Advertisement
Advertisement
Abn logo
Advertisement

మిల్లుల్లో ఇదేం దోపిడీ!

 ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాకా మళ్లీ కోతలా?

 ఐకేపీ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు

అల్లాదుర్గం, డిసెంబరు 7 : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం విక్రయాల్లో అన్నదాతలకు అడుగడుగున కష్టాలు, నష్టాలే ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ రైతులను దోపిడీ చేస్తుండడంతో బాధిత రైతులు లబోదిబోమంటూ మంగళవారం అల్లాదుర్గంలోని ఐకేపీ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళ్లే.... మండలంలోని రాంపూర్‌లోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో సీతానగర్‌ గిరిజనతండాకు చెందిన పలువురు రైతులు పదిహేను రోజుల క్రితం ధాన్యాన్ని విక్రయించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు  తేమ శాతం 17 కంటే తక్కువగా ఉన్న ధాన్యాన్ని నిర్వాహకులు కొనుగోలు చేసి సంబంధిత మిల్లులకు తరలించారు. అయితే ధాన్యం కొనుగోలు చేసిన దాని కంటే భారీగా తగ్గించినట్లు మిల్లుల యజమానులు తెలియజేశారని ఐకేపీ అధికారులు తెలపడంతో బాధిత రైతులు నివ్వెరపోయారు. స్థానిక ఐకేపీ కార్యాలయానికి తరలివచ్చి అధికారులను నిలదీశారు. దీంతో స్పందించిన అధికారులు తమ తప్పేమీలేదని, తూకం వేసిన ధాన్యం రైతుల సమక్షంలోనే మిల్లులకు తరలించామని, మిల్లులో తేమ శాతం ఎక్కువగా వచ్చిందని ధాన్యం బస్తాలలో కోత విధించారని రైతులకు వివరించారు. కొనుగోలు కేంద్రంలో నిబంధనల మేరకు తేమ శాతం ఉన్నా... మిల్లులకు తరలించాకా అధికశాతం తేమ ఉందని కోత విధించడం ఏమిటని ప్రశ్నిస్తూ ఆందోళన చేశారు. ఒక్కో రైతు నుంచి సుమారు 3 క్వింటాళ్ల నుంచి 5 క్వింటాళ్ల కోత విధించారని, తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అయితే ఈ విషయమై సంబంధిత మిల్లుల యజమానులతో చర్చించి న్యాయం చేస్తామని ఏపీఎం నాగరాజు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

11 బస్తాల కోత విధించారు

ధాన్యం కొనుగోలు కేంద్రంలో వారం రోజుల పాటు ఆరబోసి 12 శాతం తేమ శాతం వచ్చాక నిర్వాహకులు ధాన్యాన్ని తూకం వేశారు. కొనుగోలు కేంద్రంలో 217 బస్తాల ధాన్యం విక్రయిస్తే, మిల్లులో 11 బస్తాలు కోత విధించి 206 బస్తాలకు బిల్లులు చెల్లించారు. ఇప్పటికే తరుగు పేరుతో కిలో ధాన్యం అధికంగా తూకం వేసిన నిర్వాహకులు, మిల్లుకు తరలించిన ధాన్యంలో రెండో సారీ కోత విధించడం దారుణం.

-రాజు, రైతు, సీతానగర్‌ గిరిజన తండా


Advertisement
Advertisement