అమిత్ షా, ఇదీ మా ఆశ

ABN , First Publish Date - 2020-07-03T10:23:22+05:30 IST

ప్రజాస్వామికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడాన్ని, నిష్పాక్షిక చర్చలు జరపడాన్ని నిరాకరించడం, నిరాదరించడం ప్రమాదకరం కాదూ? లాక్‌డౌన్ కాలంలో పాలకులు తమ సంకల్పాన్ని ప్రజలపై రుద్దారు. పాలనలో పారదర్శకత

అమిత్ షా, ఇదీ మా ఆశ

పరిహాసం పవిత్ర విషయాలనూ గౌరవించదు. సామాజిక మాధ్యమాలు, దేశ రాజకీయాలను శాసించడంలో రెండో అత్యంత శక్తిమంతుడిని కూడా తమ నీచ, క్రూర వ్యాఖ్యల నుంచి మినహాయించడం లేదు మరి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కొవిడ్-19 లాక్‌డౌన్ మొదటి రెండు నెలలూ బహిరంగ జీవితంలోకి రానేలేదు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఊహాగానాలు వినపడ్డాయి. అంతిమంగా తాను క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నానని అమిత్ షా స్వయంగా ఒక ప్రకటన చేశారు. గత నెలలో లాక్‌డౌన్‌ను సడలించడం ప్రారంభమైన తరువాత మన కాలం అపర చాణక్యుడు విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేకుండా పోయింది. అమిత్ షా మళ్ళీ దేశ రాజకీయాలను చురుగ్గా నిర్దేశించడం ప్రారంభించారు.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో ప్రభుత్వ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మీడియాకు అమిత్ షా పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. బిహార్, ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన పలు ‘వర్చ్యువల్’ ర్యాలీలలో ఆయన మహోత్సాహంతో ప్రసంగించారు. రాజ్యసభ ఎన్నికలను స్వయంగా పర్య వేక్షించారు. ముఖ్యంగా తన సొంతరాష్ట్ర మైన గుజరాత్ నుంచి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. మణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి ముంచుకొచ్చిన ముప్పు ను నివారించారు. మరింత ఆసక్తికరమైన విశేషమేమిటంటే కొవిడ్ పీడిత దేశ రాజధాని పాలనా వ్యవహారాలలో ‘బిగ్ బాస్’గా అమిత్ షా ఆవిర్భవించారు. 


దేశ రాజకీయాలలో అమిత్ షా మళ్ళీ ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నారు. ఇది, ఒక విధంగా తాళం వేసిన రాజకీయాలకు తాళం తీయడం (అన్ లాకింగ్) లాంటిదేనని చెప్పక తప్పదు. ఎందుకంటే మూడు నెలల లాక్‌డౌన్‌లో దేశ ఆర్థిక వ్యవస్థకే కాదు, దేశ రాజకీయాలకు సైతం తాళం వేయడం జరిగింది. ఆర్థికమూ, రాజకీయమూ రెండూ లాక్‌డౌన్‌లో ఉండిపోయాయి. దుర్బలమైపోయిన ప్రతిపక్షాలు భీరువుల్లా వ్యవహరించసాగాయి. కనీవినీ ఎరుగని సంక్షోభంతో కొట్టుమిట్టులాడుతున్న ప్రజలు, వారి యోగక్షేమాల గురించి చిత్తశుద్ధి తో పట్టించుకోని పాలకుల విషయమై తమ ఆవేదనను, ఆగ్రహాన్ని ట్విట్టర్ మాధ్యమం ద్వారా వ్యక్తం చేసేందుకే విపక్షాలు పరిమితమైపోయాయి. ప్రజల కష్ట నష్టాల గురించి చర్చించేందుకు ప్రజావేదికలేవీ లేకుండా పోయాయి. దేశాన్ని చుట్టి ముట్టిన సమస్యల గురించి చర్చించేందుకు గాను పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేర్పాటు చేయడంపై ప్రభుత్వం శ్రద్ధ చూపనే లేదు. పార్లమెంటు సెలెక్ట్ కమిటీలు, స్థాయీ సంఘాలు సైతం ఒక్కసారి కూడా సమావేశమవ లేదు. నిజమే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా విపత్తునెదుర్కొనే విషయమై చర్చించేందుకు ముఖ్యమంత్రులతో అరడజన్ సార్లు వీడియో సమావేశాలు నిర్వహించారు. తూర్పు లద్దాఖ్‌లో చైనా సైన్యం దుశ్చర్యల పై ఒక అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇవన్నీ సైబర్ వేదికలపై సంప్రతింపులే. విస్తృత స్థాయిలో ప్రజా చర్చకు ఇవెలా ప్రత్యామ్నాయమవుతాయి? 


