కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ కన్నా ఇదే అత్యవసరం..

ABN , First Publish Date - 2021-04-27T18:28:42+05:30 IST

కొవిడ్‌ జాగ్రత్తల్లో భాగంగా ఇరవై నుంచి నలబై సెకన్లవరకు చేతులు శుభ్రంచేసుకోవడం కామన్‌.

కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ కన్నా ఇదే అత్యవసరం..

కొవిడ్‌ జాగ్రత్తల్లో భాగంగా ఇరవై నుంచి నలబై సెకన్లవరకు చేతులు శుభ్రంచేసుకోవడం కామన్‌. ఓసీడీ వాళ్లు రోజులో నాలుగు లేదా ఐదు గంటలు చేతులు కడగడం మీదే శ్రద్ధపెడుతుంటారు. మాస్కు పెట్టుకోవడంతో సమస్యలొస్తాయనడంలో నిజం లేదు. కొవిడ్‌ వార్తలు తెలుసుకోవడం, ఆ లక్షణాలు తమకూ ఉన్నాయేమోనని ఊహించుకొని ఆందోళన చెందడమే హైపోకాండ్రియా.


కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ కన్నా ఆత్మస్థైర్యం అత్యవసరమని సీనియర్‌ సైకియాట్రిస్టు, మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ వ్యవస్థాపక సంచాలకుడు డాక్టర్‌ అశోక్‌రెడ్డి సూచిస్తున్నారు. కొవిడ్‌ సమయంలో మానసిక సమస్యలూ అధికమవుతున్నాయని ఆయన చెబుతున్నారు. - డాక్టర్‌ అశోక్‌రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్టు. 


హైదరాబాద్‌ సిటీ : కొవిడ్‌-19 వైరస్‌ శారీరకంగానే కాదు, చాలామందిని మానసికంగానూ వేధిస్తుంది. అనుమానాలను తద్వారా అతిజాగ్రత్తలను పెంచుతుంది. ఈ మార్పులన్నీ మానసిక సమస్యలకు లేదా మానసిక వ్యాధులకూ దారితీయొచ్చు. మానసిక సమస్యలు అంటే మనుషులకు ఆలోచనల పరంగా అసౌకర్యం అనిపిస్తుందే గానీ తాము చేసే పనుల్ని సజావుగా చేసుకోగలుగుతారు. వారు సలహాలు, సూచనల ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. ఆ సమస్యలు తీవ్రమైతే మానసిక వ్యాధిగా మారుతుంది. అలాంటి వ్యక్తులకు తప్పనిసరిగా వైద్యం అవసరం అవుతుంది.


ఆందోళన మీరితే...

ఎక్కువ ఆందోళన చెందితే ఆ ప్రభావం శరీరంపైనా పడుతుంది. గుండె దడ, చెమటలు పట్టడం, చేతులు వణుకు, అరచేతుల్లో చెమటలు, నాలుక తడారడం, అతిమూత్రం, నిద్రలేమి, ఏకాగ్రతాలోపం, చంచలత్వం వంటివన్నీ ఆందోళనా లక్షణాలే. ఆందోళన తగ్గడానికి చాలా ప్రక్రియలున్నాయి. మందులద్వారా, ధ్యానం, యోగా వంటి యాక్టివిస్ట్‌తోనూ ఉపశమనం లభిస్తుంది.


వ్యాకులత వీడాలంటే...

సాధారణంగా మనమేదైనా కోల్పోవడం వల్లగానీ అనుకోని కష్టం ఎదురైనప్పుడు మనల్ని దిగులు ఆవరిస్తుంది. ఇది ప్రతి మనిషికీ వస్తుంది. సమస్య రెండు వారాల కన్నా మించి ఉంటే మానసిక వ్యాధిగా పరిగణించాలి. దీర్ఘకాలం వ్యాకులతకు లోనుకావడం వల్ల ఏ పనిమీదా శ్రద్ధ పెట్టలేరు. దీన్నే డిప్రెస్సీవ్‌ డిజార్డర్‌ అంటాం. వీళ్లకు ధైర్యం చెప్పడం ద్వారా కొంతవరకు నయం చేయవచ్చు. పరిస్థితి చేయి దాటినప్పుడు మాత్రం యాంటీ డిప్రెస్సీవ్‌ మందులతోనే వ్యాకులతను నయం చేయగలం. కొంతమందిలో వ్యాకులత పెరిగినప్పుడు ఆత్మహత్య ఆలోచనలు కలుగుతుంటాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పోగొట్టుకుంటారు.


ఓసీడీ మితిమీరితే...

కొవిడ్‌ కాలంలో అబ్సెస్సీవ్‌ కంపల్సీవ్‌ డిజార్డర్‌(ఓసీడీ) కేసులూ పెరిగాయి. వీళ్లకు అనుమానాలు, అతిజాగ్రత్తలు ఎక్కువ. ఇతర పనులు చేయలేరు. వాళ్ల వల్ల కుటుంబ సభ్యులూ ఇబ్బందిపడతారు. ఓసీడీలో ఆలోచనలు అదుపుతప్పుతాయి. ప్రాథమిక స్థాయిలోనే ఉంటే సలహాలతో సమస్యను తగ్గించవచ్చు. 


మరికొన్ని సమస్యలు....

