర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో సెక్రటరీని, మరో సూపర్‌వైజర్‌ శ్రీనివాసరావును వెంటనే తన వద్దకు రావాలని కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. వీరిపై విచారణ పూర్తి స్థాయిలో జరిపి సస్పెండ్‌ చేస్తారా? బదిలీతో సరిపెడతారా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మరో రెండు మూడు రోజుల్లో ఈ వ్యవహారం తేలుతుందని మార్కెటింగ్‌ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. రూ. లక్షల్లో ఖర్చు చూపిస్తున్నప్పుడు మార్కెట్‌ యార్డు పరిశుభ్రంగా కనిపించాలి. అదీ లేదని, ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, పందులు, పశువులు కనిపిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. శుభ్రత లేకపోవడంతో రైతులు తమ పంట ఉత్పత్తులను ప్లాట్‌ఫారాలపై నిల్వ ఉంచి రెండు మూడు రోజులు అక్కడే ఉండటం కష్టంగా మారింది. అపరిశుభ్రత వల్ల దోమలు పెరిగిపోవడంతో రైతులు అనారోగ్యాలకు గురవుతున్నారు. 


కమీషన్‌ ఏజెంట్‌ పాత్రపై ఆరోపణలు

మార్కెట్‌ కమిటీ నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్న అధికారులు మరోవైపు ఒక కమీషన్‌ ఏజెంటు ద్వారా ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తూ అక్రమ ఆదాయానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమీషన్‌ ఏజెంట్ల లైసెన్సులను రెన్యువల్‌ చేయడం దగ్గరి నుంచి షాపులను కేటాయించడం దాకా అన్నింట్లోనూ ఈ కమీషన్‌ ఏజెంటే అధికారులకు సంధానకర్తగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొన్న  వ్యాపారులు వాటిని వెంటనే మార్కెట్‌ యార్డు బయటికి తీసు కెళ్లి తమ గోదాముల్లో నిల్వ చేసుకోవాలి. అయితే.. అధికారులకు కొంత మొత్తాన్ని ముట్టచెప్పి.. పంట ఉత్పత్తులను నెలల తరబడి వ్యాపారులు ప్లాట్‌ఫారాల్లోనే నిల్వ చేస్తున్నారు. బంగాళాదుంపలు, ఎండు మిర్చి మొదలైనవి చాలా కాలం కింద కొన్నవి కూడా ప్లాట్‌ఫారాలపై నిల్వ ఉండటం పట్ల సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. కూరగాయల మార్కెట్‌లో రైతుల నుంచి కమీషన్‌ వసూలు చేయరాదనే కమిషనర్‌ ఆదేశాలు అమలు కావడం లేదు. ఆ ఉత్తర్వులను అధికారులు తొక్కిపెట్టినట్లు కింది స్థాయి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలన్నింటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులను ఆశ్రయిస్తామని పాలకవర్గ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. 


ఖర్చుకు అంతే లేదు

మార్కెట్‌ యార్డులో క్లీనింగ్‌ పేరిట ఆగస్టు నుంచి డిసెంబరు దాకా ప్రతి నెలా రూ.2.50 లక్షల నుంచి రూ.4 లక్షలపైనే ఖర్చు చేస్తున్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. వాటికి ఓచర్లు, సరైన వివరాలు లేవు. అధికారులు తలా తోకా లేని సమాధానాలిస్తున్నారు. అందువల్ల ఈ బిల్లులను పాలకవర్గం ఆమోదించలేదు. ఈ వ్యవహారంపై కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. త్వరలోనే పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. రైతులకు న్యాయం చేస్తాం.

- కొట్టం రోఖియాబీ, చైర్మన్‌



Updated Date - 2022-01-23T05:06:04+05:30 IST