ప్రజాస్వామికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడాన్ని, నిష్పాక్షిక చర్చలు జరపడాన్ని నిరాకరించడం, నిరాదరించడం ప్రమాదకరం కాదూ? లాక్‌డౌన్ కాలంలో పాలకులు తమ సంకల్పాన్ని ప్రజలపై రుద్దారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీ తనం లేకుండాపోయాయి. తూర్పు లద్దాఖ్ లో భారత్- చైనా సరిహద్దులో మన జాతీయ భద్రతకు ఎనలేని ముప్పు వాటిల్లింది. అసలు అక్కడేమి జరిగింది? వాస్తవాలు గోప్యంగా ఉండిపోయాయి. అధికార వర్గాల ప్రకటనలు సత్యాలను వెల్లడించడం లేదని సామాన్య ప్రజలకూ అర్థమయింది. లాక్‌డౌన్‌తో లక్షలాది శ్రామిక కుటుంబాలు దిక్కు దివాణం లేకుండాపోయాయి. వలస కార్మికుల కుటుంబాలు కాలినడకనే వందల కిలో మీటర్ల దూరంలోని స్వస్థలాలకు తరలిపోయాయి. ఈ తిరుగు వలసలు స్వతంత్ర భారత మహా విషాదాలలో ఒకటని పలువురు వ్యాఖ్యానించారు. ఈ విషాదానికి ఎవరు కారకులు? సంపద స్రష్టలైన కార్మికులను అలా అనాథలుగా ఎలా వదిలివేశారు? రాష్ట్ర ప్రభుత్వాలే ఇందుకు బాధ్యత వహించాలని కేంద్రం పేర్కొంది! ఆరోగ్యభద్రతా సదుపాయాలను మెరుగుపరచడంలో వైఫల్యాలకూ రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అని కేంద్రం నిందించింది! సరైన వైద్య సదుపాయాలు లేకుండా కరోనా వైరస్ లాంటి ఆరోగ్య విపత్తును ఎదుర్కోవడం ఎలా? ఏలికలకు పట్టనే లేదు. ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలకు ఒకరిద్దరు మినహా పారిశ్రామిక వేత్తలెవరూ కిమ్మనలేదు. ఆక్షేపణ తెలిపితే ప్రభుత్వం తమ పట్ల ఎలా వ్యవహరిస్తుందో వారికి బాగా తెలుసు మరి. సమాచార హక్కు చట్టం కింద ప్రధానమంత్రి కేర్స్ ఫండ్ గురించిన సమాచారాన్ని కోరిన వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరాలు లభించనేలేదు. రెండు నెలల్లో మొత్తం 22 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచారు. ఎందుకు పెంచిందీ ఒక్క సారి కూడా కించిత్ వివరణ ఇవ్వలేదు! ఢిల్లీ అల్లర్లకు ప్రధాన కుట్రదారుగా 27 ఏళ్ళ జమియా విద్యార్థి ఒకరిపై అభియోగం మోపారు. అయితే ఇదే వ్యవహారంలో పాలకపక్షంతో సంబంధాలు ఉన్న రాజకీయ నాయకులు క్లీన్ చిట్ ఇచ్చారు! జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులకు సహాయపడుతున్నాడనే ఆరోపణపై ఒక పోలీసధికారిని అరెస్ట్ చేసి, చార్జిషీటు దాఖలు చేయలేదనే సాకుతో బెయిల్ పై విడుదల చేశారు. అయితే మానవహక్కుల కార్యకర్తలకు బెయిల్ ఇవ్వడానికి ప్రభుత్వం ససేమిరా అంటోంది. 


కేంద్రంలోను, రాష్ట్రాలలోనూ రాజ్యవ్యవస్థ ఇలా హద్దూ అదుపులేని విధంగా అధికారాలు చెలాయిస్తున్న అశుభ, ఆందోళనకర పరిస్థితులలో ‘మహా విభజనకారి’ అమిత్ షా మళ్ళీ రంగంలోకి వచ్చారు నరేంద్ర మోదీ రెండో ప్రభుత్వంలో తమ పార్టీ ఎజెండాను అమలుపరిచేందుకు హోం మంత్రి అమిత్ షా వలే మరే మంత్రికూడా పూనుకోలేదు. తాము విశ్వసించే రాజకీయాలు మరింతగా వర్థిల్లడమే అమిత్ షా ధ్యేయం. ఈ లక్ష్యసాధనకే కశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తినిస్తున్న అధికరణ 370ని రద్దుచేశారు. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చారు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సన్నాహాలను వేగవంతం చేశారు. బీజేపీ హిందూత్వ ఎజెండాను అమిత్ షా అద్వితీయంగా ముందుకు తీసుకుపోయారు.