లాక్‌డౌన్‌లో మొదటి మూడునెలలు మానసిక వ్యాధులకు వైద్యం అందుబాటులో లేకపోవడం వల్ల స్కిజోఫ్రెనీయా, మానియా తదితర మానసిక సమస్యల తీవ్రత పెరిగింది. ఇదే అదనుగా కొందరు రోగులు మందులు వాడకపోవడం వల్లకూడా సమస్య జఠిలమవడం గమనించాం. ఇప్పుడు పరిస్థితులు కాస్త మారాయి. తొలిదశతో పోలిస్తే రెండో దశలో ప్రజల్లో అవగాహన పెరిగింది. టెలీ మెడిసిన్‌ కూడా అందుబాటులోకి రావడంతో సులువుగా రోగులకు చికిత్సను అందించగలుగుతున్నాం.


అందులో నిజం లేదు...

కొవిడ్‌ ట్రీట్మెంట్‌లో భాగంగా కొన్నిరకాల స్టెరాయిడ్స్‌ వాడతారు. అవి ఎక్కువరోజులు వాడటం వల్ల డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే, కొవిడ్‌ చికిత్సలో స్టెరాయిడ్స్‌ వాడటం వల్ల కుంగుబాటు వంటి సమస్యలు తలెత్తినట్లు ఇంతవరకూ మా దృష్టికి రాలేదు. కనుక ఆందోళన అవసరం లేదు. మాస్కు ఎక్కువ సేపు ధరించడం వల్ల మెదడుకు ఆక్సిజన్‌ సరిగ్గా అందక, కొన్నిరకాల మానసిక సమస్యలు తలెత్తుతాయని ఆ మధ్య ఎవరో ఒక ప్రముఖ వ్యక్తి అన్నట్లున్నాడు. ప్రస్తుతం మాస్కు ఒక్కటే కొవిడ్‌ను నిలువరించడంలో ప్రధాన అస్త్రం. మాస్కు పెట్టుకోవడంతో సమస్యలొస్తాయనడంలో నిజం లేదు. 


మానవ సంబంధాలు...

వర్క్‌ఫ్రంహోం వల్ల తల్లిదండ్రులు, పిల్లలు ఒకచోటకు వచ్చారు. అన్యోన్యంగా ఉండేందుకు సమయం దొరికింది. అయితే, భార్య,భర్తలు ఒకేచోట ఎదురుబొదురుగా ఉండడం, వాళ్ల మధ్య అనవసరమైన సంభాషణలు చోటుచేసుకోవడం, హద్దులు మీరి మాట్లాడుకోవడం, అనవసరమైన విషయాలు చర్చించుకోవడం వల్ల మనస్పర్థలు పెరిగి వైవాహిక బంధంలో పొరపొచ్చాలు వస్తున్న సందర్భాలున్నాయి. మొత్తంగా చూస్తే ఒక రకంగా మానవసంబంధాలకు కొవిడ్‌ మంచే చేసింది. 


హైపోకాండ్రియా...

కొవిడ్‌ వార్తలు తెలుసుకోవడం, ఆ లక్షణాలు తమకూ ఉన్నాయేమోనని ఊహించుకొని ఆందోళన చెందడమే హైపోకాండ్రియా. ఈ వ్యాధి ఉన్నవాళ్లు తమకు లేని జబ్బును ఉన్నట్టుగా ఊహించుకొని బెంబేలెత్తుతారు. దీనికి సైబర్‌ కాండ్రియాకూడా జతకలుస్తుంది. ఇంటర్నెట్‌లో కొవిడ్‌గురించి ఎక్కువగా బ్రౌజ్‌ చేయడం, అవసరానికి మించిన సమాచారాన్ని తెలుసుకోవడం. దాన్ని తమకు వర్తింపజేసుకుని మానసిక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరుగుపొరుగు, బంధు, మిత్రులు ఎవరైనా చనిపోయినా తాత్కాలికంగా కొంత డిస్ట్రబ్‌ అవుతాం. అంతమాత్రాన మానసిక సమస్య అనుకోలేం.


ఇంటర్నెట్‌ డిజార్డర్‌...

పెద్దలకు వర్క్‌ఫ్రంహోం, పిల్లలకు స్కూళ్లు, కాలేజీలు సెలవులతో ఇంటర్నెట్‌ వాడకం పెరిగింది. చాలామంది పిల్లల్లో గేమింగ్‌ డిజార్డర్‌ చూస్తున్నాం. పెద్దవాళ్లు అయితే, కొందరు ఎప్పుడు చూసినా ల్యాప్‌టాప్‌ ముందేసుకొని, ఇతర కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వకుండా ఖాళీసమయాల్లో సినిమాలు లేదంటే వీడియోలు చూస్తూ గడిపేస్తున్నారు. మరికొందరు పోర్న్‌కు ఎక్కువ అలవాటవుతున్నారు. ఇలా ఒక్కో వయసువారు ఒక్కో డిజార్డర్‌కు లోనవుతున్నారు. 


భయాన్ని జయించండి ఇలా...

కొవిడ్‌ మరణాల సంఖ్య రెండు శాతం కన్నా తక్కువ. కొవిడ్‌ బారినపడినవారిలో ఐదు శాతం మందికి మాత్రమే ఆస్పత్రిలో చికిత్స అవసరం అవుతుంది. కనుక ఇలాంటి వాస్తవాలను తెలుసుకోవడం ద్వారా భయాన్ని జయించవచ్చు. నెగెటివిటీకి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. తద్వారా ధైర్యానికి దగ్గరవుతాం.

Updated Date - 2021-04-27T18:28:42+05:30 IST