ఇది చైనీస్‌ ప్రీమి‌యర్‌ లీగ్ కాదు

ABN , First Publish Date - 2020-07-01T08:49:59+05:30 IST

భారత్‌లో చైనా కంపెనీలను నిషేధించాలనే డిమాండ్‌కు ఐపీఎల్‌కు చెందిన పలు ఫ్రాంచైజీలు కూడా మద్దతు పలికాయి. ఈనేపథ్యంలో ఐపీఎల్‌తో ఆయా సంస్థలు ...

ఇది చైనీస్‌ ప్రీమి‌యర్‌ లీగ్ కాదు

ఆ దేశ కంపెనీలతో ఒప్పందం వద్దు

ఐపీఎల్‌ ఫ్రాంచైజీల మనోగతం

దేశ ప్రయోజనాలే ముఖ్యం: నెస్‌ వాడియా

న్యూఢిల్లీ: భారత్‌లో చైనా కంపెనీలను నిషేధించాలనే డిమాండ్‌కు ఐపీఎల్‌కు చెందిన పలు ఫ్రాంచైజీలు కూడా మద్దతు పలికాయి. ఈనేపథ్యంలో ఐపీఎల్‌తో ఆయా సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందాలకు కూడా ముగింపు పలకాలని తేల్చి చెప్పాయి. ఇప్పటికే చైనాకు చెందిన 59 మొబైల్‌ అప్లికేషన్లను కేంద్రం నిషేధించిన విషయం తెలిసిందే. సరిహద్దులో చైనా దూకుడుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆ దేశంపై వ్యతిరేకత కనబడుతున్న నేపథ్యంలో చైనా స్పానర్సర్‌షి్‌పలపై సమీక్ష కోసం ఐపీఎల్‌ పాలకమండలి సమావేశం కావాలని కూడా నిర్ణయించుకుంది. అయితే ఈ విషయంలో కఠిన నిర్ణయమే తీసుకోవాలని ఐపీఎల్‌ జట్టు పంజాబ్‌ కింగ్స్‌ లెవన్‌ సహ యజమాని నెస్‌ వాడియా తేల్చి చెప్పాడు. ‘ఐపీఎల్‌తో సంబంధం కలిగిన చైనా కంపెనీలను  పక్కనబెట్టాల్సిందే. ఆర్థిక లాభాలకన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యం. అయినా ఇది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కానీ చైనీస్‌ ప్రీమియర్‌ లీగ్‌ కాదు. ఇతరులకు మనం ఓ ఉదాహరణగా నిలవాలి.


ఆరంభంలో మరో స్పాన్సర్‌ దొరకడం కష్టమవుతుందేమో. కానీ వారి స్థానంలో మెరుగైన భారత కంపెనీలు కచ్చితంగా లభిస్తాయి. దేశానికి, సైనికులకు మనం తగిన గౌరవం ఇవ్వాలి. అందుకే కేంద్రం చెప్పడానికి ముందే మనమే వాటిని నిషేధిస్తున్నట్టు ప్రకటించాలి. నేనే బీసీసీఐ అధ్యక్షుడినైతే ఈపాటికే వచ్చే సీజన్‌ కోసం భారత కంపెనీని స్పాన్సర్‌గా వెతకమని చెప్పేవాణ్ణి. వ్యక్తిగతంగా నేను చైనా వస్తువులను వాడేందుకు ఇష్టపడను’ అని నెస్‌ వాడియా స్పష్టం చేశాడు. మరోవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎ్‌సకే) కూడా చైనా కంపెనీల బాయ్‌కాట్‌కు మద్దతు పలికింది. మరో స్పాన్సర్‌ లభించడం కష్టమే అయినా, దేశం కోసం సరైన నిర్ణయం తీసుకోవాల్సిందేనని సీఎ్‌సకే సీనియర్‌ అధికారి తెలిపాడు. మరో జట్టు అధికారి కూడా కేంద్రం తీసుకునే నిర్ణయాల ప్రకారం నడుచుకుంటామని పేర్కొన్నాడు.

Updated Date - 2020-07-01T08:49:59+05:30 IST