 

దేశ రాజకీయాల్లో అమిత్ షా మళ్ళీ కేంద్ర స్థానంలోకి రావడం సూచిస్తున్నదేమిటి?కరోనా వైరస్ పీడిత దేశంలో రాజకీయ వ్యవహారాల నిర్వహణపై మోదీ ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించనున్నదని స్పష్టమవుతున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో గెలవడమే లక్ష్యంగా మోదీ సర్కార్ పనిచేయనున్నది. ఈ సంవత్సరాంతంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న పాలక కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతైనా ఉన్నది. అయినప్పటికీ ఆ విజయంపై ఎలాంటి ఢోకాలేకుండా చేసేందుకు అమిత్ షా రాజకీయ నైపుణ్యాలు ఎంతైనా అవసరం మరి. బిహార్ కంటే పెద్ద, గొప్ప బహుమానం బెంగాల్. ఆ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చేఏడాది ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్ లో బీజేపీని అధికారానికి తీసుకురావడమనేది అమిత్ షా జీవిత ధ్యేయంగా ఉన్నది. కరోనా వైరస్, భయంకర తుఫాన్‌తో పూర్తిగా కుదేలైపోయివున్న బెంగాల్‌లో తన ప్రత్యర్థి మమతా బెనర్జీపై ఒక తీవ్ర రాజకీయ సమరానికి అమిత్ షా ఉపక్రమించారు. దీన్ని బట్టి బీజేపీ విరోధులపై ఆయన ఎంత నిర్దాక్షిణ్యంగా పోరాడనున్నది మరొకసారి స్పష్టమయింది.


పోరాడడమే అమిత్ షా స్వాభావిక లక్షణం. అయితే కరోనా విపత్తు లాంటి సందర్భాలలో ఆ వ్యవహార సరళిలో మార్పులు ఎంతైనా అవసరం. ఘర్షణ వైఖరిని విడనాడి ఏకాభిప్రాయ సాధనతో ప్రజల శ్రేయస్సుకు కృషి చేయాలి. అధికార ప్రతిపక్షాలు తమ విభేదాలను విస్మరించి పరస్పర సహకారంతో పని చేయాలి. ఇప్పటికే మన సువిశాల, వైవిధ్య సమాజంలో పలు విభేదాలు నెలకొనివున్నాయి. వాటిని మరింతగా తీవ్రతరం చేయడం తగదు. భయపెట్టి, బెదిరించి పాలించాలనుకోవడం ఎంత మాత్రం ప్రజా హితానికి తోడ్పడదు. అమిత్ షా లాంటి నాయకుడు తనను తాను పరిస్థితులకు అనుగుణంగా ఆవిష్కరించుకుంటాడా అనేది నిశ్చితంగా చెప్పలేము. సుపరిపాలనను సుసాధ్యం చేసే సూత్రాలు ఎన్నికలలో విజయం సాధించేందుకు అనుసరించే వాటికి పూర్తిగా భిన్నమైనవి కదా. ఢిల్లీలో కరోనా పై యుద్ధాన్ని , రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. కనుకనే కాబోలు ఈ రోజు ఏకపక్షంగా తీసుకున్న పలు నిర్ణయాలను మరుసటిరోజే ఉపసంహరించుకుంటున్నారు. కరోనా ఉపద్రవం లాంటి సందర్భాలలో ప్రజల శ్రేయస్సు దృష్ట్యా నాయకులు తమ వ్యక్తిగత అహాలను విడనాడాలి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పట్ల అమిత్ షా కు గౌరవాభిమానాలు ఉండకపోవచ్చు. అయితే కేంద్ర హోం మంత్రిగా, ఢిల్లీ ముఖ్యమంత్రితో తన వ్యక్తిగత విభేదాలను ఉపేక్షించి ఆయనతో కలిసికట్టుగా ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేయాలి. ఇది హోం మంత్రి నైతిక బాధ్యత. అమిత్ షా తన రాజకీయ ప్రస్థానంలో ఇంతవరకు సమాజంలోని వివిధ సామాజిక వర్గాల మధ్య విభేదాలు, విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తిగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు కరోనా ఉపద్రవం, ఆర్థిక సంక్షోభంతో అల్లల్లాడిపోతున్న అన్ని వర్గాల ప్రజలకు పరిపూర్ణ మనోస్థైర్యం సమకూర్చడం ద్వారా ఆయన సువిశాల, వైవిధ్య భారతీయ సమాజంలో ఒక సమైక్యశక్తిగా రూపొందాల్సిన అవసరమున్నది. అటువంటి ఉదాత్త పరివర్తన అమిత్ షాలో వచ్చిన పక్షంలో, ఆ మార్పు ఆయన రాజకీయ జీవిత గమనంలో ఒక ప్రధాన ముందడుగు అవగలదు.

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్)

Updated Date - 2020-07-03T10:23:22+05:30 IST